తుంగనాథ్

(3వ కేదార్)
(IPLTOURS)

పంచ కేదార్లలో మూడవ కేదార్ అని చెప్పబడే తుంగనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లా లో సుమారు ముప్పైయైదు కిమీ ల దూరంలో రుద్రప్రయాగ నుంచి అగస్త్యముని వెళ్ళేదారిలో ఓఖిమఠ్ కి సుమారు అయిదు కిమీ దూరంలో చోప్త అనే వూరు నుంచి కొండ యెక్క వలసి వుంటుంది. అతి ఎత్తయిన పర్వతం పైన వున్న శివకోవెలగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినది యీ తుంగనాధ్. సముద్ర మట్టానికి సుమారు 12500 అడుగుల ఎత్తులో వున్న చంద్రశిల అనే పర్వతం మీద వున్న కోవెలయిది. ఈకోవెల గోపురం కనీసం వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని పురావస్తు పరిశోధకులు నిర్దారించినారు.

నంది రూపములో నున్న శివుని శరీరము భాగములై పడినప్పుడు చేతులు తుంగనాధ్ ప్రాతములో పడినట్లు స్థల పురాణము. చోప్త దగ్గరనుంచి కాలి నడక మొదలౌతుంది. ఉత్తరాఖంఢ్ లో వున్న అనేక యాత్రా స్థలాలు కాలినడకనే వెళ్ళవలసి వుంటుంది. శారీరక అలసట తెలియకుండా ఉండేందుకు అక్కడి వాతావరణం ఆహ్లాద కరంగా వుంటుంది.

tungnath templee

ఇక్కడ సంవత్సరానికి రెండే కాలాలు. ఒకటి శీతాకాలం, రెండు మంచు కురిసే శీతాకాలం గా చెప్పు కోవచ్చు. అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి మందిర ట్రస్టు యెప్పుడు తెరవాలి అనేది నిర్ణయిస్తుంది. 

నడవలేని వారికోసం గుఱ్ఱాలు, డోలీలు దొరుకుతాయి. చాలా చోట్ల చాలా ఎత్తు (స్టీప్) ఎక్కవలసి రావడం తో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ప్రదేశానికి పర్వతారోహకులు తప్ప మామూలు యాత్రికులు చాలా తక్కువ సంఖ్యలో వస్తూవుంటారు. అందు కనే యీదారి కాస్త నిర్మానుష్యంగా వుంటుంది కాలి నడక మొదలయ్యే ప్రాంతంలో మాత్రమే చల్ల , వేడి పానీయాలు తినుబండారాలు దొరకుతాయి. మరలా కోవెల ప్రాంతంలో అన్నీ దొరుకుతాయి. తుంగనాథ్ నుంచి చంద్రశిల శిఖరం రెండు కిమీ ల పైన వుంది. త్రేతాయుగం లో శ్రీరాముడు యీ చంద్రశిల శిఖరం పైన తపస్సు చేసినట్లుగా రామాయణంలో చెప్పబడింది. ఒకటి రెండు రోజులు వుండడానికి వీలుగా చిన్న చిన్న రూములు కామన్ టాయిలెట్ లతో వున్న సామాన్య గదులు తక్కువ వెలలో లభిస్తాయి. ప్రొద్దున్న పది గంటలకు నడక ప్రారంభిస్తే తుంగనాధుని దర్శించుకొని భోజనం చేసుకొని సాయంత్రం నాలుగు అయిదు గంటలకి చోప్తా చేరుకోవచ్చు.   

యాత్రికులు ఉదయం వీలైతే సూర్యోదయానికి పూర్వం యాత్ర మొదలుపెట్టి సూర్యాస్తమయానికి ముందు లేక వెంటనే ప్రయాణం నిలిపివేస్తే చాలా ఆపదల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం నమ్మలేని విధంగా మారుతూ వుంటుంది. అంతలోనే వాన అంతలోనే యెండ తుంగనాధ్ మందిరం కేదార్నాద్ మందిరాన్ని పోలివుంటుంది. లోపల శివ లింగం శివ కుటుంబంతో పాటు పాండవుల విగ్రహాలను కుడా చూడొచ్చు కాశి నగరానికి చెందిన బ్రాహ్మణులు యిక్కడ నిత్య పుజాదులు నిర్వహిస్తున్నారు. ఆరునెలల నుంచి ఎనిమిది నెలలవరకు యీ కోవెల మూసివేస్తారు.     

యాత్రికులు ఋషికేశ్ వరకు రైల్ ద్వారా ప్రయాణం చెయ్యవచ్చు అక్కడ నుంచి ఉఖిమఠ్ రోడ్డు మార్గము ద్వారా సుమారు 200 కిమీ ప్రయాణించి చేరవలసి యున్నది. ప్రొద్దున్న ఋషికేశ్ లో బయలు దేరితే వాతావరణం అనుకూలంగా వుంటే సాయంత్రానికి ఉఖిమఠ్ చేరుకోవచ్చు. ఉఖిమఠ్ లో కనీసఅవసరాలు కలిగిన సామాన్యమైన గదులు అద్దెకు దొరకుతాయి. ఉకీమత్ నుండి 30 కిమీ. ప్రయాణించి చొప్టా చేరుకొని ఆచటి నుండి సుమారు 4 కి.మీ. కాలినడకన ప్రయాణించి తుంగనాధ్ చేరుకోనవలయును. పంచ కేదార్ ప్రయాణమునందు రెండవ కేదార్ మధ్యమహేశ్వర్ నుండి 32 కి.మీ ప్రయాణించి ఉకీమఠ్ చేరవచ్చును.

స్థల పురాణం ప్రకారం మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు నిర్జించినారు. పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి విముక్తులు కావలెనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకుడు పరీక్షిత్తునకు వప్పగించి శివుని దర్శించి దీవెనలు పొందవలెలేనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్య క్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామమునందు వారివలన కలిగిన ప్రాణ నష్టమునకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించుకోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునందు అదృశ్యమైనాడు. వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు.  

భీముడు గుప్తాక్షి వద్ద రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గుప్తాక్షి వద్ద గడ్డి మేయుచూ కనిపించినాడు.  భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండి అదృశ్యమై తరువాతప్రత్యక్షమై ఆరుభాగములుగా విడిపోయినది. మూపుర భాగము  కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ లతో పాటు తల భాగము నేపాల్ నందు ఖాట్మండునకు 25 కి.మీ దూరములో చౌలి మహేశ్వర్ నందు పడినవి. పాండవులు శివుని కొలుచుటకు గాను  ఈ అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని తల పడిన ప్రదేశము నేపాల్ లోని చౌలి మహేశ్వర్. 

పాండవులు చౌలిమహేశ్వర్ మినహా మిగిలిన పంచ కేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట ఈ ఆలయములందు కేదార్నాధ్ నందు తపస్సు యజ్ణము చేసి బదరీనాధుని దర్శించి మానా గ్రామమునుండి వారు స్వర్గారోహణ యాత్ర చేసినారు.