కామాక్షిదేవి

(2వ శక్తి పీఠం)

కాంచీపురాశ్రితే దేవీ !
కామాక్షి సర్వమంగళా!!
చింతాకన్మాత్ర సంతుష్టా!
చింతితార్ధ ఫల జ్రపదా!!

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.