శృంఖలాదేవి

(3వ శక్తి పీఠం)

  ప్రధ్యుమ్నే వంగ రాజ్యాయాం ! 
శ్రుంకలా నామ భూషితే!!
విశ్వనిమోహితే దేవీ !
శ్రుంఖలా బంధనాశానీ!!

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

శృంఖలాదేవి శక్తిపీఠం

సతీదేవి ఖండిత శరీర భాగములందు ఉదరభాగము పడినప్రదేశము ప్రద్యుమ్నం 3వ శక్తి పీఠము శృంఖలాదేవిగా ప్రసిద్ధి. ఈశక్తిపీఠముపై భిన్నాభిప్రాయములు ఉన్నవి. ఈ క్షేత్రం గుజరాత్‌లోఉన్నదని కొందరూ కలకత్తాకు దగ్గరలోఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువైఉన్న ‘చోటిల్లామాత’ను అక్కడివారు శృంఖలా(శృంగళా) దేవిగా భావిస్తారు. పశ్చిమబెంగాల్‌నందు హుగ్లీజిల్లాలో పాండువా మాత్రమే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, ఈగ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదనిచెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒకమీనారు కనిపిస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలోఉన్న ఆప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ప్రతి సంవత్సరము  మాఘమాసంలో మాత్రం అక్కడ ‘మేళతాళ’ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఈఉత్సవ వేడుకనందు  హిందూముస్లింలు కలిసేపాల్గొనడం విశేషం. 

శృంఖల అనుపదమునకు రెండు అర్ధములున్నవి. చుట్టబడిన తాడు లేదా గోలుసు అని ఒక అర్ధము, రెండవది జన్మ నిచ్చిన తల్లులు వారి పోత్తికడుపు క్రింద చుట్టుకొనే వస్త్రము. మొదటి దాని ప్రకారము అమ్మవారు నిబద్ధత కలిగినది. జగన్మాత పరమేశ్వరుడు (సత్యము) నకు మాత్రమేబద్ధురాలు. ఆమె తన భక్తులకుకల అన్నికట్టుబాట్లను తొలగిస్తుంది. రెండవదాని అర్ధము అమ్మవారు బిడ్డకు జన్మనిచ్చిన తల్లివంటిది. ఈఅవతారములో ఆమె జగత్తునంతటిని తనబిడ్డవలె చూసుకొంటుంది. అమ్మవారిని  సేవించుటకు శిశుభావము మరియు అంకితభావము అవసరము. 

గుజరాత్ రాష్ట్రములో చోటిల్లా అనునదియే శ్రుంఖలాదేవి శక్తిపీఠం అనిభావిస్తారు. కానీ ఎక్కువమంది పశ్చిమబెంగాల్‌ నందు హుగ్లీజిల్లాలో పాండువా మాత్రమే శ్రుంఖలాదేవి శక్తిపీఠం అనేవాదనతో ఏకీభవిస్తారు. ఆప్రకారము శ్రుంఖలాదేవికి పశ్చిమబెంగాల్ రాష్ట్రములోని పాండువా మాత్రమే శక్తిపీఠము. స్థలపురాణము ప్రకారము ఋష్యశృంగమహర్షి శృంఖలా మాత గురించి పాండువానందు  తపస్సుచేసి ఆమెదీవనలు పొందినాడు. ఒకరోజు అమ్మవారి అనుమతిపొంది ఋష్యశృంగుడు కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి బయలుదేరినాడు. శృంఖలామాత కూడా మహర్షితోకలసి శృంగేరి వచ్చినది. తరువాత మహర్షి శృంగేరి కొండ చుట్టుప్రక్కల అమ్మవారి శక్తిని నెలకొల్పినాడు. అమ్మవారి ఆదేశములతో ఋష్యశృంగ మహర్షిచే శృంగేరికి తీసుకువచ్చినట్లు భావిస్తారు. పాండువ గ్రామము కలకత్తా నుండి ఢిల్లీ వెళ్ళు మార్గములో కలకత్తా (హౌరా) నకు సుమారు 82 కీ. మీ. దూరములోనున్నది  సుమారు 2 ½ గంటల సమయము పట్టును.

కావున ఈ శక్తిపీఠము శృంగేరిలో దర్శించుట ఉత్తమము. శృంగేరినందు తీర్ధవిహార, శ్రీ శంకర సాధన, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడిన శ్రీ శ్రీనివాస కృప మరియు శ్రీభారతీ తీర్ధ కృప వసతి గృహములు కలవు. ఈ వసతి గృహములు వ్యాపారపరముగా కాకుండా యాత్రికుల సౌకర్యార్ధము కేటాయించబడును. కావున విధ్యుత్ తదితర సౌకర్యములను కలిగించుటకు తక్కువ ఛార్జీలు వసూలు చేయదురు. గదులేకాకుండా యాత్రిక సమూహము లకు కేటాయించుటకు డార్మెటరీ సదుపాయము కలదు.

శృంఖలాదేవి ఆలయ సమయాలు

ఈ వసతి గృహములకు ముందుగా బుక్ చేసుకొనే సదుపాయము లేదు. ముందు వచ్చినవారికి ముందుగా కేటాయించుదురు.  శ్రీశారదామాత ఆలయము ప్రధానద్వారము వద్దనున్న సమాచారకార్యాలయమును యాత్రికులు సంప్రదించవచ్చును. అన్న దాన సదుపాయము 12-15 నుండి 2-30 వరకు మరలా సాయంత్రం 7-15 నుండి 8-30 వరకు కలదు. ఈ ఆలయ సముదాయములను ఉదయౌ 6-00 నుండి రాత్రి 8-00 వరకు దర్శించు కొనవచ్చును.