పురుహూతికా దేవి
(10వ శక్తి పీఠం)
పురుహూతీ సతీమాతా !
పీఠికాపుర సంస్థితా !!
పుత్రవత్సాలితా దేవీ !
భక్తానుగ్రహ దాయిని !!
అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ
బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.
దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.
మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.
సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.
పురుహూతికా దేవి శక్తిపీఠం
సతీదేవి ఖండితాంగాలలో ఎడమచేయి పడినదని అస్టాదశ శక్తిపీఠములలో 10వ శక్తిపీథము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తూర్పుగోదావరి జిల్లా పితాపురము నందున్న పురుహూతికా శక్తిపీఠము అనిశాస్త్రము. తూర్పుగోదావరి జిల్లా పితాపురమునందు కల పాద గయా క్షేత్రం అష్టాదశ పీఠములలో ముఖ్యమైనదిగా పేరు కాంచినది. పద్దెనిమిది పురాణములందు ఒకటి అయిన స్కంధ పురాణమునందు మూడవ ఖండమునందు వ్యాస మహర్షి ఈ విషయము వివరింపబడినారు శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణము మూడవ అధ్యాయమునందు బనారస్ (వారణాశి), కేదారమ్ (కేదారనాధ్), కుంభకోణం మరియు పిఠాపురం (కుక్కుటేశ్వర క్షేత్రం) అను నాలుగు పుణ్య ప్రదేశములు మోక్ష స్థలములుగా తెలిపి యున్నాడు.
సతీదేవి శరీరభాగములు పడిన గయాక్షేత్రములు మూడింటిలో ఈ క్షేత్రము పాదగయా క్షేత్రము ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రము అతి ప్రాచీనమైన దివ్య శైవక్షేత్రము. గయాసుర సంహారిమిత్తము లింగ రూపుడయిన శివుడు కోడిరూపము దాల్చి గయాసురుని కోరిక మేరకు కుక్కుటేశ్వరస్వామిగా ఆవిర్భవించిన స్వయః భూలింగమూర్తి. ఈ క్షేత్ర దర్శనము పాపవినాశకరము, పితృముక్తికరము. సర్వ దుఖవినాశకరము, సర్వాభీస్ట సిద్ధిప్రదము. కృతయుగమున గయాసురుడు అను పరమ భాగవతోత్తముడైన రాక్షసుడు తీవ్ర తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా గయాసురుడు భూలోకమునందున్న అన్ననదులకంటే తనశరీరము పవిత్రమగునట్లు వరము కోరినాడు. విష్ణువు అట్లే అని వరము ఇచ్చినాడు. పవిత్ర దేహియైన గజాసురుని దర్శించినంతనే పంచ మహాపాతకాలు, క్రిమికీటకాది జన్మలెత్తిన పాతకులు గయాసురుని శరీరమునుండి వెలువడు గాలి సోకిన మాత్రమునే తరించేదివారు. ధర్మాత్ముడైన గయాసురుడు అనేక అశ్వమేధాది క్రతువులు చేసినాడు. శతక్రతువులు చేసినవారికి ఇంద్రపదవి వస్తుంది. ఆ రకముగా గయాసురుడు ఇంద్రపదవి పొందగా ఇంద్రుడు పదవీత్యుతుడు అయినాడు. ఇంద్రుడు మరలా ఇంద్రపదవి పొందుటకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి తీవ్ర తపస్సు చేసినాడు. త్రిమూర్తులు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా ఇంద్రుడు గయాసురుడు మంచివాడు అయిననూ ఆతని అనుచరులు భూలోకములోని ప్రజలను కస్టములకు గురిచేయుచున్నారని అందువలన వారు క్రతువులు చేయక ఆవిస్సులు రాక దేవతలు బలహీన పడుచున్నారని అందువలన గయాసురుని వధించి తనసింహాసనము తనకు ఇప్పించ కోరినాడు.
గయాసురుని సామదానబేధదండోపాయములలో దానము ద్వారా జయించి నిర్జించవలెనని తలచి త్రిమూర్తులు బ్రాహ్మణ వేషదారులై గయాసురుని తాము ఏడు రోజులు యాగము చేయుటకు సంకల్పించినామాని ఆయాగము చేయుటకు స్థలము కావలెనని, ఆయాగము సాధారణ భూమి భరించలేదని పుణ్యక్షేత్రములు కూడా పాపాత్ములు స్నానము, దానము, తపము యాగాదులు చేయుట వలన పాప పంకిల మయినవని అందువలన అవి ఏమియు తమ యాగమునకు పనిచేయవని, పుణ్య భరితమైన గయాసురుని దేహము యజ్నవేదికగా పనిచేయుననని, గతములో విష్ణుమూర్తినుండి భూమండలములోని అన్నిపుణ్యక్షేత్రములకంటే అతనిశరీరము పుణ్యవంతమైనదిగా నుండునట్లు వారము పొందియుండుటవలన గయాసురుని శరీరము యజ్ణము చేయుటకు వారము దినములు కావలెనని, తాము యజ్ణము చేయు పర్యంతము శరీరమును కదల్చరాదని అట్లు కదిపిన ఆతనిని సంహరించె దమని తెలుపుచూ ఆతని శరీరము కోరినారు. అంతట గయాసురుడు తన శరీరముపై యజ్ణము చేయుటకు అంగీకరించుచూ తన శరీరమునందు తలభాగము ప్రస్తుత బీహార్ రాష్ట్రములోని గయ నందు శిరస్సు ఉండునట్లు, నాభిస్థానము ఒరిస్సాలోని జాజిపూర్ నందు పాదములు ఆంద్ర ప్రదేశ్ లోని పిఠాపురములో ఉండునట్లు శరీరము విస్తారము చేసి త్రిమూర్తులను యజ్ణము ప్రారంభించమని ప్రార్ధించినాడు. విష్ణుమూర్తి తలభాగమునందు, బ్రహ్మ నాభిభాగమునందు, పరమేశ్వరుడు కాళ్ళ భాగమునందు ఉండి యజ్ణము ప్రారంభించినారు. గయాసురుడు యోగవిధ్యచే శరీరము కదలకుండా చేసుకొని ప్రతిరోజూ కొడికూతను బట్టి ఎన్ని రోజులు అయినది లెక్కించుకో సాగాడు. ఆ రీతిన ఆరు రోజులు గడచిన పిమ్మట ఇంద్రుడు మరలా త్రిమూర్తులను ప్రార్ధించగా శివుడు ఏడవరోజు తెల్లవారుఝామునకాక లింగోద్భవ కాలమున (మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి) కొక్కురుక్కో అని కుక్కుట ధ్వని చేసెను. ఈ మాయ తెలియని గయాసురుడు ఏడు రోజులు పూర్తి అయినవని సంతోషముతో దేహము కదిలించగా యజ్ణము పూర్తికాకుండానే శరీరము కదల్చినావు కావున నిన్ను సంహరిస్తామని త్రిమూర్తులు తెలిపారు. గయాసురుడు దివ్యదృస్టితో ఇంద్రుని మాయోపాయము, త్రిమూర్తులు బ్రాహ్మణ రూపముతో వచ్చుట, తన శరీరమును యజ్ణవేదికగా అడుగుట, శివుడు కోడిరూపములో తనను మోసగించినాడని తెలిసి త్రిమూర్తులచేతిలో మరణించుట ముక్తికరమని తనను వధించమని కోరినాడు. అంతట త్రిమూర్తులు చివరి కోరిక కోరుకొమ్మని అడుగగా గయాసురుడు తాను మరణించినపిమ్మట తన శరీరములోని మూడు భాగములు త్రిగయా క్షేత్రములుగాను మూడు క్షేత్రములలోనూ త్రిమూర్తులు ముగ్గురు నివసించునట్లు మూడు క్షేత్రములు శక్తి పీఠములుగా విరాజిల్లునట్లు, మరణించిన పితరులకు ఈ మూడు క్షేత్రములలో కర్మకాండ పితృకర్మలు చేయుటవలన బ్రహ్మపదము కలుగునట్లు, నామోచ్చారణ పూర్వకముగా పితృ శ్రాద్ధమువలన వార్కి గయాశ్రాద్ధ ఫలితము తద్వారా బ్రహ్మపదము పొందునట్లు వరమునుకోరినాడు.
శిరోగయ బీహార్ రాష్ట్రములో విష్ణుపాదములు మరియు మంగళ గౌరి శక్తి పీఠము కల గయనందు, నాభిగయ ఒరిస్సా రాష్ట్రములో యజ్ణవేదికాస్వరూపుడు బ్రహ్మదేవుడు మరియు గిరిజాదేవి శక్తి పీఠముకల జాజిపూర్ నందు, పాదగయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కుక్కుటేశ్వరుడు మరియు పురుహూతికా దేవి శక్తిపీఠము కల పిఠాపురమునందు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ది చెందినవి. పాడగయా క్షేత్రము పితృ ముక్తి కరము. సర్వ పాపహారము. శిరోగయ (భీహార్), నాభిగయ (ఒరిస్సా), పాదగయ (ఆంధ్ర ప్రదేశ్), మాతృగయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మ కపాలం (బదరీనాథ్, ఉత్తరాఖండ్) ఈఅయిదు పితృముక్తికర క్షేత్రములు. ఆలయముప్రవేశ ద్వారము చేరినవెంటనే కోనేరు కనిపిస్తుంది. యాత్రికులు ఈకొనేరునందు స్నానముచేసి ఆలయము ప్రవేశిస్తారు.
పురుహూతికా దేవి ఆలయ సమయాలు & సమీపంలోని చూడవలసిన ప్రదేశాలు
ఈ కోనేటికి కుడిభాగమున కుక్కుటేశ్వరస్వామి ఆలయమున్నది. ఈ కుక్కుటేశ్వరస్వామి ఆలయమునకు ఈశాన్యముగా పురుహూతికా శక్తి పీఠము ఉన్నది. ఈ ఆలయము దక్షణ ముఖముగా ఉన్నది. పురుహూతికా దేవి ఆలయము చిన్నది అయిననూ ఆలయముచుట్టూ గోడలపై అష్టాదశ శక్తిపీఠముల మూర్తులు అధ్బుతముగా చెక్కబడినవి. ప్రస్తుతము పురుహూతికా దేవి విగ్రహము ఉన్న ప్రదేశములోనే అసలు విగ్రహము పాతిపెట్టబడినది అని తలుస్తారు.
ఈ ఆలయము ఉదయం 5-30 నుండి 12-00 వరకు రాత్రి 9-00 వరకు తెరచి ఉంటుంది.