ఆది వినాయకర్ ఆలయం

(IPLTOURS)

మనదేశంలో అనేక గణేష్ ఆలయాలు ఉన్నాయి. దేశంలోని అన్నిరాష్ట్రాల్లో నిర్మించిన గణేష్ ఆలయాలు అరుదైన విశేషాలను సంతరించు కున్నాయి. విశ్వంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్‌నాథ్ జ్యోతిలింగం మరియు గౌరీకుండ్స మీపంలోని ముండ్‌కటియావద్ద విశిష్టతతో కూడిన గణేష్ ఆలయం ఉంది, ఇక్కడ వినాయకుడు తలలేకుండా కనిపిస్తాడు మరియు ఇతర గణేష్ విగ్రహాలలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. గణపతిరూపాన్ని తొండంతో ఊహించే సాధారణప్రజలకు ఆలయంలో తలలేకుండా కనిపించే దైవాన్ని చూచుటకు ఇష్టపడక మరియు జనబాహుల్యానికి దూరంగాఉన్నందున ఈఆలయం ప్రజాదరణ పొందలేదు. శివుడు, పార్వతీదేవి మూలక్షేత్రాలు మరియు వారి నివాసం అయిన కేదార్‌నాథ్, గౌరీకుండ్ మరియు కైలాష్ పర్వతం ఉత్తరాఖండ్‌లోని ముండ్‌కటియా సమీపంలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొకకధనంలో ముండ్‌కటియవద్ద గణేశుడి చరిత్రలో ఈవివరం తెలుపబడింది. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈఆలయం ఉన్నది.

మనదేశంలోని దక్షిణభాగంలో తమిళనాడు రాష్ట్రంలోని పూంతోట్టం గ్రామంలోఉన్న అరుల్మిగు ముక్తీశ్వర్ ఆలయంలో ఆదివినకాయర్ రూపంలో గణేశుడికి మరొక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈఆలయం సుమారు 1400 సంవత్సరములకు పూర్వం నిర్మించ బడింది. ఇతరఆలయాలవలే కాకుండా ఈఆలయంలో గణేశుడు మానవ ముఖంతో తొండంలేకుండా కనిపిస్తాడు. ఈఆలయంలోని గణేశుడిని “ఆది వినకాయర్” అని పిలుస్తారు. ఆలయం ముక్తీశ్వర్ రూపంలోఉన్న శివునికి సంబంధించినది కానీ ఈఆలయం గణేష్ ఆలయంగా ప్రసిద్ధిచెందింది. ఆలయంఉన్న ప్రదేశం పూర్వపు తిలతర్పణపురి పేరు కంటే ప్రస్తుత సీతలపతి పేరుతో గుర్తించబడుతున్నది.

ఆలయ ప్రవేశద్వారం దగ్గర ప్రత్యేక మందిరంలో వినాయకుడు దర్శనమిస్తాడు. ఆలయ సముదాయంలో ఆదివినాయగర్ యొక్క చిన్నమందిరం ఉంది. వినాయకుడు అందమైన మానవముఖంతో కనిపిస్తాడు మరియు ఇంతటికీర్తిని కలిగిఉన్న ఏకైకప్రదేశం ఇది.

Entrance of Muktheeswarar temple(Adhi Vinayagar Temple), Thilatharpanapuri, TamilNadu

ఆలయంలో ఆదివినాయగర్ రూపంలోఉన్న గణేశుడు ప్రధాన దైవం మరియు గణేశునిపూజిస్తే అన్నిసమస్యలు తీరుతాయని నమ్ముతారు. గణేశుడు జీవితంలోని అన్నిఅడ్డంకులను తొలగించేవాడు అందువలన విఘ్నరాజు అనికూడా పిలుస్తారు. ఈఆలయం ప్రతినెల సంకటహర చతుర్థినాడు ఉత్సవాలకు ప్రసిద్ధిచెందింది.

గణేశుడి ఆవిర్భావానికి సంబంధించిన పురాణాన్ని వివరిస్తూ, పార్వతీదేవి శివుడిని తమనివాసమైన కైలాసానికి ఆహ్వానించడానికి హరిసోల్ మహానదిలో స్నానంచేయాలని తలచింది. ఆమె తనశరీరంలోని నలుగుపిండితో ఒకపిల్లవాడిని తయారుచేసి ఆమూర్తికి ప్రాణంపోసింది. ఆమె తానుస్నానంచేసే సమయంలో తలుపుబయట కాపలాగా ఉండాలని మరియు తెలియని వ్యక్తులు ప్రవేశించ కుండా నిరోధించాలని చెప్పింది. పార్వతిని కలవడానికి శివుడు కైలాసానికి వచ్చాడు. బాలుడు కైలాసంలోకి ప్రవేశించకుండా శివుడిని అడ్డుకున్నాడు.శివుడు ఆగ్రహించి బాలుడితల నరికాడు. పార్వతి అక్కడికి చేరుకుని పిల్లవాని మరణానికి కన్నీళ్లు పెట్టుకుంది.

పార్వతీదేవిని సంతృప్తి పరచడానికి, శివుడు తనబృందాలను దక్షిణం వైపుచూస్తూ నిదురించే జీవియొక్క తలని వెతకడానికి పంపాడు.

ఈనాటికీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జీవించి ఉన్నవారు ఉత్తరం వైపు తల పెట్టకూడదని మరియు మరణించిన మృతదేహాల తలను మాత్రమే ఉత్తరం వైపు ఉంచాలని సూచించారు.గణములకు దొరికిన ఏనుగుతలను వారు తీసుకొచ్చారు. శివుడు బాలుడి శరీరానికి తలను అతికించి అతనికి ప్రాణం పోశాడు. శివుడు మరియు పార్వతి అతనికి వినాయకుడని పేరుపెట్టారు మరియు అతనిని గణాధిపతిగా చేసారు. వినాయకుడు గణములకు అధిపతికాబట్టి గణపతి అని పిలిచారు. అందరు దేవతలను ఆరాధించే ముందు గణేశుడు ప్రధాన ఆరాధన దేవతగా వరంపొందాడు.      

ఈఆలయంలో శివుడు ముక్తీశ్వర రూపంలో పార్వతి స్వర్ణవల్లి రూపంలో వారికుమారుడు గణేశునితో కలిసి దర్శనం ఇస్తారు. తిలతర్పణ పురి పేరుతో ఉన్నగ్రామం ప్రస్తుతం మాయవరంనుండి తిరువారూర్ రోడ్డులోఉన్న పూంతోట్టం అనేపేరుగా మారింది. ఇతర దేవతలను ఆరాధించే ముందు గణేశుడిని పూజించాలి, గణేశుడికి ప్రాథమిక పూజలు చేయడం ప్రాచీనకాల ఆచారం మరియు అతని తల్లిదండ్రులు శివపార్వతులు అతనికి ఆవరం ప్రసాదించారు. ఆదివినాయగర్ లేదా నరగణపతి ఈఆలయంలో ప్రధానదైవం కాకపోయిన ఆలయం నరగణపతి ఆలయంగా ప్రసిద్ధిచెందింది. సూర్యుడు (సూర్యుడు) మరియు చంద్రుడు (చంద్రుడు) విగ్రహాలు కలిపి స్థాపించబడ్డాయి మరియు వారు ఈఆలయంలో ముక్తీశ్వరుడిని ఏకకాలంలో పూజిస్తారు.

పూర్వీకులు వారిజీవితంలో చేసిన చెడుపనులతో పాటు, మరణించిన వారి పిల్లల చెడుపనులు మరియు మరణించినవారి కోరికలు నెరవేరకపోవడం తదితర కారణాలతో  పిండశ్రాద్ధం చేయకపోవడంవలన పూర్వీకులు మరియు మరణించినవారి ఆత్మకు శాంతి కలగకపోవడమేకాక అందువల్ల పితృదోషం సంభవిస్తుందని నమ్ముతారు. రామేశ్వరం, తిలతర్పణపురి తిరువెంకాడు మరియు శ్రీవాంచియం పూర్వీకులకు తిలతర్పణం చేయడానికి చాలా పవిత్రమైన ప్రదేశాలుగా పరిగణించబడుతున్నాయి. “తిల” అంటే నువ్వులు మరియు “తర్పన్” అంటే ఖర్మలుచేయడం. తిలతర్పణం అనేది మగవారిచే మరణించిన పూర్వీకులకు చేయుఖర్మ మరియు తిలతర్పణం చేయడానికి అమావాస్య పవిత్రమైన రోజు. మరణించిన పూర్వీకులకు తిలతర్పణం చేయడానికి ఈక్షేత్రంలో అన్నిరోజులు పవిత్రమైన అమావాస్యగా భావిస్తారు. రామేశ్వరంతో సమానంగా తిలతర్పణం నిర్వహించేందుకు ఈఆలయం పవిత్రస్థలంగా పరిగణించ బడుతున్నది.

తిలతర్పణంతో పాటు అమావాశ్యనాడు పేదలకు అన్నదానం చేయడంద్వారా పితృదోషం నుండివిముక్తి కలుగుతుందని పేర్కొనబడింది.

ఈరెండు కార్యక్రమాలతో పూర్వీకులు సంతోషిస్తారు, సంతోషకరమైన మరియు ప్రశాంతమైన జీవితం పొందుటకు ఆశీర్వదిస్తారు.

పురాణాల ప్రకారం, ధశరధుని భార్యకైక కోరికమేరకు శ్రీరాముడు తన భార్యఅయిన సీత మరియు లక్ష్మణులతోకలిసి అరణ్యవాసంచేస్తూ దండకారణ్యానికి చేరుకున్నాడు. ఈప్రదేశంలో వారితండ్రి దశరధమహారాజు మరణం గురించి వారు తెలుసుకున్నారు. తనపూజలు తన పూర్వీకుల కోరికను తీర్చలేదని మరియు తాను సమర్పించిన పిండను వారు స్వీకరించలేదని చింతిస్తున్న శ్రీరాముడు.శివుడిని ప్రార్థించాడు. శివుడుప్రత్యక్షమై రాముడిని మంథరవనానికి వెళ్లి హరిసోల మహానదిలో స్నానంచేసి పితృతర్పణం చేయమని చెప్పాడు. రాముడు శివునిసూచన అనుసరించాడు మరియు పిండప్రధానం కోసంఉంచిన నాలుగుపిండాలు నాలుగు శివలింగాలుగా మారాయని నమ్ముతారు. రాముడు ఆచారప్రకారం కర్మను నిర్వహించాడు.శివుడు ఇక్కడే దశరధునికి మోక్షాన్ని ప్రసాదించాడు. రాముడు తన సీతను రావణుడు అపహరించినప్పుడు అడ్డగించి సీతజాడ చెప్పి మరణించిన పక్షి “జటాయువు” కర్మలను ఇక్కడే నిర్వహించాడని కూడానమ్ముతారు. బయటి ప్రాకారంలో తిలతర్పణం చేస్తున్న రాముని విగ్రహం మరియు పితృలింగాలు అని పిలువబడే నాలుగు లింగాలను యాత్రికులు చూడవచ్చు. ఆలయానికి చంద్రతీర్ధం అను కోనేరు ఉన్నది.

స్వామిని దర్శిచిన దోషములుతొలగి  గృహసమస్యలు, శ్రేయస్సుకలిగి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఆలయం ఉదయం 6-00 నుండి మధ్యాహ్నం 12-00 వరకు తిరిగి సాయంత్రం 4-00 నుండి రాత్రి 9-00 వరకు తెరచి ఉంటుంది. ఆలయమునకు 18 కి.మీ దూరంలో మైలాడుత్తురై రైల్వే జంక్షను ఉన్నది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు సౌకర్యం ఉన్నది.

ఓం గం గణపతయే నమః