రుద్రనాధ్
(4వ కేదార్)
(IPLTOURS)
పంచ కేదార్ లలో నాలుగవ కేదార్ అనిపిలువబడు రుద్రనాధ్ ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతములో నున్న శివునికి చెందిన హిందూ దేవాలయము. సముద్ర మట్టమునకు సుమారు 11800 అడుగుల ఎత్తున ఉన్న సహజ సిద్దమైన రాతి నిర్మితమైన దేవాలయము. ఈ ఆలయము మరుగుజ్జు (ఎత్తు తక్కువ) గన్నేరుచెట్ల తోనూ పర్వత పచ్చిక బయళ్లతోనూ నిండిన దట్టమైన ఆటవీ ప్రాంతము నందు ఉన్నది. పంచ కేదార్ యాత్ర నందు రుద్రనాధ్ దేవాలయ సందర్శనమునకు ముందు కేదార్నాధ్, మధ్యమహేశ్వర్ మరియు తుంగనాధ్ దేవాలయములు సందర్శించ వలెను. రుద్రనాధ్ పిమ్మట కల్పెశ్వర్ దర్శించుకొనవలయును. శివుని ముఖ భాగము ఇచట నీలకంఠమహదేవ్ పేరుతో కొలువబడుచున్నది. గోపేశ్వర్ నుండి 3 కి.మీ దూరములో కల సాగర్గ్రా మమునుండి పర్వతారోహణ (నడక) ప్రారంభము అవుతుంది. ఇదికాక గోపేశ్వర్ నుండి 12 కి.మీ. పర్వతారోహణ (నడక) మార్గము కలదు. ఈ మార్గము అనసూయాదేవి ఆలయము ద్వారా ఉంటుంది. ఈ పర్వతారోహణ మిక్కిలి కష్ట తరమైనది మరియు సుమారు 24 కి.మీ దూరము ఉంటుంది.
మరియొక మార్గము చొప్తా నుండి 30 కి.మీ. వాహనము లోనూ 10 కి.మీ ట్రెక్ (నడక) ద్వారా 5 గం ప్రయాణించి పానర్గుఫా చేరవలయును. ఆచటినుండి 12 కి.మీ. 6 గంటలు ట్రెక్ (నడక) ద్వారా ప్రయాణించి రుద్రనాధ్ చేరవచ్చును. రుద్రనాధ్ నందు మరియు కల్పెశ్వర్ ఆలయము లందు ఆది శంకరాచార్యులచే నియమించ బడిన దాసనమీ గోసన కులస్థులు పూజా కార్యక్రమములు నిర్వర్తించెదరు.
స్థల పురాణం ప్రకారం మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు నిర్జించినారు. పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి విముక్తులు కావలెనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకుడు పరీక్షిత్తునకు ఆప్పగించి శివుని దర్శించి దీవెనలు పొందవలెనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్య క్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామమునందు వారివలన కలిగిన ప్రాణ నష్టమునకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించుకోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునందు అదృశ్యమైనాడు. వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు. భీముడు గుప్తాక్షి వద్ద రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గడ్డి మేయుచూ కనిపించినాడు.
భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండి అదృశ్యమై తరువాత ప్రత్యక్షమై ఆరు భాగములుగా విడిపోయినది. మూపుర భాగము కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ లతో పాటు తల భాగము నేపాల్ నందు ఖాట్మండునకు 25 కి.మీ దూరములో కల చౌలి మహేశ్వర్ నందు పడినవి. పాండవులు శివుని కొలుచుటకు గాను ఈ అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని తలభాగము పడిన ప్రదేశము నేపాల్ లోని చౌలి మహేశ్వర్. పాండవులు చౌలిమహేశ్వర్ మినహా మిగిలిన పంచ కేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట ఈ ఆలయములందు తపస్సు యజ్ణము చేసి బదరీనాధుని దర్శించి మానా గ్రామమునుండి వారు. స్వర్గారోహణ యాత్ర చేసినారు.
IPLTOURS – Indian Pilgrim Tours