రుద్ర ప్రయాగ

(IPLTOURS)

రుద్రప్రయాగ చార్ ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్, బదరీనాధ్ తదితర పుణ్యక్షేత్రములు మరియు హిమాలయ పర్వతములలో కల ఇతర దైవక్షేత్రములుగాని మానస సరోవర్ తదితయాత్రలకుగాని కేంధ్రస్థానమై యున్నది. రుద్రప్రయాగననుండి ఉత్తరముగా అగస్త్యముని, కుండ్, గుప్తాక్షి, గౌరీకుండ్ మీదుగా పయనించి కేదార్నాథ్,  తూర్పు మరియు ఉత్తరంగా కర్ణప్రయాగ, నందప్రయాగ, చామోళీ, పిప్పల్ కోట్. జోషీమఠ్, హనుమాన్ చత్తి మీదుగా ప్రయాణించి బదరీనాధ్చే రవలసి ఉంటుంది. రుద్రప్రయాగనుండి 76 కి.మీ  దూరంలో కేదార్నాథ్, 155 కి.మీ దూరంలో బదరీనాథ్ ఉన్నవి. ఉత్తరకాశీనుండి బయలుదేరిన యాత్రికులు దేవప్రయాగ ఆలయముల దర్శనం పిమ్మటతదుపరిక్షేత్రముల సందర్శనకుగాను దేవప్రయాగనుండి 75 కి.మీ దూరంలో ఉన్న రుద్రప్రయాగ చేరవలసి ఉంటుంది.

రుద్రప్రయాగ

రుద్రప్రయాగ జిల్లా ప్రధానకేంద్రం మరియు మునిసిపల్ పట్టణము. అలకనందనదిపై ఉన్న అయిదు సంగమప్రదేశములలో ఋషీకేశ్ నుండి రెండవది. కేదార్నాధ్ జ్యోతిర్లింగక్షేత్రం రుద్రప్రయాగ జిల్లాలోనే కలదు. రుద్రప్రయాగ అలకనంద మరియు మందాకిని నదుల సంగమ ప్రదేశము. 2013 సంవత్సరములో సంభవించిన వరదలలో సంగమ ప్రదేశముతో పాటు ఇచటగల క్రొత్త భవంతులు అధికభాగం వరడనీటిలో కొట్టుకొనిపోవుట మరియు దెబ్బతినుట జరిగినది. మందాకినినదిపై గల కాలిదారివంతెన రైతొలివద్ద మరియు గౌరీకుండ్నుం డి కేదారనాధ్ కాలిదారి అధికభాగం వరదలలో కొట్టుకుపోయినవి. హిమాలయపర్వత ప్రాంతంలోని కేదార్నాధ్, బదరీనాధ్ తదితర పుణ్యక్షేత్రములకు రోడ్డుప్రయాణం రుద్రప్రయాగమీదుగా సాగును. ఋషీకేశ్ నుండి రుద్రప్రయాగకు ప్రతిరోజూ రవాణాసంస్థ బస్సు సర్వీసులుకలవు. ఋషీకేశ్ నుండి దేవప్రయాగ మీదుగా రుద్రప్రయాగ  141 కి మీ దూరంలో మరియు ఉత్తరకాశీ నుండి 175 కి.మీ దూరంలోనూ నున్నది. రుద్రప్రయాగలో అతి ముఖ్యమైన ఆలయములు మరియు ప్రదేశముల వివరములు దిగువ నిచ్చుచున్నాము

కొటేశ్వర మహదేవ్   

రుద్రప్రయాగ పట్టణమునందు అలకనంద నదీతీరంలో ఉన్న పవిత్రదేవాలయం కోటేశ్వర మహదేవ్ ఆలయం. ఆలయము అలకనంద నది ఒడ్డున గుహలో ఉన్నది. శివుడు కేదార్నాధ్ వెళ్ళు సమయమునందు ఇచ్చట తపస్సుచేసినట్లు కధనం. పురాణ కధనం ప్రకారం శివుడు భస్మాసురునికి ఆతను ఎవరినెత్తిన చేయిపెట్టిన వారుభస్మం అగునట్లు వరమిచ్చినాడు. ఆవరం పరీక్షించ తలచిన భస్మాసురుడు శివుని శిరస్సుపై చేయిపెట్టబోగా శివుడు వానినుండి పారిపోయి కేదార్నాధ్ వెల్లుచూ మార్గంమధ్యలో రుద్రపయాగనందు అలాకానందనది ఒడ్డున కల గృహనందు విష్ణువుగురించి తపస్సు చేసినాడు. విష్ణువు మొహిని అవతారంలో భస్మాసునికి కనిపించి నృత్యములో పోటీపడమని  రెచ్చకొట్టగా భస్మాసురుడు అంగీకరించి నృత్యము  చేయసాగాడు. నృత్యంమధ్యలో విష్ణువు తనచేతిని తలపైనుంచుకొను భంగిమ అభినయించగా భస్మాసురుడు తనఅరచేతిని తలపై స్వయముగా పెట్టుకొని భస్మమై మరణించినాడు.

 రుద్రనాధ్ ఆలయం 

రుద్రప్రయాగనందు మందాకీని మరియు అలకనందనదుల సంగమప్రదేశములో ఉన్న రుద్రనాధ్ ఆలయం పరమశివుని నామముపై ప్రసిద్ధి చెందింది. పురాణ కధనం ప్రకారం నారదమహర్షి సంగీత కళనందు ప్రావీణ్యం పొందవలెనని సంగీతమునకు మూలపురుషుడైన మహాశివుని గురించి సుదీర్ఘ తపస్సు చేశాడు. నారదునితపస్సుకు సంతోషించి శివుడు రుద్రునిగా అవతరించి నారదమహర్షిని అనుగ్రహించినట్లు భక్తుల నమ్మకం. శివుడు పార్వతీదేవి జీవనభంగిమ పోలిన రుద్రవీణ సృష్టించాడని, శివుని అయిదు ముఖములనుండి అయిదురాగములు ఉద్భవించాయని పురాణములందు తెలుపబడింది. ఆరవరాగాన్ని పార్వతీదేవి తానేస్వయంగా సృష్టించింది. శివుని అయిదుముఖములందు తూర్పుముఖం భైరవరాగం, పశ్చిమముఖం హిందోళరాగం, ఉత్తరముఖం మేఘరాగం, దక్షణముఖం దీపకరాగం, ఆకాశంవైపుచూచు అయిదవముఖం శ్రీరాగం సృష్టించగా, పార్వతీదేవి స్వయంగా కౌశికరాగం సృష్టించింది. నారదముని పరమశివుని పూజించి శివునివద్ద సంగీతము నేర్చుకొనినాడు. సంగీతమునకు ఆదిపురుషుడైన రుద్ర రూపములో నారదునికి పరమశివుడు సంగీతము నేర్పినాడు. ఇప్పటికీ ఇక్కడ నారద శిల పేరుతో ఒక రాయి ఉన్నది.

చాముండిదేవి ఆలయం  

యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః !
యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః ! 
యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితః ! 
నమస్థ్మెయఃనమస్థ్మెయఃనమస్థ్మెయః నమోనమః !!                                             

చాముండిదేవి ఆలయం అలకనంద మందాకిని నదుల సంగమప్రదేశంలో ఉన్నది. పార్వతీదేవి అవతారమైన చాముండిదేవి శివరూపమైన రుద్రనాధ్ మహాదేవుని భార్య మరియి చాముండిరూపంలో ఇచట కొలువ బడుచున్నది. చాముండీదేవి మరియు జగదాంబ ఆలయాలు హిందువులలో మతపరమైన ప్రాముఖ్యత కలిగిఉన్నాయి. సంగమప్రదేశంలోని చాముండీదేవి ఆలయం భారీవరదనష్టం చవిచూసింది.

కాలినడక వంతెన (జూలా) 

2013 వరదల విపత్తు పిమ్మట  అతలాకుతలమైన మందాకిని, అలాకానంద నదుల సంగమప్రదేశం ఇప్పటికినీ పూర్తిగా తేరుకోలేదు. రుద్ర ప్రయాగవద్ద కుడివైపునుండి ప్రవహించు అలకనంద మరియు ఉత్తరంవైపునుండి ప్రవహించు మందాకినినదుల సంగమప్రదేశంలో 2013 సంవత్సరం జూన్ నెల 17వ తేదీన సంభవించిన వరదలకు ముందు మందాకిని నదిపై కాలినడకవంతెన (ఝూలా) ఉండేడిది. ఈవంతెన ఉత్తరాఖండ్ నందు సంభవించిన వరదలలో కొట్టుకొనిపోయింది. అయిననూ ఇచటఎత్తైన ప్రదేశంనుండి పరిసర ప్రదేశములు చూచుటకు కనువిందుగా యుండును. మరియు నారదశిల అని పిలువబడు పెద్ద రాయి కలదు. శతాబ్దాలుగా సత్యయుగపు సాక్షిగా ఇక్కడఉన్న నారద శిల వరదల్లో కూరుకుపోయింది. వరద శిధిలాలమధ్య కూరుకుపోయిన ఆశిలపై వరదశిధిలాలు నేటికీ తొలగింప బడలేదు. నారదమహర్షి ఈశిలపై వెలసంవత్సరముల తరబడి శివునిగురించి తపస్సు చేసి సంగీతజ్ఞానాన్ని పొందాడని కధనం.

ధరీ దేవి ఆలయం

అలకనంద నదిఒడ్డున ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శ్రీనగర్ మరియు రుద్రప్రయాగ మధ్య రుద్ర ప్రయాగకు 16 కి మీ దూరంలో కళ్యాసౌర్ అను గ్రామములొ ఉన్నది.స్థానికులు ధరీదేవి ప్రాధమికంగా కన్యగాను, పిమ్మట యువతిగాను తరువాత వృద్ధస్త్రీగాను రూపు మారుతుందని నమ్మెదరు.స్థానికకధనం ప్రకారం ఒకపర్యాయం కాళిఆలయం వరదలలో కొట్టుకొనిపోగా కాళీదేవివిగ్రహం ఒకరాతినిపట్టుకొని ఆగిందని, ధరో గ్రామప్రజలు దైవికమైన కాళీదేవి స్వరంవినిపించి విగ్రహం వెలుపలకు తీసి అచ్చటనే ప్రతిష్టించినారని, అప్పటినుండి ఆలయం ధరీదేవి ఆలయంగా పిలువబడుతున్నదని తెలుస్తూంది. ధరీదేవి విగ్రహం ఎటువంటి పైకప్పులేకుండా ఆరుబయట ఉంచవలె నని శాసించినదని, ఆప్రకారమే విగ్రహం ఆకాశంక్రింద ప్రతిష్టించబడిందని నమ్మకం. ధరీదేవి హిమాలయ పర్వతప్రాంతం రక్షించు దేవతఅని చార్ ధామ్ అయిన గంగోత్రి, యమునొత్రి, కేదార్నాధ్ మరియు బదరీనాధ్ క్షేత్రములకు సంరక్షకురాలని ప్రజలు నమ్మెదరు. 108 శక్తిపీఠములలో ఒకటిగాను శ్రీమత్ భగవతి పేరుతో కొలువబడు చున్నది.

ధరీదేవి విగ్రహంపై సగభాగము ఆలయములో సగభాగము కాళీమఠ్ నందు కాళీరూపములో పూజింపబడుచున్నది. 2013 సం.ము జూన్ 16వ తేదీన అలకనందనదిపై పవర్ ప్రాజెక్టు కట్టుటకుగాను పూర్వపు ఆలయం నందలిమూర్తిని అలకనందనదిలో మునుగకుండా ఎగువ భాగమున నిర్మించిన కాంక్రీటు ఫ్లాట్ ఫారంపైకి మార్పు చేసియున్నారు. ధారాదేవి విగ్రహమును మార్చినవెంటనే అదేరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రమునకు విపరీతమైన వరదలు వచ్చుటద్వారా కేదార్నాధ్ నుండి రుద్రప్రయాగవరకు అధిక ప్రాణనష్టము మరియు ఆస్తినష్టము జరిగినది. స్థానికులు మరియు భక్తులు అమ్మవారిని మూలస్థానంనుండి మార్చినందువలననే వరదలువచ్చి ఆస్తినష్టము ప్రాణనష్టము జరిగిందని తలచెదరు. గతములో రెండువందల సంవత్సరములకు పూర్వం ఒకరాజు ధరీదేవి విగ్రహం మార్చుటకు ప్రయత్నించగా భూకంపంవచ్చి కేదార్నాధ్ ప్రాంతమునకు నష్టము కలిగినదని ప్రజలు చెప్తారు.

వరదలలో కేదార్నాథ్ వెళ్ళు నడకమార్గము కేదార్నాథ్ నందలి తాత్కాలిక వసతిభవనములన్ని కొట్టుకొని పోయినవి. దర్మిలారాష్ట్ర ఉత్తరాఖండ్ప్ర భుత్వంవారు కేంద్రప్రభుత్వ సహకారంతో కేదార్నాధ్ ఆలయంచేరు నడకమార్గము నిర్మించారు. మరియు ప్రస్తుతము ఇచట రాత్రి బసచేయుటకు తాత్కాలిక వసతిభవనములు నిర్మించారు. జి.వి.యం.యన్. వారిచే బసకు పూర్తిస్థాయి భవనములు ఇటీవల నిర్మించబడి యాత్రికులకు అందుబాటులో ఉన్నవి. ఇచట కామన్ బాత్ రూమ్ మరియు పరిమిత నీటి సౌకర్యము టిఫెన్ మరియు భోజన సదుపాయములు కలవు. ఇవే కాక నూతనముగా నిర్మించిన అనేక ప్రయివేట్ హోటల్స్ మరియు వసతి గృహములు ఉన్నవి.