పాదగయ
(IPLTOURS)
ఆంధ్రప్రదేశ్ నందు తూర్పుగోదావరిజిల్లా పిఠాపురం లేదా పీఠికాపురమునందు అష్టాదశ శక్తిపీతమలందు 10 వ శక్తిపీతమైన పురుహూతికాదేవితోకలసి వెలసిన కుక్కుటేశ్వరస్వామి కధనము వీక్షకులకు అందించుచున్నాము. కృతయుగమున గయాసురుడు అను పరమ భాగవతోత్తముడైన రాక్షసుడు తీవ్ర తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా గయాసురుడు భూలోకమునందున్న అన్ననదులకంటే తనశరీరము పవిత్రమగునట్లు వరము కోరినాడు. విష్ణువు అట్లే అని వరము ఇచ్చినాడు. పవిత్ర దేహియైన గజాసురుని దర్శించినంతనే పంచ మహాపాతకాలు, క్రిమికీటకాది జన్మలెత్తిన పాతకులు గయాసురుని శరీరమునుండి వెలువడు గాలి సోకిన మాత్రమునే తరించేదివారు. ధర్మాత్ముడైన గయాసురుడు అనేక అశ్వమేధాది క్రతువులు చేసినాడు. శతక్రతువులు చేసినవారికి ఇంద్రపదవి వస్తుంది. ఆ రకముగా గయాసురుడు ఇంద్రపదవి పొందగా ఇంద్రుడు పదవీత్యుతుడు అయినాడు. ఇంద్రుడు మరలా ఇంద్రపదవి పొందుటకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి తీవ్ర తపస్సు చేసినాడు. త్రిమూర్తులు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా ఇంద్రుడు గయాసురుడు మంచివాడు అయిననూ ఆతని అనుచరులు భూలోకములోని ప్రజలను కస్టములకు గురిచేయుచున్నారని అందువలన వారు క్రతువులు చేయక ఆవిస్సులు రాక దేవతలు బలహీన పడుచున్నారని అందువలన గయాసురుని వధించి తనసింహాసనము తనకు ఇప్పించ కోరినాడు.
గయాసురుని సామదానబేధదండోపాయములలో దానము ద్వారా జయించి నిర్జించవలెనని తలచి త్రిమూర్తులు బ్రాహ్మణ వేషదారులై గయాసురుని తాము ఏడు రోజులు యాగము చేయుటకు సంకల్పించినామాని ఆయాగము చేయుటకు స్థలము కావలెనని, ఆయాగము సాధారణ భూమి భరించలేదని పుణ్యక్షేత్రములు కూడా పాపాత్ములు స్నానము, దానము, తపము యాగాదులు చేయుట వలన పాప పంకిల మయినవని అందువలన అవి ఏమియు తమ యాగమునకు పనిచేయవని, పుణ్య భరితమైన గయాసురుని దేహము యజ్నవేదికగా పనిచేయుననని, గతములో విష్ణుమూర్తినుండి భూమండలములోని అన్నిపుణ్యక్షేత్రములకంటే అతనిశరీరము పుణ్యవంతమైనదిగా నుండునట్లు వారము పొందియుండుటవలన గయాసురుని శరీరము యజ్ణము చేయుటకు వారము దినములు కావలెనని, తాము యజ్ణము చేయు పర్యంతము శరీరమును కదల్చరాదని అట్లు కదిపిన ఆతనిని సంహరించె దమని తెలుపుచూ ఆతని శరీరము కోరినారు.
అంతట గయాసురుడు తన శరీరముపై యజ్ణము చేయుటకు అంగీకరించుచూ తన శరీరమునందు తలభాగము ప్రస్తుత బీహార్ రాష్ట్రములోని గయ నందు శిరస్సు ఉండునట్లు, నాభిస్థానము ఒరిస్సాలోని జాజిపూర్ నందు పాదములు ఆంద్ర ప్రదేశ్ లోని పిఠాపురములో ఉండునట్లు శరీరము విస్తారము చేసి త్రిమూర్తులను యజ్ణము ప్రారంభించమని ప్రార్ధించినాడు. విష్ణుమూర్తి తలభాగమునందు, బ్రహ్మ నాభిభాగమునందు, పరమేశ్వరుడు కాళ్ళ భాగమునందు ఉండి యజ్ణము ప్రారంభించినారు. గయాసురుడు యోగవిధ్యచే శరీరము కదలకుండా చేసుకొని ప్రతిరోజూ కొడికూతను బట్టి ఎన్ని రోజులు అయినది లెక్కించుకో సాగాడు. ఆ రీతిన ఆరు రోజులు గడచిన పిమ్మట ఇంద్రుడు మరలా త్రిమూర్తులను ప్రార్ధించగా శివుడు ఏడవరోజు తెల్లవారుఝామునకాక లింగోద్భవ కాలమున (మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి) కొక్కురుక్కో అని కుక్కుట ధ్వని చేసెను. ఈ మాయ తెలియని గయాసురుడు ఏడు రోజులు పూర్తి అయినవని సంతోషముతో దేహము కదిలించగా యజ్ణము పూర్తికాకుండానే శరీరము కదల్చినావు కావున నిన్ను సంహరిస్తామని త్రిమూర్తులు తెలిపారు. గయాసురుడు దివ్యదృస్టితో ఇంద్రుని మాయోపాయము, త్రిమూర్తులు బ్రాహ్మణ రూపముతో వచ్చుట, తన శరీరమును యజ్ణవేదికగా అడుగుట, శివుడు కోడిరూపములో తనను మోసగించినాడని తెలిసి త్రిమూర్తులచేతిలో మరణించుట ముక్తికరమని తనను వధించమని కోరినాడు. అంతట త్రిమూర్తులు చివరి కోరిక కోరుకొమ్మని అడుగగా గయాసురుడు తాను మరణించినపిమ్మట తన శరీరములోని మూడు భాగములు త్రిగయా క్షేత్రములుగాను మూడు క్షేత్రములలోనూ త్రిమూర్తులు ముగ్గురు నివసించునట్లు మూడు క్షేత్రములు శక్తి పీఠములుగా విరాజిల్లునట్లు, మరణించిన పితరులకు ఈ మూడు క్షేత్రములలో కర్మకాండ పితృకర్మలు చేయుటవలన బ్రహ్మపదము కలుగునట్లు, నామోచ్చారణ పూర్వకముగా పితృ శ్రాద్ధమువలన వార్కి గయాశ్రాద్ధ ఫలితము తద్వారా బ్రహ్మపదము పొందునట్లు వరమును కోరినాడు.
శిరోగయ బీహార్ రాష్ట్రములో విష్ణుపాదములు మరియు మంగళ గౌరి శక్తి పీఠము కల గయనందు, నాభిగయ ఒరిస్సా రాష్ట్రములో యజ్ణవేదికాస్వరూపుడు బ్రహ్మదేవుడు మరియు గిరిజాదేవి శక్తి పీఠముకల జాజిపూర్ నందు, పాదగయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కుక్కుటేశ్వరుడు మరియు పురుహూతికా దేవి శక్తిపీఠము కల పిఠాపురమునందు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ది చెందినవి. పాడగయా క్షేత్రము పితృ ముక్తి కరము. సర్వ పాపహారము. శిరోగయ (భీహార్), నాభిగయ (ఒరిస్సా), పాదగయ (ఆంధ్ర ప్రదేశ్), మాతృగయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మ కపాలం (బదరీనాథ్, ఉత్తరాఖండ్) ఈఅయిదు పితృముక్తికర క్షేత్రములు. ఆలయము ప్రవేశద్వారము చేరినవెంటనే కోనేరు కనిపిస్తుంది. యాత్రికులు ఈకొనేరునందు స్నానముచేసి ఆలయము ప్రవేశిస్తారు. ఈ కోనేటికి కుడిభాగమున కుక్కుటేశ్వరస్వామి ఆలయమున్నది. ఈ కుక్కుటేశ్వరస్వామి ఆలయమునకు ఈశాన్యముగా పురుహూతికా శక్తిపీఠము ఉన్నది. ఈఆలయము దక్షణముఖముగా ఉన్నది. పురుహూతికా దేవి ఆలయము చిన్నది అయిననూ ఆలయముచుట్టూ గోడలపై అష్టాదశ శక్తిపీఠముల మూర్తులు అధ్బుతముగా చెక్కబడినవి. ప్రస్తుతము పురుహూతికా దేవి విగ్రహముఉన్న ప్రదేశములోనే అసలు విగ్రహము పాతిపెట్టబడినది అని తలుస్తారు.
ఈ ఆలయము ఉదయం 5-30 నుండి 12-00 వరకు రాత్రి 9-00 వరకు తెరచి ఉంటుంది. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లులలో పిఠాపురంనందు దిగి దర్శించవచ్చును. లేకున్న సామర్లకోట నందు దిగి రోడ్డు మార్గముద్వారా వెళ్లవచ్చును. సుమారు 10 కి.మీ దూరము. దగ్గరలోని విమానాశ్రయము రాజమహేంద్రవరం. ఇచ్చటినుండి రోడ్డు మార్గముద్వారా వెళ్లవచ్చును. పితాపురమునందు మధ్యతరహా హోటళ్లు భోజన వసతి సదుపాయములకు కలవు. ఆలయము వద్ద పెద్దలకు పిండ ప్రధానమునకు చేయించుటకు పౌరోహితులు లభ్యముగా ఉందురు.
పిండప్రధానం పితృదేవతలకు మోక్షప్రదం