పితృదేవతల ఆరాధన
శ్రాద్ధకర్మ
(IPLTOURS)
జన్మలన్నిటిలోనూ మానవజన్మ ఉత్కృష్టమైనది అని పురాణాలయందు తెలుపబడినది. కేవలము మానవజన్మ మాత్రమే మనసా, వాచా మరియు కర్మనా దైవాన్ని ధ్యానించేభాగ్యం కలిగిఉంది. ప్రేమాభిమానములు, అసూయల అనుభవం మానవజన్మనందే సాధ్యం. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధిదేవోభవ అన్న నానుడియందు జన్మనిచ్చినతల్లితండ్రులు, విధ్యనేర్పీన గురువు మరియు స్నేహితుల ఋణంతీర్చుకొనే అవకాశం వారికిసద్గతులు కలిగించు అవకాశం మానవజన్మనందే సాధ్యం. శాస్తప్రకారం మరణించినవారి కుమారులు, జామాత (కుమార్తె భర్త), దౌహిత్రుడు (కుమార్తెయొక్క కుమారుడు), బ్రాహ్మణుడు వరుసక్రమంలో లభ్యతనుబట్టి మరణించినవారి అంత్యక్రియలు, దశదినఖర్మ అటుపిమ్మట సంవత్సరవారి ఖర్మలు చేయుటవల్ల వారిఆత్మలకు సద్గతులు కలుగజేసి వారిదీవనలతో సుఖసంతోషాలు పొందవచ్చును.
హిందూ ధర్మశాస్త్రముల ప్రకారం జన్మించినజీవికి మరణంతప్పదు. మరణించినజీవికి మరల జననంతప్పదు. అంతేకాక ప్రతిజీవికి బాహ్యమున కనిపించు శరీరంతోపాటు శరీరంలో ఆత్మఉంటుందని ఆఆత్మ శరీరంనుండి బయటకు రావడమే జీవికి మరణమని తెలుప బడింది. మరణించిన జీవిఆత్మ తిరిగి జన్మించువరకు జీవించి ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యముల ననుసరించి పుణ్యముచేసిన ఆత్మ ముక్తిపొంది దైవలోకంనందు పరమాత్మలో లీనంకావడం జరుగుతుంది. పాపములు చేసిన జీవిఆత్మ నరకలోకంలో బాధింపబడుచూ ముక్తి పొందలేక దైవలోకం చేరలేక దివికి భువికి మధ్య తిరుగాడుతుంది. అట్టిఆత్మలకు శ్రాద్ధకర్మలద్వారా వారిబాధ ఉపశమింపచేసి శాంతిని కలుగజేసి తద్వారా వారు ముక్తిపొందుటతోపాటు శ్రాద్ధకర్మ ఆచరించువారి వంశాభివృద్ధి పితృదేవతల ఆశీస్స్లులతో పొందవచ్చని తెలియ చేయబడింది. అందువల్ల మరణించిన వారిఆత్మ నరకలోకంనందు ప్రముఖమైన వైతరిణీనది దాటుటకు గోదానం చేసేదరు. కొందరు మరణించినవారి అంత్యక్రియలు నివాస గ్రామంలో, దశదినఖర్మ ప్రత్యేకమైన స్థలములో పన్నెండునెలలు మరణించిన తిధి రోజున శ్రాద్ధకర్మ(మాసికం) గృహమునందు నిర్వర్తించి సంవతరాంతమున సంవత్సరీకములు జరిపేదరు. మరికొందరు అంత్యక్రియలు, మూడు మరియు తొమ్మిది రోజులలో దినకార్యక్రమం అటుపిమ్మట ఏటిమాసికం నిర్వహించెదరు. మరణించిన వ్యక్తికి పుణ్య క్షేత్రములైన కాశీ (వారణాశి), గయ మరియు ప్రయాగలందు పిండప్రధానం చేయడంవల్ల వారిఆత్మలకు ముక్తి కలుగుతుంది. వార్ధక్యమువలనకానీ యాదృచ్ఛకముగా కానీ వారణాశినందు మరణించిన వారి అంత్యక్రియలనుండి అన్నీకార్యక్రమములు కాశీనందు నిర్వహించెడరు.
వాస్తవంగా మరణించినవారి అంత్యక్రియలు సాధారణంగా నది లేదా కాలువఒడ్డున దశదిన కర్మలు నిర్ణీతప్రదేశంలో మరియు శ్రాద్ధకర్మ వారి స్వంత ఇంటిలో చేయుట ధర్మమని పురాణములందు తెలుపబడింది. చతుర్వర్ణములలో బ్రాహ్మణ, వైశ్య మరియు క్షత్రియులలో మరణించి నవారికి పన్నెండునెలలు ప్రతినెల తిధిరోజున మాసికము అటు పిమ్మట అన్నివర్ణములవారు సంవత్సమునకు ఒకపర్యాయం ఆబ్దీకముజరిపి పెద్దలను స్మరించుట శాస్త్రము. భూమిపై ఒకనెల ఆత్మలకు ఒకరోజుఅని పిమ్మట సంవత్సరము ఒక రోజని ఆరోజువారు పిండ ప్రధానంద్వారా చేయు కర్మచూసి సంతోషించి సంతానాన్ని దీవించి దేవలోకం పొందుతారని నమ్మకం. మరణించినవారి పిండప్రధాన క్రతువులు వారి స్వంతఇంటిలో చేయుట ధర్మమని పురాణములందు తెలుపబడింది. అట్టిఅవకాశం లేనందున త్రేతాయుగంలో రాముడు దశరధునకు, ద్వాపర యుగంలో బలరాముడు పూర్వీకులకు, శ్రేకృష్ణునికి అర్జునుడు (బావ), పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో వీరమరణం పొందివ భీష్మ, ద్రోణ, అభిమన్యు, దుర్యోధన, కర్ణాధి వీరులకు పుణ్యక్షేత్రములందు శ్రాద్ధఖర్మలు చేసినట్లు పురాణ ప్రవచనం. పితృదేవతల ఆరాధనచేసి వారిని తృప్తిపరచకపోయిన వంశము అభివృద్ధి చెందదని, జీవనపర్యంతము ఈతిబాధలు పిమ్మట నరకబాధలు తప్పవని శాస్త్రప్రవచనం.
శాస్త్రాల్లో చెప్పినా పెద్దలు చెప్పినా మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ అన్నమాటలు అక్షర సత్యాలు. ఇవి అన్నీ దైవస్వరూపాలు అన్నది సుస్పష్టం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పిండ ప్రధానంచేసి వారికి నివాళు లర్పించడంద్వారా తమకు మంచి భవిష్యత్తు ఉండేలా చూసుకోవడం సంతానం బాధ్యత. తల్లితండ్రుల మరియు పూర్వీకుల ఆత్మలు ముక్తిపొందుటకు పితృ ముక్తిక్షేత్రాలుగా పరిగణించు పంచ (ఐదు) గయా క్షేత్రాలైన శిరోగయ (బీహార్), నాభి గయ (ఒరిస్సా), పాద గయ (ఆంధ్రప్రదేశ్), మాతృ గయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మకపాల్ (బద్రీనాథ్)లలో పిండ ప్రధానం చేయవలసి ఉంది. హిమాలయములలో బదరీనాధ్ నందలి బ్రహ్మకపాల్ నందు పిండ ప్రదానము చేసిన పూర్వీకులకు బ్రహ్మలోకం సిద్ధించునని అందువలన బ్రహ్మకపాల్ నందు శ్రాద్ధకర్మ చేసినవారికి ప్రతిసంవత్సరం శ్రాద్ధకర్మ చేయనవసరం లేదని తెలుపబడినది. కానీ ప్రవచనకారుల నిర్వచనం ప్రకారం మరణించినవారికి ప్రతిసంవత్సరం శ్రాద్ధకర్మ చేయుటవలన ఆత్మలు సంతృప్తి చెందుతాయని కర్త (కర్మచేయువారు) జీవన పర్యంతం శ్రాద్ధకర్మ ఆచరిస్తే వారికికూడా సద్గతులు కలుగుతాయని తెలుపబడింది. బదరీ యాత్ర అన్నివయసులవారికి శారీరకంగా సాధ్యంకాని పని. పంచగయ లందు శారీరక మరియు ఆర్థిక దృఢత్వం లేక పిండప్రదానం చేయలేనివారు వారణాశి లేదా కాశీ, గయ మరియు ప్రయాగలందు చేయవలెనని తెలుపబడింది. సప్తమోక్ష ప్రవేశాలలో ఒకటిగా పరిగణించబడే కాశీలో దహన సంస్కారాలు మరియు కాశీ, గయ, ప్రయాగలలో పిండ ప్రధానం చేయడం వలన ఆత్మలు నరక యాతన నుండి విముక్తి పొంది స్వర్గాన్ని పొందుతారని స్పష్ట మవుతుంది. గయనందు ఫల్గుణినది ఒడ్డున ప్రతిసంవత్సరం జరుగు పితృపక్ష మేళానందు దేశం నలుమూలలనుండి యాత్రికులు పూర్వీకులకు పిండాలను సమర్పించడానికి గయదర్శిస్తారు. పితృపక్షము సందర్భంగా అయిదు నుండి డెబ్బది లక్షలమంది యాత్రికులు పిండ ప్రధానం చేయడానికి ప్రతిఏడు గయాక్షేత్రం దర్శిస్తారని అంచనా వేయబడింది. పితృ పక్షం లేదా మహాలయ పక్షంనందు పూర్వీకులకు పిండప్రధానం చేయవలసిన ఆశ్యకతపై వివరంగా తెలిపియున్నాము.
మరణంతో సంబంధం ఉన్నందున శ్రాద్ధకర్మ అశౌచంగా అశుభకరంగా పరిగణించ బడుతుంది. శ్రాద్ధకర్మ పెద్దకుమారుడు, కుమారుడు లేనిఎడల తల్లితండ్రుల వైపు కుటుంబంలోని మూడు తరములలో మగబంధువు చేయవలసి ఉంటుంది. పితృకర్మ చేయడానికి ముందు పురుషుడు పవిత్రమైన యజ్ఞోపవీతం ధరించాలి. పూర్వీకులకు సమర్పించు ఆహారం అరటిఆకుపై ఉంచుతారు.ఆహారంలో తప్పనిసరిగా క్షీరాన్నం (పాలు పంచదార/బెల్లం మరియు బియ్యంతో చేసినది), వరిఅన్నం మరియు పప్పువండాలి. శ్రాద్ధకర్మ చేయుపురుషుడు స్నానంచేసి ధోవతి, కుడి ఉంగరంవేలుకు దర్భతోచేసిన ఉంగరం ధరించాలి. పూర్వీకులను దర్భఉంగరంలోకి ఆవాహనచేస్తారు. శ్రాద్ధకర్మ చేయు సమయంలో ధరించు పవిత్రమైన దారం లేదా యజ్ఞోపవీతం కుడివైపుకు, ఎడమవైపుకు అనేకమార్లు మార్చవలసి ఉంటుంది అందువలన ఆచ్ఛాదనలేని ఛాతీతో కర్మ చేయబడుతుంది.
శ్రాద్ధ కర్మనందు పూర్వీకులకు నైవేద్యంగా వండిన అన్నం, నెయ్యి మరియు నల్లనువ్వులు కలిపిన బంతుల ఆకారంలోని పిండములపై కుడిచేయి బోటకన వేలిమీదుగా నీటిని ధారబోయడం పిండప్రధానంగా చెప్పబడింది. పిమ్మట దర్భగడ్డి రూపంలో విష్ణువు ఆరాధన ఉంటుంది. పిండములకు నైవేధ్యంపెట్టిన పిమ్మట కాకివచ్చి ఆహారాన్నితింటే పితృదేవతలు నైవేధ్యం స్వీకరించినట్లు భావిస్తారు. శ్రాద్ధకర్మ నందు కాకిపాత్ర మహోన్నతమైనది. కాకి యమునినుండి వచ్చినదూత లేదా పూర్వీకులఆత్మ అని నమ్మేదరు. భూతతృప్తికి ఆవునకు మరియు శునకమునకు ఆహారం పెట్టవల్సి ఉంది. బ్రాహ్మణులను పూజించి వారికి ఆహారం సమర్పిస్తారు. బ్రాహ్మణులను వస్తుపరంగా లేదా డబ్బురూపేణా సంతృప్తిపరచి వారి రూపంలో పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. కాకి మరియు బ్రాహ్మణులు ఆహారం సేవించిన పిమ్మట కుటుంభములోవారు భుజించేదరు.
ప్రస్తుత దైనందికజీవితంనందు ఉధ్యోగరీత్యా తల్లితండ్రులకు దూరముగా నివాసము, ఉండుట వారి పనిఒత్తిడివలన తల్లితండ్రుల అంత్య క్రియలు, దశదిన ఖర్మ, అబ్దీకాది ఖర్మలుచేయుటకు ఏర్పాట్లుచేసుకొను సమయం శరీరంనందు శక్తిలేకవారికి ఆర్ధికస్థితి ఉన్ననూ ఖర్మలను నిర్వహించలేక పోవుచున్నారు. ప్రస్తుతం ఉన్న అనేక రైలు మరియు విమాన సౌకర్యాలు అందుబాటులో ఉండటంవల్ల కాశీకి ప్రయాణించడం సులభమైనది. కాశీతోపాటు గయ మరియు ప్రయాగ్‌రాజ్‌లలో పిండ ప్రధానం మరియు ఇతర కర్మలు నిర్వహించుటకు వసతి ఆహారంతో పాటు బ్రాహ్మణులు అందుబాటులో ఉన్నారు. వంశంలో మరణించిన పెద్దల ఆస్తికలను గంగానదిలో నిమజ్జనం చేసిన ఆత్మలకు పుణ్యలోకములు సంప్రాప్తించునని హిందువుల నమ్మకం. శాస్త్రం నందు కర్త (శ్రాద్ధ కర్మ ఆచరించువారు) వయోవృద్దులైననూ లేదా వారు ఉద్యోగరీత్యా విదేశములందు నివసించుచూ శ్రాద్ధకర్మ ఆచరించ వీలులేనప్పుడు వారి స్థానములో శోత్రియ బ్రాహ్మణుని నియోగించి వారికి బదులు శ్రాద్ధకర్మ మరియు పిండప్రదానం చేయవచ్చని తెలిపినందువల్ల బ్రాహ్మణుని నియోగించి కర్మ జరుప వచ్చును. ప్రస్తుతం టెక్నాలజి అభివృద్ధి చెందుటవల్ల జరుపు కార్యక్రమం వారు నివసించుచున్న ప్రదేశంనుండి live వీడియో ద్వారా వీక్షించు వెసులుబాటు కలుగజేయు చున్నారు.