భ్రమరాంబికదేవి

(6వ శక్తి పీఠం)

శివ పార్శ్వస్థితా మాతా !
శ్రీశైలే శుభే పీఠకే !!
భ్రమరాంబా మహాదేవీ !
కరుణారస వీక్షణా !!

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

భ్రమరాంబికదేవి శక్తిపీఠం

సతీదేవి ఖండితాంగాలలో మెడ భాగము ఈ పవిత్ర శ్రీశైల క్షేత్ర నందు పడినది. అష్టాదశ శక్తిపీఠములలో 6వ శక్తిపీఠము ఈ బ్రమరాంబ శక్తిపీఠము. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ప్రాచుర్యములోని కధనము ప్రకారము అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడు అయినాడని, రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు. ఇక్కడ కొలువైన సతి ‘శక్తి’ భ్రమర (తుమ్మెద) రూపంలో అవతరించి వేలకొలది ఆరుకాళ్ళ తేనెటీగలను సృష్టించగా వాటివలన అరుణాసురుడు సంహరించ బడినాడు. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈక్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుకభాగంలో కొలువై ఉందని స్థలపురాణం. అప్పటినుండి దుర్గ బ్రమరాంబికా రూపముతో శ్రీశైలమునందు వెలసినది శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్రం ప్రతిష్టించి, భ్రమరాంబాష్టకం రచించారుఅని, శ్రీశైలక్షేత్రంలోనే ఆయన ‘సౌందర్య లహరి’ కూడా రచించారని చెబుతారు.

srisailam bhramaramba devi

తూర్పు కనుమలు అయిన నల్లమల కొండలకు ఆభరణముగా నున్నది బ్రమరాంబికా ఆలయము. ఈ తూర్పు కనుమలకొండలలో శ్రీగిరి, శ్రీమల, శ్రేనగర మరియు నందితపస్సుచేసి శివపార్వతుల దర్శనము పొందిన ఋషభగిరి ఉన్నవి. అందువలననే ఈ కొండకు ఋషభగిరి అని పేరు. పూర్వము గుప్తుల వంశమునకు చెందిన మహారాణి చంద్రావతి గృహకలహము నెదుర్కొని రాజ సుఖములను విడచిపెట్టవలెనని నిర్ణయించుకొనినది. ఆమె శ్రీశైలం అడవులకు వెళ్ళి అచట పండ్లు మరియు ఆవు పాలు ఆహారముగా జీవించ సాగినది. ఒక రోజు ఆమె ఆవులలో ఒకటి పాలు ఇచ్చుటలేదని గమనించినది. పశువులకాపరిద్వారా ఆఆవు ఒక నిర్ణీత ప్రదేశమునకు వెళ్ళి అచట పాలు మల్లెతీగలచే కప్పబడిన ఒక శివలింగముపై చల్లుచున్నట్లు తెలుసుకొనినది. మరుసటి రోజు తాను కూడా ఆస్తలమునకు వెళ్ళి ఆవింత చూసినది. ఆ రాత్రి శివుడు ఆమెకలలోనికి వచ్చి తనను చూసిన స్థలములో ఆలయ నిర్మాణము చేయమని ఆదేశించినాడు. ఆ లింగము మల్లెతీగలందు చిక్కుకొని దర్శనమిచ్చుట వలన స్వామికి మల్లిఖార్జునుడు అని పేరు వచ్చినది.

మరియొక కధనము ప్రకారము శివుడు ఒకసారి వేటకు శ్రీశైలం అడవులకు వచ్చి అచట అందమైన చెంచుజాతి యువతిని చూసినట్లు, ఆమెతో ప్రేమలో పది ఆఅడవిలో ఆమెతో పాటు నివశించవలెనని తలచినట్లు, ఆయువతి పార్వతి అని కధనము. ఈరోజునకు కూడా స్థానిక చెంచుజాతివారు ఈఆలయ గర్భగుడిలోనికి అనుమతించబడుట విశేషము. మహాశివరాత్రి రోజున వారు స్వామికి అభిషేకము మరియు పూజ చేసుకొనుటకు అనుమతింపబడతారు. మత, కుల మరియు లింగ వివక్ష లేకుండా అందరూ గర్భాలయము ప్రవేశించి స్వామికి అభిషేకము దేవికి పూజ చేసుకొనుటకు అనుమతించ బడతారు.

భ్రమరాంబికదేవి ఆలయ సమయాలు

ఆంధ్ర రాష్ట్రంలో అధికజనాకర్షణ కలిగిన శక్తిపీఠం. ఆస్టాదశ శక్తిపీఠములలో ఒకటిఅయిన పార్వతీదేవి రూపమైన బ్రమరాంబికా దేవి ఆలయము శ్రీశైలము నందు మల్లిఖార్జున స్వామి ఆలయ ప్రాంగణమునందు ఉన్నది. ఇచట పార్వతి బ్రాహ్మణి శక్తి రూపము నందు కొలువబడు చున్నది. ఈ దేవతా మూర్తి విగ్రహమునకు ఎనిమిది చేతులతో పూజించ బడుచున్నది. గర్భాలయము నందు అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్ర్ విగ్రహము ఉన్నది. గర్భాలయము ముందుభాగములో శ్రీయంత్రము ఉన్నది.

బ్రమరాంబాదేవికి కుంకుమపూజ ఆన్ లైనుబుకింగ్ చేసుకొనవచ్చును. ఈ ఆలయము ఉదయము 4-30 నుండి రాత్రి 10-00 వరకు దర్శనమునకు వివిధసేవలకు తెరచియుండును.