మహాలక్ష్మిదేవి

(7వ శక్తి పీఠం)

మహాలక్ష్మి భిదాదేవీ !
కరవీర పురాస్థితా !!  
పురుషార్ధ ప్రధామాతా !
సంపూర్ణామృత వర్షిణీ !!

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

మహాలక్ష్మిదేవి శక్తిపీఠం

శక్తిపీఠము అయిన ఈ పవిత్ర కొల్హాపూర్  క్షేత్రమునందు పడినవని పురాణములు తెలుపుచున్నవి. మహారాష్ట్ర నందు వాయువ్య దిక్కున (దక్షణ పశ్చిమ భాగమున) కొల్హాపూర్ పట్టణము ఉన్నది. కొల్హాపూర్ ను దక్షణకాశీ లేదా వారణాశి అనిఅంటారు. కొల్హాపూర్ పంచగంగానది ఒడ్డున ఉన్న పట్టణము. ఈ పట్టణమునందు బ్రహ్మపురినందు జరిపిన త్రవ్వకములందు రోమన్ కాలమునాటికి సంభంధించిన పురాతన పట్టణము ఉన్నట్లుగా వెల్లడిఅయినది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి ‘అంబాబాయి’గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌వాసులు ఈఅమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మికకేంద్రంగా భావించబడుతుంది.

Shree Mahalaxmi Ambabai

ఈఆలయాన్ని యాదవ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. సూర్యకిరణాలు నిర్ధిష్టమైనరోజులలో దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. నవరాత్రివంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఒక రాతి పీఠం మీద 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ కొలువై ఉంటుంది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవతయొక్క వాహనం మరియు రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ దేవతాచిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 900 సంవత్సరాలకు ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది.

సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 31మార్చి మరియు 9 నవంబరునుండి  మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. రధ సప్తమికి మూడు రోజుల పాటు సూర్యుడు మహాలక్ష్మికి నివాళి ఆర్పిస్తాడు. కిరణోత్సవం ఉత్సవం నిర్వహిస్తారు. జనవరి 31 మరియు నవంబరు 9వ తేదీన అమ్మవారి పాదములమీద, ఫిబ్రవరి 1వతేదీ  మరియు నవంబరు 10వ తేదీ ఛాతీపైన, ఫెబ్రవరి 2 మరియు నవంబరు 11 వతేదీలలో అమ్మవారి శరీరమంతయు  నేరుగా సూర్య కిరణములు ప్రసరించును.  

ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ అత్యంత పవిత్ర యాత్రాస్థలం. ఈ మహాలక్ష్మిని ‘అంబాబాయి’ అని పిలుస్తారు. ఇక్కడ జరిగే నవరాత్రి ఉత్సవంలో ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు మరియు చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు.                                                                                             

అగస్త్యమహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీవెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించు కోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని  కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.

శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ నగరం ప్రాధమికంగా కరవీరపురమనే పేరుతోనూ పిమ్మట కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరిపట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అనగా ‘లోయ’ ‘పూర్’ అనగా పట్టణం అందువలననే ఈపవిత్ర క్షేత్రం కొల్హాపూర్అని పిలువబడుతున్నది. కొల్హాపూర్ క్షేత్రం ఛత్రపతి శివాజీ ఏలుబడిలో వృద్ధి చెందినది. 

సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం కనీసం 41 రోజులు క్రమం తప్పకుండా బేసిసంఖ్యలో వయసునుబట్టి మనకు ఎంత వీలవుతుందో అంత శ్రమా తీసుకుని మనకు వీలైనన్నిసార్లు పారాయణచేసి ప్రతీశుక్రవారమూ అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యముగా పెట్టినవారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆకష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న వరులకు అతిత్వరలో సౌందర్యవతి, అనుకూలవతి అయిన కన్యతో వివాహముమై లక్ష్మీదేవివంటి భార్యలభిస్తుంది. ఇందు సంశయము లేదు. దీనివలన కలుగుసంపదలు చెప్పనలవి కాదు.

అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం అయిదు గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతిశుక్రవారం ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.

మహాలక్ష్మి దేవి ఆలయ సమయాలు

ఆలయం తెరచు సమయం ఉదయం  6-00, ఉదయం హారతి 7-00, సాయంత్రం (ధూప్ హారతి) 6-30 మరలా  7-30, శేజ్ హారతి (ఆలయం మూసే సమయం) రాత్రి 10-00, నైవేధ్యం 12-00 నిర్వహిస్తారు. ప్రతిరోజూ మహాపూజ, అభిషేకం, అర్చన జరుగుతాయి. మహాలక్ష్మిఆలయమునకు వెనుకభాగమున శ్రీమహాలక్ష్మి ధర్మశాలనందు ఏ.సి., నాన్ ఏ.సి. రూములు అద్దె ప్రాతిపదికపై దొరకును. మరియు కొల్హాపూర్ రైల్వే స్టేషన్ నందు రిటైరింగ్ గదుల వసతి ఉన్నది.