అగ్నిలింగం
(IPLTOURS)
పంచభూతలింగములు అగ్ని (అరుణాచలేశ్వర్), జల (జంబుకేశ్వర్), పృద్వి (కాంచీపురం) మరియు ఆకాశ (చిదంబరం) తమిళనాడురాష్ట్రముయందు వాయులింగము మాత్రము ఆంద్రప్రదేశ్ నందు కాళహస్తినందు కలదు. పంచభూతలింగములు ఆయా పంచభూతములతత్వమును కలిగి ఉంటాయి. దక్షిణాదిన ఉన్న పంచలింగక్షేత్రములు పంచభూతములకు ప్రతీకగా వెలసిఉన్నవి. అగ్నిలింగముకల తిరువణ్ణామలై అనే అరుణాచల క్షేత్రం తమిళనాడులో ఉన్నది. ఈక్షేత్రము అగ్నితత్వమునకు ప్రతీక. అందువలన ఇచ్చటి శివలింగము అగ్నిలింగము అనిప్రసిద్ధి. భూమండలములో అన్నిప్రదేశాల కంటే పురాతనమైనదనీ, సమస్త భూమండలానికి మధ్యఉండి, హృదయం వంటిదనీ, స్మరణమాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రమని ప్రసిద్ధి. అరుణాచల శిఖరాగ్రముపై అగ్నిశిఖ ఆవిర్భవించి, తేజోలింగ స్వరూపుడైనాడు. ఇక్కడిమూర్తి అరుణాచలేశ్వరుడు, అమ్మ అబిదకుచాంబ లేదా ఉన్నమలైఅంబ / ఉన్నమలైనాయగి/ అరుణాచలేశ్వరి. అరుణాచలచరిత్ర అరుణాచల శివలింగమువలెనే ఆది మరియు అంతము లేనిది. ఎంతవివరించినా అదితక్కువే అవుతుంది.
పార్వతీదేవి వినోదార్ధం శివుని కన్నులుమూసి గావించిన అపరాధానికి ప్రాయశ్చిత్తముగా ఘోరతపస్సుచేసి శివుని అర్ధభాగం పొందిన క్షేత్రము అరుణాచలం. పార్వతీదేవి శివుని కన్నులు మూసినప్పుడు సూర్యచంద్రులు స్తంభించి లోకములు అంధకార మయమైనవి. తనవల్ల జరిగిన ధర్మలోపమునకు చింతించి పార్వతీదేవి ప్రాయిశ్చిత్తముకొరకు తెలుపమని శివుని కోరగా శివుడు తనస్వరూపము కావున ఆమెకు ప్రాయశ్చిత్తము వసరములేదని అయిననూ ధర్మపరిపాలన చేయవలెనుఅని తపస్సు చేయమని పరిహారము తెలిపినాడు. పిమ్మట శివుడు తెలిపినట్లు పార్వతీదేవి గౌతమముని ఆశ్రమమునకు వెళ్ళి తపస్సు చేయుచుండగా తపోమధ్యంలో మహిషాసురుడు విజృభించగా పార్వతీదేవి చాముండేశ్వరి రూపంలో మహిషుని సంహరించిన ఉదంతం అరుణగిరి సమీపములోని మైసూరునందుకల చాముండికొండలపై జరిగింది. పార్వతి మహిషాసురమర్ధనిగా ప్రఖ్యాతిచెందినది.
అరుళ్మిగు అరునచాలేస్వరార్ ఆలయం
బ్రహ్మ మరియు విష్ణుమూర్తి మధ్యన ఆదిపత్యవాగ్వివాదం జరుగగా శివుడు ఒక మహాలింగము రూపమున వారిమధ్య జ్యోతిస్థంభముగా వెలసి జ్యోతిస్థంభము చివరిభాగము కనుగొన్నవారు అధికులు అని పేర్కొడినాడు. బ్రహ్మదేవుడు లింగాగ్ర భాగము కనుగొనుటకు హంస రూపమున వెళ్ళగా, విష్ణుమూర్తి వరాహరూపమున లింగము యొక్క అంత్యభాగమును కనుగొనుటకు ప్రయత్నించినప్పుడు బ్రహ్మ మొగలిపూవు సహాయముతో తానుస్థంభము అగ్రభాగము కనుగొనినట్లు అసత్యం చెప్పగా విష్ణువు తాను కనుగొనలేకపోయినానని నిజము చెప్పి అసహాయత వెల్లడించినాడు. శివుడు బ్రహ్మ అసత్యము తెలిపినట్లు కనుగొని క్రతువులందు పూజాలందు ఏవిధమైన ప్రాతినిధ్యము లేకుండునట్లు, మొగలిపూవునకు తనపూజకు అనర్హమైనదిగా శపించి విష్ణువుకు అన్నీ పూజాలు క్రతువులు అందుకొనునట్లు వరముయిచ్చినాడు. ఈకధనము మిగిలిన క్షేత్రపురాణములందు ఉదహరించబడినది ఆ మహాలింగమే ఈ అరుణాచలం.
పురాణ కధనము ప్రకారము మార్కండేయ మహర్షి తన సహచర ఋషులతో కలిసి నందీశ్వరుని సంసారసాగరమును అధిగమించి ముక్తిపొందు మార్గము తెలుపమని కోరిఅర్ధించినాడు. నందీశ్వరుడు కాశీనందు గంగానదిలో భక్తితోస్నానము చేయుటద్వారా, తిరువారూర్ నందు జనించుటద్వారా, చిదంబరంనందు నటరాజును దర్శించుటద్వారా, శివునిగురించి తపస్సు చేసి విష్ణువు సుదర్శనచక్రము వరముగాపొందిన వృద్ధాచలము దర్శించుటద్వారా, కేదార్నాథ్ యాత్రచేయుటద్వారా, బ్రమరాంబాదేవి మల్లిఖార్జునుని పూజించిన శ్రీశైలం దర్శించుటద్వారా ముక్తిని పొడవచ్చునని తెలిపినాడు. ఇంతేకాక శివుడు కన్నప్పచే పూజింపబడుడిన కాళహస్తి, లక్షీమెదేవి తులసిమాలలతో పూజించిన విష్ణువు అవతారమైన వేంకటేశ్వరస్వామి కొలువున్న తిరుపతి, కాంచీపురం, కుంభకోణం, మధురై మరియు రామేశ్వరం దర్శించినవారికి ముక్తిలభిస్తుంది అనితెలిపాడు.
మార్కండేయ మహర్షి నందీశ్వరునితో దైనందినకార్యకలాపాలు జరుపుతూ ఈక్షేత్రములు దర్శించుట దేవతలకుగాని, సిద్ధులకుకానీ సాధ్యముకాదు అందువలన దర్శించిన మాత్రమున కైవల్యము లభించు ప్రదేశము గురించి తెలుపమని కోరినాడు. నందీశ్వరుడు మనసులో గంగానదిని తలపై ధరించి, వెలుగుతున్న కండ్లతో అనుగ్రహము కురిపించు అరుణగిరి ప్రభువు అయిన అరుణాచలేశ్వరుని మనసులో స్మరించుకొని స్థిరచరజీవులు అన్నిటికి పవిత్రమైన నామము జ్ఞప్తికలిగి తలంచినంతనే విమోచనకలిగించు వివిధనామాలు కలిగియున్న దక్షణకైలాసముగా పిలువబడుచూ దేవతలకు, ఋషులకు తపోవనముగా ప్రసిద్ధిపొందిన కృతయుగములో అగ్నిపర్వతముగా, త్రేతాయుగమునందు వజ్రముగా, ద్వాపర యుగమునందు బంగారుకొండగా మరియు కలియుగములో కొండగా ప్రసిద్ధి చెందిన కొండఉన్నదని, ఆదిపత్యవివాదమునందు విష్ణువు అడవిపంది రూపములోను, బ్రహ్మ హంసరూపములోను ఆది, చివర తెలుసుకొనుటకు ప్రయత్నించిన అగ్నిస్తంభము రూపములో మహాశివుడు దర్శనము ఇచ్చిన అరుణాచలం విశిష్టత తెలిపినాడు. ప్రతిరోజూ అరుణాచలకొండపై సూర్యుడు వర్షము కురిపిస్తాడుఅని, మబ్బులు కమ్మినప్పుడు అరుణాచలం కొండ హిమాలయాపర్వతమువలే కనపడుతుందిఅని, హిమవంతుడు పార్వతికి శివునితో వివాహము జరిపించినప్పుడు శివుడు బ్రహ్మ మరియు విష్ణువు సంవాదమునందు తమవలేనే పర్వతముగా అవతరించినాడని సంతృప్తిపడినట్లు ఋషులకు తెలిపినాడు.
అరుణాచల విశిష్టత ఇంకనూ తెలుపుచూ నందీశ్వరుడు, సమాజము బహిష్కరించిన హంతకులు కూడా ఒక్కసారి అరుణాచలం జ్ఞప్తికి తెచ్చుకొనిన మాత్రమున వారికి ముక్తిలభిస్తుందని, అరుణాచలమునందుకల ప్రతి చెట్టు, పొద కూడా కల్పవృక్షమని, ప్రతినీటిఊట గంగాజలముతో సమానమని తెలిపినాడు. నందీశ్వరుడు అరుణాచలపర్వత విశిష్టత ఋషులు అందరకు ఈవిధముగా తెలియజేసినాడు. ఇప్పటికినీ నందీశ్వరుడు తానుకూరర్చొనినచోటనే ఇప్పటికినీకూర్చొని ఉన్నాడు అనిప్రజలు విశ్వసిస్తారు.
అరుణాచలేశ్వరుని ఆలయమునకు చిలుకకు ఒకఆశక్తికరమైన సంబంధముకలదు. అరుణాచల ఆలయమునందు తెల్లటి గోపురముపై పావురపు గూడునందు రంగులు వేయబడిన చిలుక బొమ్మ(సిమెంటుది) అమర్చబడి ఉన్నది. ఈచిలుక వెనుక ఒక కధనము ఉన్నది. పూర్వము అరుంగిరినాథార్ అనుసన్యాసి మరియు మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి) భక్తుడు ఉండేదివాడు. ఈయన తనజీవిత చరమాంకమునందు ఒకచిలుక రూపములో అన్నామలైనందు గడిపియున్నాడు. అదిఎట్లనగా సంబంధన్ అనువక్త వాదముయందు అరుంగిరినాథార్ వద్ధఓడి, కనులు కోల్పోయినరాజు వద్దకువెళ్ళి రాజుకుచూపు రావలెనన్న స్వర్గము నుండి పారిజాతపుష్పము తేవలెనుఅనియు, అరుంగిరినాథార్ ఆపుష్పముతేవలెను అని ఆజ్ఞఈయవలెనని తెలిపినాడు. రాజు ఆవిధముగా ఆజ్ఞాపించిన పిమ్మట అరుంగిరినాథార్ తన శరీరమువదలి మరణించిన చిలుక శరీరములో ప్రవేశించి స్వర్గము వెడలినాడు. అంతట సంబంధన్ మృతశరీరముండరాదని రాజును ప్రేరేపించి అరుంగిరినాథార్శ రీరము తగులబెట్టించినాడు. చిలుక రూపములోని అరుంగిరినాథార్తి రిగివచ్చి తనశరీరము ఖననముకావించబడినది అనితెలుసుకొని పారిజాతపుస్పముతో రాజుకనులు తిరిగి వచ్చునట్లుచేసి చిలుక రూపములోనే మురుగన్ స్తుతి చేయుచూ జీవించినాడు.
చిలుకలనే కాక యాత్రికులు అనేకమైన నెమళ్లను అరుణాచలములో చూడవచ్చును. నెమలి కార్తికేయుడు మరియు కౌమారి అమ్మవారి వాహనము. కార్తికేయుడు శివుని కుమారుడు. అంతేకాక నెమలితో శ్రీకృష్ణునికి కూడా దగ్గర సంబంధమున్నది. శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛము ధరించువాడు. అందమునకు ప్రామాణికమైన నెమలిపై అనేకమైన కధలు, పాటలు మరియు పద్యములు ఉన్నవి. నెమలి మహావిష్ణువు వాహనమైన గరుఢుని ఈకలునుండి సృష్టించబడినది. నెమలి పింఛములతో తయారు కానదిన చామరముతో పూజాలందు దైవమునకు ఉపచారము చేసేదరు. నెమలిని సాధారణముగా మయూరము అని పిలచెదరు. వర్షాకాలమునందు నెమలి నాట్యము రమ్యముగా ఉంటుంది.
అరుణాచలేశ్వరుడు వెలసియున్న కొండ (గిరి) జ్యోతిర్లింగ స్వరూపమగుటవలన గిరినిచుట్టి ప్రదక్షిణ చేయట సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయుటయేఆని భక్తుల విశ్వాసము. కార్తీకపౌర్ణమి రోజున దీపోత్సవము, గిరిప్రదక్షిణ జరుగుతాయి. ప్రతి నెలలో పౌర్ణమిరోజున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు. కార్తీకపౌర్ణమి రోజున లక్షలాదిగా భక్తులు గిరిప్రదక్షణ చేయుదురు. కార్తీక పౌర్ణమి రోజున గిరిప్రధక్షణ చేసిన భక్తులు మనసులో తలచిన కోరిక 41 రోజులలోగా తీరునని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షిణ అనగా గుడిదగ్గర నుంచీ బయలుదేరి కొండచుట్టూ నడిచి గుడిముంగిట చేరడం. గిరి ప్రదక్షిణ పాదచారులై శివస్మరణకావిస్తూ, తలమీద ఆచ్చాదన లేకుండా ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిధ్ధిస్తుందని మహాత్ముల వచనం. గిరిప్రదక్షిణ నడిచేవారి ఓపికనుబట్టి మూడు లేక నాలుగుగంటలు పడుతుంది గిరిపైనగల మహౌషధీ ప్రభావంవల్ల శరీరమునకు, శివస్మరణవలన మనస్సుకు, శివానుగ్రహంవల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది. ప్రదక్షిణమార్గం సుమారు 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. గిరిప్రదక్షిణచేసే మార్గంలో ఎత్తుపల్లాలు ఉండవు. రోడ్డు సాఫీగానే ఉంటుంది. పౌర్ణమి రోజున రాత్రి వెన్నెలలో కొన్నివేలమంది భక్తులు ప్రదక్షిణ చేయుడురు. గిరిప్రదక్షణ నడచి చేయలేనివారు ఆటోనందు ప్రయాణించిన సుమారు 600 రూపాయలు తీసుకొనేదరు.
అష్టభుజి ఆకారములోనుండు అరుణాచలగిరి చుట్టూ ఎనిమిది లింగములతోపాటు మార్గమునకు ఇరుప్రక్కలా అటుఇటు అనేక దేవాలయాలు ఉన్నవి. అష్ట శివలింగములు నాలుగుదిక్కులందు మరియు ఎనిమిది మూలలందు అనగా దక్షణమున యమ, పశ్చిమమున వరుణ, ఉత్తరమున కుబేర మరియు తూర్పున ఇంద్ర స్థాపిత లింగములతో పాటుగా ఆగ్నేయమున అగ్ని, వాయువ్యమున వాయు, నైరుతిన నైరుతి మరియు ఈశాన్యమున ఈశాన్యలింగములు ప్రతిష్టితమై యున్నవి. తూర్పు, దక్షణము పడమర మరియు ఉత్తరదిక్కులలో లోకపాలకులు మరియు ఎనిమిది దిక్కులలో అష్టదిక్పాలకులు కొలువై ఉన్నారు. ఇవికాక శేషాద్రి స్వామి ఆలయం, శ్రేరమణ మహర్షి ఆశ్రమం, విఘ్నేశ్వరాలయం, నేర్ అన్నామలై ఆలయం, ఆది అన్నామలై ఆలయం, చంద్ర లింగం, పడక్కు పిళ్లైయర్ ఆలయం, పంచముఖ దర్శనం పచ్చై అమ్మన్ కోవెల, అర్ధనారీశ్వర ఆలయములు కూడా గిరిప్రదక్షణయందు దర్శించుకొనవచ్చును. ఆలయములు సందర్శింధుకొనుచూ మార్గాయాసము కలుగకుండా ఆలయము లందు సేదతీరుచూ భక్తులు ముందుకు సాగుతారు. కార్తీకదీపోత్సవం సందర్భముగా పౌర్ణమిరోజున సాయం సంధ్యలో కొండపై పెద్దభాండములో ఆవునెయ్యి , వత్తులతో అతిపెద్దప్రమిదలో మహాదీపం వెలిగిస్తారు. మహాదీపం సుమారు వారంరోజులు వెలుగుతూ ఉంటుంది, సుమారు పదిహేను కిలోమీటర్లవరకు కనపడే ఈజ్యోతిని ఆత్మజ్యోతికి ప్రతీకగా విశ్వసిస్తారు. ఈదీపం చూసినవారికి మోక్షము సిధ్ధిస్తుందని భక్తుల విశ్వాసము. అరుణాచలంనందు చెప్పతగ్గ విశేషము సూర్యాస్తమయం. ఆలయ గోపురం అయిదు అంతస్తులనుండి ఒకదాని వెంబడి ఒకటి పైనుండి క్రిందికి అంతస్తుద్వారములనుండి కనపడుతుంది.
ఆలయము ఉదయము 5-00 నుండి 12-30 వరకు తిరిగి మధ్యాహ్నం 3-30 నుండి రాత్రి 9-00వరకు తెరచి ఉంటుంది. ఇచట అనేక ఆశ్రమములు, రమణ మహర్షి ఆశ్రమం, కంచి పీఠము ఆశ్రమములు కలవు. రమణాశ్రమమునకు ఆరువారములకుముందు stay@gururamana.org నకు ఇమెయిల్ ద్వారా తెలియాయపరచిన లభ్యతను బట్టి బస ఏర్పాటు చేయబడును. ఆలయమువారి అతిధిగృహము లందు లభ్యతనుబట్టి బస ఏర్పాటు కలదు. శివ సన్నిధి నందు అద్దె చెల్లించు పద్ధతిపై వసతి మరియు ఉచిత భోజన సౌకర్యము కలదు. ఇంతే కాక బసనిమిత్తము అనేక మధ్యతరహా ఉన్నతశ్రేణి హోటల్స్ కలవు.
ఇక్కడ శ్రీ రమణమహర్షి వారి ఆశ్రమం ఉంది. శ్రీ రమణ మహర్షి 1879 సం లో జన్మించి 1950 సం లో మోక్షము పొందిన ఒక భారతీయ ఋషి. చిన్నతనము పెరు వెంకట్రామన్ అయ్యర్ అయిన శ్రీ రమణ మహర్షి తమిళనాడు రాష్ట్రమునందు తిరుచ్చినందు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చిన్నవయస్సులోనే మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతములపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను “అతియాశ్రమి”గా ప్రకటించుకున్నాడు. రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది “మౌనముద్ర”. శ్రీ రమణ మహర్షి చాలా తక్కువగా ప్రసంగించేవాడు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటలద్వారా మార్గం చూపేవాడు. ఇతని బోధనలలో ఆత్మజ్ఞానం ప్రధాన అంశముగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే, “స్వీయ శోధన” ద్వారామోక్షం సులభసాధ్యమని బోధించేవాడు. అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవాడు. భగవాన్ రమణ మహర్షి అరుణాచల మహాత్యం గురించి చెపుతూ అరుణాచల అనే నామం నమశ్శివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రేట్లు ఎక్కువైనది. అని 3 కోట్ల సార్లు నమశ్శివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క సారి అరుణాచల అని స్మరిస్తే అంతా పుణ్యం వస్తుంది అని అరుణాచల అనేది జ్ణాన పంచాక్షరి నమశ్శివాయ అనేది యోగ పంచాక్షరీ అని ఇది స్కాంద పురాణంలో వ్రాయబడి ఉంది అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు.