వృద్ధ మల్లికార్జున ఆలయం

(IPLTOURS)

వృద్ధ మల్లికార్జుని ఆలయం దేవస్థానం కార్యాలయమునకు ఉత్తరంగా మరియు బ్రమరాంబ పీఠమునకు కుడివైపున ఉన్నది. శివలింగం దగ్గరగావచ్చిన ముడతలతో ఉంటుంది. ఈస్వామి ఎప్పుడు వెలసినదీ ఆధారము లేదు. స్థానికకధనం ప్రకారం మహీధరుడను రాజుయొక్క సౌందర్యవంతురాలైన కుమార్తె ఈశ్వరుని మోహించింది. తనకి శివుడివంటి భర్త కావాలని కోరుకుంది. ఆమె కలలోకివచ్చి ఈశ్వరుడు తాను శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నానని, ఆచటికివస్తే వివాహం చేసుకొంటాను అని చెప్పాడు. రాకుమార్తే శివుడు చెప్పిన చోటికివచ్చి వెదకసాగింది. పార్వతీదేవి శివుడిని అపార్ధం చేసుకొని రాజకుమార్తెపై వ్యామోహమా అని అడిగింది. అప్పుడు శివుడు పార్వతితో, యువరాణి తనను భక్తితో పూజించిందని, వివాహం అంటే ఆమెను తనలో ఐక్యం చేసుకోవడం అని చెప్పాడు. పార్వతి రాజకుమారి ఆరాధనలోని భక్తి చూపమని అడిగింది. శివుడు వెంటనే వృద్ధుడిగా మారి యువరాణి వద్దకు వెళ్లాడు. ఆమె ఎవరికోసం వెతుకుతోంది అని అడిగాడు.

రాజకుమారి తాను శివునికోసం వెతుకుతున్నానని జవాబుచెప్పింది. తానే శివుడనని శివుడు చెప్పాడు. వృద్ధుడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.రాజకుమారి కోరిక శివునిలో ఐక్యంకావడం వలన తాను ఆయన వృద్ధుడైనను వివాహ మాడతానని వేరొకరిని భర్తగా అంగీకరించనని చెప్పింది. యువరాణి భక్తికి మెచ్చి శివుడు పార్వతితో యువరాణిని తనలో ఐక్యం చేస్తున్నానని చెప్పాడు. యువరాణి భక్తికి వృద్ధ మల్లికార్జునుడు ప్రత్యక్షమై తనను పూజించినవారి క్షేమాం చూసుకుంటానని చెప్పి వృద్ధ మల్లికార్జున లింగంగా వెలుగొందాడని కధనం. మల్లిఖార్జున ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు ప్రతిష్ఠచేసిన శివలింగములు అయిదు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి  కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. వృద్ధ మల్లికార్జునుడు సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి.