వాయులింగం

(IPLTOURS)

పంచభూతలింగములు తమిళనాడు రాష్ట్రముయందుగల అగ్ని (అరుణాచలేశ్వర్), జల (జంబుకేశ్వర్), పృద్వి (కాంచీపురం) మరియు ఆకాశ (చిదంబరం) మరియు ఆంద్రప్రదేశ్ నందు కాళహస్తిలోకల వాయులింగము. పంచభూతలింగములు ఆయా పంచభూతముల తత్వమును కలిగి ఉంటాయి. శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాస్త్రములో చిత్తూరుజిల్లానందు స్వర్ణముఖి నదీతీరమున గలపట్టణము. శ్రీకాళహస్తినందున్న శివలింగము ద్వాదశజ్యోతిర్లింగము కాకపోయనను కన్నప్ప తనకంటిని రక్తముకారుచున్న శివలింగము కనులనుండి రక్తప్రవాహము నిలువరించుటకు సమర్పించి ముక్తిపొందిన క్షేత్రము అందువలన అంతేకాక శ్రీ(సాలెపురుగు), కాల (నాగుపాము) మరియు హస్తి (ఏనుగు) స్వామిని అర్చించుటద్వారా ముక్తిపొంది వారినామములతో శ్రీకాళహస్తిగా పిలువబడుచున్న ఈక్షేత్రము మిక్కిలి ప్రాశస్తమైనది. రాహు మరియు కేతుగ్రహశాంతికి పూజలు జరిపించిన వారికి రాహు మరియు కేతుగ్రహ దుస్పరిణామములనుండి విముక్తి కలిగించి శుభములను కలుగజేయు ఈక్షేత్రమునందు శివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా ప్రసెద్ధుడు. పార్వతీదేవి ఇచ్చట జ్నానప్రసూనంబగా ప్రసిద్ధిచెందినది. 

శ్రీకాళహస్తి ఆలయం

శ్రీకాళహస్తి ఆలయం తిరుపతికి 36 కి.మీ, దూరములో పంచభూతములలో ఒకటిఅయిన వాయువుపేరుతో వాయులింగముగా ప్రసిద్ధిచెందినది. ఈఆలయము దక్షణకైలాసముగాను, రాహు కేతుక్షేత్రముగాను భావించబడుచున్నది. అయిదవశాతాబ్దములో చోళ రాజులచే నిర్మించబడి పన్నెండవశతాబ్దమునందు విజయనగరరాజులచే అభివృద్ధిపరచబడినది. ఈక్షేత్రము కీర్తిగురించి అనేకమైన పురాణకధలందు పేర్కొనబడినది. పార్వతీదేవి శివునివలన శాపముపొంది తనకుగల దివ్యత్వముకోల్పోయి మానవ రూపము ధరించవలసివచ్చినప్పుడు శాపమునుండి విముక్తిపొందుటకుగాను ఈక్షేత్రములోనే దీర్ఘకాలము తపస్సు చేసినది. శివుడు ఆమెభక్తికి ప్రసన్నుడై ఆమెదివ్యత్వమును తిరిగి ప్రసాదించి పార్వతికి పంచాక్షరి తదితర మంత్రములను ఉపదేశించినాడు. పార్వతి శివజ్ఞానముపొంది జ్ఞానప్రసూనంబగా ఖ్యాతిచెందినది. మయూర, చంద్రుడు మరియు ఇంద్రుడు ఇచట స్వర్ణముఖినది నందు ష్ణానముఆచరించి తపస్సుచేసి వారివారి శాపములనుండి విముక్తిపొందినారు. శివుడు మార్కండేయునికి ఇచ్చటనే జ్ఞానమును భోధించినాడు. శివుడు ఇచట బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు రూపములలో కొలువబడుచున్నాడు. 

Srikalahasti-Temple-Srikalahasti, Andhra Pradesh

ఈఆలయమునందలి శివలింగము పంచభూతలింగములలో ఒకటిఅయిన వాయులింగము. పురాణకధ ప్రకారము సృస్థిప్రారంభమైన కాలములో వాయుదేవుడు కర్పూరలింగమును వేలసంవత్సరములు పూజించూచూ తపస్సుచేసినాడు. వాయుదేవుని తపస్సుకు శివుడు అత్యంతప్రసన్నుడై లోకకళ్యానార్ధము వాయుదేవుడు లోకమంతయూ తిరుగవలసియుండగా ఇచ్చటనే స్థిరముగానుండుటవలన లోకమునకు మరియు అనంతకోటి జీవరాశికి ఇబ్బంది కలుగజేయుచున్నదిఅని తెలుపుచూ కదలక తపస్సుచేసినందున వాయుదేవునిభక్తికి మెచ్చి మూడువరములు ఇచ్చేదను కోరుకొమ్మనితెలిపినాడు. వాయుదేముడు మొదటివరముగా తాను  ప్రపంచంలో అన్నీ చోట్లా వ్యాపించవలెనని, రెండవవరముగా ప్రతిజీవిలోనూ తానునిలిచి తనద్వారా జీవాత్మ పరమాత్మను చేరవలెనని, మూడవవరముగా తానుపూజించినలింగము కర్పూరలింగముగా ప్రసిద్ధి చెందవలేనని కోరినాడు. శివుడుఅనుగ్రహించి వాయువు ప్రపంచమునలుదిక్కులా అన్నిచోట్లావ్యాపించునట్లు, జీవి తనయందు కలిగియున్న పంచభూత తత్వములలో గాలి(వాయువు) గానిలిచి జీవిఅంతిమసంయమునందు గాలి (ఊపిరి) ఆగిపోయి జీవాత్మ పరమాత్మ చేరునట్లు,కర్పూరలింగము వాయువుపేరుతో వాయులింగముగా ప్రసిద్ధిచెందునని, దేవ, గరుఢ, గంధర్వ, కిన్నెర కింపురుషులు, మానవులు, రాక్షసులతోసహా అన్నిలోకములవారు ఈకర్పూరలింగమును కొలిచెదరని వరములు అనుగ్రహించినాడు.  శివానుగ్రహమువలన కాళహస్తీశ్వరలింగము వాయు లింగముగా అన్నిలోకములవారిచే పూజించబడుచున్నది.

శ్రీకాళహస్తికి ఆపేరు వచ్చుటకు ఒకప్రభలమైన కధ ఉన్నది. పూర్వము ఒక సాలెపురుగు (శ్రీ), నాగుపాము (కాళ) మరియు ఏనుగు (హస్తి) శివుని మిక్కిలిభక్తితో పూజించినవి. గర్భాలయమునందు నివసించేడి సాలెపురుగు శివుని యొక్క రూపములు మరియు ఆలయములు తననోటితో నేయుటద్వారా పూజించేడిది. ఒకరోజు గాలివీచి సాలెపురుగు సమర్పణలు అగ్నికి దగ్ధమైనవి. సాలెపురుగు తనప్రాణము గురించి లెక్కచేయక అగ్ని మ్రింగివేయుటకు ప్రయత్నించగా అగ్నినందు దగ్ధమైనది. సాలెపురుగు భక్తికి ప్రసన్నుడై శివుడు దర్శనము ఇచ్చివరము కోరుకొమ్మని అడుగగా జననమరణములకు అతీతముగా మోక్షము ప్రసాదించ వేడుకొన్నది. ఆవిధముగా సాలెపురుగు శివునిలో ‘శ్రీ’ గా అంతర్భాగము అయినది. ఈరీతిలోనే నాగుపాము (కాళ) లింగముపై ఉంచెడిపూలను ఏనుగు (హస్తి) తొలగించి సమీపములోని స్వర్ణముఖినదినుండి తనతొండముతో నీరుతెచ్చి స్వామిని అభిషేకించేదిది. అదిచూచి పాముకు కోపమువచ్చి ఏనుగును చంపవలెనని ఏనుగు తొండముతో దూరినది. భాధ భరించలేని ఏనుగు తనతొండమును ఆలయమునకు మోదుకొని మరణించినది. తొందములోనున్న పాముకూడా మరణించినది. వాటిభక్తికి  మెచ్చిన శివుడు వాటికికూడా మోక్షము ప్రసాదించినాడు. ఈ మువ్వురు శివునిలో ఐక్యమైనందువ వారి పేర్లపై ఈక్షేత్రము శ్రీకాళహస్తిగా పిలువబడుచున్నది. 

Srikalahasti-Story

కన్నప్ప ఆలయం

శ్రీకాళహస్తి గురించి తెలుసుకున్నప్పుడు కన్నప్ప చరిత్ర తప్పనిసరి తెలుసుకోవలసి ఉంటుంది. కన్నప్ప శివునికి పూజలు చేయుటరాని మూఢభక్తుడు. అయిననూ తన అచంచల మూఢభక్తితో పరమశివుని మెప్పించినాడు. శ్రీకాళహస్తి సమీపములోని ఆటవీ ప్రాంతమునకు రాజైన నగరిదంపతులకు సంతానము లేకపోవుటవలన వారు శివుని కుమారుడైన కార్తికేయుని ప్రార్ధించి ఆయన అనుగ్రహముతో పొందిన కుమారుడే కన్నప్ప. తల్లితండ్రులు చిన్నతనమునందు తిన్నడు అనిపేరు పెట్టినారు. తిన్నడు పెద్దవాడై గిరిజన తెగలలో గొప్పవిలుకాడుగా పేరుతెచ్చుకొని తోటివారికి కూడా నేర్పేడివాడు. ఒకపర్యాయము అడవిలో అడవిపందిని తరుముచూ తనస్నేహితులకు దూరముగా వెళ్ళగా అడవిలో ఒకశివాలయము కనిపించింది. శివాలయము చిన్నదిగా ఉండి పరిశుభ్రముగానున్నది. తిన్నడు ఆశివలింగమునకు ఆకర్షితుడు అయినాడు. శివునికి అర్చనచేయువిధానము తెలియక తనవద్దనున్న వేటమాంసము సమర్పించినాడు.

ఆలయమునకు దూరములోనున్న గ్రామమునుండి ఒక బీదబ్రాహ్మణుడు పదిహేనురోజులకొక పర్యాయము వచ్చి ఆలయము శుద్ధిపరచి శివుని అర్చించేడివాడు. తిన్నడు శివునికి వేటమాంసము నివేదనగాపెట్టి గూడేమునకు వెళ్ళిన మరుసటిరోజు బ్రాహ్మణుడు వచ్చిచూసి నిశ్చేష్టుడై అడవిజంతువులు మాంసమును అచట పడవేసినవనితలచి దగ్గరలోఉన్న వాగునుండి మంచినీరు తెచ్చి ఆప్రదేశము శుభ్రపరచి తనపూజా కార్యక్రమము నిర్వహించి తనభాధ్యత నిర్వర్తించినట్లుగా సంతృప్తిపడినాడు. మరుసటిరోజున తిన్నడు ముందురోజుకంటే ఎక్కువ మాంసముతోవచ్చి, పూజావిధానము మరియు ప్రార్ధనలు తెలియకపోవుట వలన కొద్దిసేపు అక్కడ శివలింగముతో మాట్లాడుచూగడపి వెడలిపోయినాడు. అచ్చటగడపుట ఆతని మనసుకు సంతోషము మరియు మనశ్శాంతిని కలుగజేయుటవలన తనకు దొరికినవేట ప్రతిరోజూ తెచ్చేదివాడు. ఒకరోజు తననోటితో నీరు తీసుకొని రెండుచేతులతో మాంసము, మరియు తలపైపువ్వులు ధరించి తెచ్చినాడు. తననోటిలోని నీటిని శివలింగముపైపోసి స్నానము చేయించి లింగముపైతన తలపై పూలను ఉంచి మాంసముని వేదించి శివునితో మాట్లాడి వెడలినాడు. 

మరుసారి బ్రాహ్మడు వచ్చినప్పుడు ఆప్రదేశములో మాంసము మరియు శివలింగముపై ఉమ్మిచూసి అదిజంతువు పనికాదని మానవులేనని తలంచి మంత్రోచ్ఛారణకు ముందుగా మరల ఆప్రాంతమంతయు శుభ్రపరచి అర్చించిన పిమ్మట మరలఅట్లు జరుగదుఅన్న నమ్మకముతో వెలిపోయినాడు. మరలా మరలా అట్లే జరుగుటవలన కన్నీటితో శివుడినే అట్టిచర్యలనుండి కాపాడు కొనుమని వేడుకొనినాడు. శివుడు బ్రాహ్మణునితో తనవలె ఆభక్తునికి పూజలు మంత్రములు తెలియవని, కానీ ఆతనివలెనే భక్తుదని తెలిపినాడు. బ్రాహ్మణునికి ఆభక్తుని చూడవలెను అనుఆశక్తితో పొదలచాటున దాగినాడు. తిన్నడు వచ్చి శివుని ఎడమకన్నునుండి రక్తముకారుట చూచినాడు. తిన్నడు చింతించి పరిసరములలోని ఆకులుతెచ్చి ఆరసముతో రక్తముకారుట ఆపుటకు ప్రయత్నించి విఫలమై వెంటనే తనచేతిలోని కత్తితో తనకన్నుపెరికి శివుని కంటికి అమర్చినాడు. ఆకన్నువెంట రక్తము కారుటఆగి వెంటనే కుడికన్నువెంట రక్తముకారుట ప్రారంభమైనది. తిన్నడు తనపాదముతో శివలింగమునొక్కిపెట్టి రెండవకంటిని కత్తితో పెరుకుటకు ప్రయత్నించినప్పుడు శివుడు నిజరూపముతో ప్రత్యక్షమై ఆతనితోపాటు పొదలచాటుననుండి బయటకువచ్చి కీర్తించిన బ్రాహ్మణుని భక్తికి మెచ్చి ఇరువురికీ ముక్తిని ప్రసాదించినాడు. కన్నులను సమర్పించిన తిన్నడు కన్నప్ప అని ఖ్యాతి గడించినాడు.       

శ్రీకాళహస్తిక్షేత్రము స్వర్ణముఖినదీ తీరముననున్నది. స్వర్ణముఖి అనగా బంగారమువంటి ముఖముకలది. శ్రీకాళహస్తిక్షేత్రము మరియు స్వర్ణముఖినదికి సంబంధించి పురాణ కధనములున్నవి. స్వర్ణముఖినది దక్షణమునుండి ఉత్తరమునకు ప్రవహించుచున్నది. స్వర్ణముఖి చంద్రగిరి కొండలలో ఆంజనేయగుట్టకు దగ్గరలో ఉద్భవించి పంచశివాలయములైన ముక్కోటి నందు ఆగస్తీశ్వరస్వామి ఆలయం, గుడిమల్లాంనందు శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయం, యొగిమల్లవరంనందు శ్రీపరాశరేశ్వర స్వామి ఆలయం, గాజులమధ్యంనందు శ్రీమూలస్థానేశ్వరస్వామి ఆలయములతో పాటు శ్రీకాళహస్తినందు శ్రీకాళహస్తీశ్వర ఆలయములు కలుపుచూ ప్రవహించుచున్నది. కాళహస్తివద్ద భీమానది స్వర్ణముఖితో కలియునుకావున ఈక్షేత్రము సంగమప్రదేశము. కధనము ప్రకారము శివుడు వశిష్టుని ఆతనిభార్య అరుంధతితో ఈప్రాంతమునందు నివసించ ఆదేశించినాడు. 

Swarnamukhi-Srikalahasti

వశిష్టుడు ఈప్రాంతమునందు నీరులేకపోవుటవలన బ్రహ్మ గురించి తపస్సుచేయగా బ్రహ్మ శివునితో వశిష్టుని తపస్సు గురించి తెలియచేయగా శివుడు తనజటాఝూటమునుండి గంగనువదలి బ్రహ్మను అనుసరించమని అనుమతించినాడు. బంగారు రంగుతో అవతరించిన గంగ పేరు ఉత్తరవాహిని నుండి స్వర్ణముఖిగా వశిష్టుని కోరికమేరకు స్థిరపడినది. శ్రీకాళహస్తి ఆలయనిర్మాణము నందు పనిచేసిన కూలీలు ప్రతిరోజూ సాయంత్రం స్వర్ణముఖిలో వారిదేహములను శుభ్రపరచుకొనుటకు నదినందు దిగిన సమయములో వారిచేతులందు బంగారునాణెములు కనపడేవి అని నానుడి.  

అంతరాలయము 5వ శత్రాబ్దము మరియు బయటిఆలయము 12వ శతాబ్దములో చోళరాజులు దర్మిలా విజయనగరరాజులచే నిర్మితమైనది. గర్భాలయమునందు లోపలి భాగమున గాలివీయక దీపము నిరంతరము వెలుగుతూనే ఉంటుంది. ఆలయము తలుపులుమూసి ఉన్ననూ వాయులింగము చూడవచ్చును. గాలివీచుచున్ననూ దీపము వెలుగుతూనే ఉంటుంది. గర్భగుడికి కిటికీలు ఉండవు. శివలింగము తెల్లగానుండి స్వయంభూః అనిపరిగణించేదరు. కాళహస్తి రెండుకొండలచే చుట్టబడి యున్నది. ఉత్తరభాగమున నున్నకొండపై దుర్గఆలయము దక్షణమువైపు కొండపై శివునికి తనకన్నుసమర్పించిన కన్నప్పకు అంకితమైన కన్నబేశ్వర ఆలయము ఉన్నవి. ఉత్తరమువైపు ప్రవహించుకున్న స్వర్ణముఖీనది ఆలయపాదములు స్పృశించును. ఆలయమునందలి శివలింగమును ఆలయపూజారులతోసహా భక్తులు ఎవరు తాకరాదు. శివలింగముపై నీరు, పాలు, కర్పూరము మరియు పంచామృతములు కలిపిన మిశ్రమము పోయుటద్వారా అభిషేకము నిర్వహించేదరు. 

Srikalahasti Temple Entrance, Srikalahasti, Andhra Pradesh

ప్రధానలింగమునకు కాకుండా ఉత్సవమూర్తికి మాత్రము గంధముముద్ద, పువ్వులు మరియు పవిత్రమైన వస్త్రము సమర్పించెదరు. ప్రధానద్వారముపై నూట ఇరవై అడుగులఎత్తైన పురాతనమైన గోపురముకలిగి ఆలయము ఏడువందల సంవత్సరములకు పూర్వము కృష్ణదేవరాయలు వారిచే నిర్మించబడి విశాలమైన స్తంభములతో రూపొందించబడినది. పేరులోనే దక్షణము కలిగియున్న దక్షణామూర్తి విగ్రహము శ్రీకాళహస్తిలో ఉత్తరముగా ప్రతిష్టించబడి ఉత్తర దిక్కువైపు తిరిగి ఉంటుంది.  

శ్రీకాళహస్తిక్షేత్రమును రాహు, కేతుగ్రహ మరియు కాలసర్పదోష నివారణపూజ జరిపించుకొనువారు అధికముగా సందర్శించేదరు. నిత్య జీవితములో ఆర్ధిక సమస్యలు, వివాహ సమస్యలు ఉనవారు ఇచట రాహు మరియు కేతు గ్రహములకు పరిహారము పూజలు జరిపించుకొని గ్రహ శాంతిని పొంది సుఖఃముగా నుండురు. రాహుగ్రహము జన్మకుండలిలో చెడుస్థానమునందునున్నచో శరీరరుగ్మతలను కనుగొనుట కష్టమగుట, పూర్వీకుల శాపములు, నిరాశ కలుగును. కేతుగ్రహమువలన మానసిక అనారోగ్యము కలిగి, కుటుంభ బాంధవ్యములకు మరియు భౌతికసంపదకు దూరముకాబడుట జరుగును. జాతకచక్రములో లేదా జన్మకుండలి నందు రాహు మరియు కేతుగ్రహములమధ్య మిగిలిన గ్రహములు నిలచిఉన్నపుడు ఆవ్యక్తులకు కాలసర్పదోషముకాలదని పరిగణింపబడతారు. శ్రీకాళహస్తినందు పూజ జరిపించుకొనుటమూలముగా కాలసర్పదోషము పరిహారమగునని అందువలన వివాహము కాకపోవుట, వివాహజీవితములో ఏర్పడిన కలతలు ఉపాధి వ్యాపారము లేకపోవుట, ఆర్ధికసమస్యలు, వివాహమైన పిమ్మట పిల్లలులేకపోవుట, ఆరోగ్యసమస్యలు తదితరములనుండి విముక్తి కలిగి జీవితము సుఖవంతమగునని ప్రసిద్ధి. 

Srikalahasti-Rahu-Ketu-Pooja

శివుడు అన్నిగ్రహములకు అధిపతికావున శివుని అర్చించి గ్రహములను పూజించిన కాలసర్పదోషముతో పాటుగా అన్నీగ్రహదోషములు నివృత్తి అగునని పురాణప్రవచనము. పూజ నిమిత్తము రూ 300/- నుండి రూ 2500/- వరకు చెల్లించవలసి ఉంటుంది. 

శ్రీకాళహస్తి ఆలయము ఉదయం 6 గంటలనుండి రాత్రి 8 గంటల వరకు తెరచియుండును. శ్రీ కాళహస్తీలో రోజు అంతయు పూజలు నిర్వహించేదరు. కానీ చతుర్ధీ, పంచమి మరియు పౌర్ణమినాడు పూజలు నిర్వహించుకొనుట శ్రేయస్కరము. శివునిఅంశ అయిన హనుమంతునికి ప్రీతి పాత్రమైన మంగలవారమునాడు శ్రేకాళహస్తి నందు శివుని సేవించుట ఉత్తమము. శ్రీకాళహస్తి నందు బస చేయుటకు దేవస్థానంవారి సత్రములు మరియు వసతిగృహములున్నవి. ఇవికాక అనేక వసతిగృహములు మరియు మధ్యతరహా ఉత్తనతశ్రేణి హోటల్స్ ఉన్నవి.