కామాఖ్య దేవి

(13వ శక్తి పీఠం)

కామరూపిణీ విఖ్యాతా !
హరిక్షేత్రే సనాతినీ !!
యోనిముద్రా త్రిఖంఢేశీ!
మాసే మాసే నిదర్శితా !! 

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

కామాఖ్య దేవి శక్తి పీఠం

అమ్మవారి యోని భాగం అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచలంపై పడటంతో ఆపర్వతం నీలంగా మారిందంటారు. ఈప్రాంతంలోనే 13వ శక్తిపీఠం అయిన కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవసృష్టికి మూలకారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. అని కాలాల్లోనూ అన్నిసమయాల్లోనూ ఆ రాళ్ళనుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆనీరు ఎర్రగా ఉంటుంది. ఈసమయం దేవికి రుతుస్రావ సమయంగాపాటిస్తారు భక్తులు. ఈఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానంపరిధిలోకి వస్తుంది. కానీ ఆసంస్థానానికిచెందిన రాజవంశీకులు ఎవరూ తనఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని  ఒకకథనం. అందుకే ఆవంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరని అంటారు.                                                                                 

స్థలపురాణం ప్రకారం పూర్వం కూచ్‌ బెహర్‌ రాజా విశ్వసింహుడు ఒకయుద్ధంలో అయినవారిని అందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు. దగ్గరలో కనిపించే మట్టిదిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెప్పింది. రాజువెంటనే తనఅనుచరులంతా తిరిగి రావాలని కోరుకోగానే వారంతా తిరిగివచ్చేరు. తనరాజ్యంలో కరవుశాంతిస్తే గుడికట్టిస్తానని మొక్కుకున్నాడు రాజు. అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామల మయింది. అప్పుడు గుడికట్టించేందుకు మట్టిదిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయట పడింది. ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు. పరమేశ్వరుడు కూడా నీలాచలానికి తూర్పు వైపు బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉమానంద భైరవునిగా దర్శనమిస్తాడు.

కామాక్షి ఆలయం అస్సాం రాస్త్రములోని గౌహతి పట్టణము పడమర భాగమున కల నీలాచల్ కొండపై ఉన్నది. ఇది సిక్కిం దేవతలైన కాళి, తార, షోడసి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, మాతంగి మరియు కామాత్మిక దేవతల ఆలయ సముదాయము నందు ఈ ఆలయము ఉన్నది. ఇందులో త్రిపురసుందరి, మాతంగి మరియు కమల ఆలయములు కామాఖ్య ఆలయము లోపల మిగిలిన ఆలయములు విడివిడిగా ఉన్నవి. సతీదేవి శరీర భాగములో నాలుగు భాగములు పడిన ప్రదేశములు తాంత్రిక భక్తులకు ముఖ్యమైనవి. అవి పాద ఖండము   పడిన పూరీజగన్నాధ్ ఆలయములోని బిమలఆలయం, ఒరిస్సాలోని బరంపురం వద్ద స్థనఖండము పడిన తారాతరణి ఆలయం, యోనిఖండము పడిన గౌహతీ లోని కామాఖ్య ఆలయం మరియు ముఖఖండము పడిన పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని కాలికాలయము. తాంత్రిక భక్తులకు ఈ ఆలయము అతి ముఖ్యమైనది. గర్భాలయముతప్ప మిగిలిన ఆలయము అంతయూ తేజ్ పూర్ నందలి సూర్యదేముని గుడిని పోలి యుండును. ఈ ఆలయనిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు,   మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్పకళాఖండాలతో, తేనెతుట్ట ఆకారంలోఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటినుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలనుసైతం బలిస్తారు. ఈఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శన ఫలం దక్కదని భక్తుల నమ్మకం. గర్భాలయము అంతర్ భాగమునందు  ఏవిధమైన విగ్రహములేకుండా యోనిని పోలిన రాతిపగులును పోలి యుండును. గర్భగృహము చీకటిగాను చిన్నదిగానుఉండి అతిసన్నని రాతిమెట్లు కలిగియుండును. ఈ గుహనందు ఒకరాయి రెండువైపులా క్రిందికివాలుగా పది అంగుళముల లోతుగా యోనివలె ఉండును. దీనిద్వారా క్రిందినుండి పైకి నీరు ప్రవహించును. జన్మలో ఒక్కసారైనా ఈపర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. సంధ్యావేళ దాటినతరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడాఉంది. అందుకే సాయంత్రం ఆలయాన్నిమూసేస్తారు.  

ఏటావేసవిలో మూడురోజుల పాటు అంబుబాచీ పండుగసందర్భంగా కామాఖ్యదేవి రజస్వలఉత్సవాలు నిర్వహిస్తారు. ఆమూడురోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారులు కూడా గుడిలోపలికి వెళ్లరు. నాలుగోరోజు లక్షలమంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆసమయంలో గర్భగుడినుంచి ప్రవహించేనీరు ఎరుపురంగులో ఉంటుంది.నవరాత్రి సమయంలో ఐదురోజుల పాటుఇక్కడ దుర్గాఉత్సవాలతో పాటు భాద్రపదమాసంలో మానసపూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో జంతుబలులు  నిషేధం.

కామాఖ్య దేవి ఆలయ సమయాలు

దేశంలోని అన్ని ముఖ్యపట్టణాల నుంచి గౌహతికి విమాన సదుపాయం ఉంది. విమానాశ్రయంనుంచి ఇరువది కిలోమీటర్ల దూరంలో కామాఖ్యదేవి ఆలయం ఉంది. గౌహతి రైల్వేస్టేషన్‌ నుంచి 6 కి.మీదూరంలో ఉంది. గౌహతిలో ఎక్కడినుంచైనా ట్యాక్సీ, ఆటోరిక్షాద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అస్సాం పర్యాటకవిభాగం ఆలయానికి ప్రత్యేక బస్సుసౌకర్యం ఏర్పాటు చేసింది. ఈఆలయము  ప్రస్తుతము బోర్దేరిసమాజ్ ఆధ్వర్యములో ఉన్నది.

ఆలయము తెరచి ఉండు సమయం ఉ 5-30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి 2-30 నుండి సాయంత్రం 5-30 వరకు.