హరిద్వార్

(IPLTOURS)

హరిద్వార్

హిమాలయములందు హరిహర క్షేత్రములకు ప్రవేశద్వారం వంటిది అయిన హరిద్వార్ నందు అనేక ఆలయములు పవిత్ర ప్రదేశములు దర్శించవలసి యున్నది. పరమశివుని మరియు పార్వతి విభిన్నరూపములతో అనేక ఆలయములతో పాటుగా పితృఖర్మలు చేయు నారాయణిశిల పేరుతో మాహావిష్ణువు ఆలయం కలదు. హరిద్వార్ శివకేశవుల ఆలయములు ఒకేచోట కలిగియుండి కేదార్‌నాథ్ , బద్రీనాథ్ పుణ్యక్షేత్రములకు ప్రవేశద్వారం. కావున హరిద్వార్ నందు వివిధ ఆలయ దర్శనమునకు కనీసం రెండు మూడు రోజుల సమయం పట్టును. కావున యాత్రికులు ఋషీకేశ్ నుండి బదరీనాధ్ వరకు చార్ ధామ్ యాత్ర పూర్తి చేసుకొని తిరుగుప్రయాణంలో రుద్రప్రయాగ మీదుగా  హరిద్వార్ చెరి బసచేసి ఆలయసందర్శనం చేయుట ఉత్తమం. హరిద్వార్ నందు 100 గదులతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన ‘భాగీరథి పర్యాటక వసతి గృహం’ ప్రారంభించారు.

Evening-view-Har-ki-Pauri,_Haridwar

హరిద్వార్ నందు టూరిస్ట్ గెస్ట్ హౌస్ మరియు సమాచార కేంద్రం, సి.సి.ఆర్. టవర్ చౌక్, రోడిబేలవాలా నందు కలదు. ఫోన్ నెం. 9411122295. ఈ మెయిల్ ritesh1975semwal@gmail[.com. వెబ్ సైట్  https://uttarakhandtourism.gov.in/accommodation/tourist-guest-house and-information-centre  హరిద్వార్ నందు గౌతమీ నిత్యాన్నదాన ట్రస్టు సత్రమున్నది. ఇచట అద్దెచెల్లింపుపై రూములు మరియు భోజన సదుపాయములు లభించును. దక్షణభారత సాంప్రదాయములో భోజన సదుపాయము లభ్యం. ఇంకను సత్రములు ఉన్ననూ ఉత్తర భారతదేశ భోజన సదుపాయములే ఉండును. గ్రూప్ గా వెళ్ళువారికి అవధూత ధత్తపీఠం ఆశ్రమం ఉన్నది. ఇచట వసతి మరియు భోజనము వండుకొనుటకు కావలసిన పాత్ర సామాను అద్దెపై ఇచ్చేదరు. మన దక్షణ భారత భోజనమునకు ఇబ్బంది పదకుండా యాత్రికులు ఒందుకొని తినవచ్చును. ఈపీఠం గంగానదికి ఆనుకొనిఉన్నది. కావున ప్రాతః కాలమున యాత్రికులు  గంగా స్నానంచేసి ఈపీఠంలోనున్న ఆలయములు దర్శించుకొని మన కార్యక్రమము నిర్వర్తించుకొనవచ్చును.

హరిద్వార్ హిమాలయాలలోని హరిహర క్షేత్రములకు ముఖఃద్వారం. హిమాలయాలలోని పుణ్యక్షేత్రముల దర్శనం హరిద్వార్ నుంచి ప్రారంభం చేయవచ్చు. దేశంలోని అన్ని ప్రధాననగరాల నుండి హరిద్వార్ నకు రైలుసౌకర్యం కలదు. హిమాలయములందుకల  పుణ్య క్షేత్రములు దర్శించ గోరువారికి మేనెల నుండి ఆగస్టువరకు ఆహ్లాదకరముగా ఉంతుంది. యాత్రికులు ఈసమయంలో తేలికపాటి సాదారాణ దుస్తులతో ప్రయాణం చేయ వచ్చును. సెప్టెంబరు నుండి నవంబరు వరకు చలిఉండును కావున ఉన్ని దుస్తులు ధరించవలసి ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్య పట్టణాలలో ఒకటిఅయిన హరిద్వార్ ప్రసిద్ధ శైవక్షేత్రము. హరిద్వార్ నందు కనీసం 3రోజులు బసచేసినట్లయిన హరిద్వార్ నందు ఆలయాలు దర్శించుకోవడానికి వీలవుతుంది. మానవ వంశములో మరణించింవవారికి ఆప్రదేశంలో పిండప్రధానం చేసిన, వారికి మోక్షం లభిస్తుందని కధనం. 

హరిద్వార్ లో ముఖ్యముగా చూడతగిన ఆలయాలు మరియు స్థానిక పురాణకధలు దిగువ విరిస్తున్నాము

హర్ కి పౌరి

హర్ కీ పౌరి హరిద్వార్‌లో గంగానది ఒడ్డునఉన్న ప్రసిద్ధఘాట్. ఈపవిత్రమైన ప్రదేశం హరిద్వార్ నగరంలో ముఖ్యమైనప్రదేశం. “హర్” అంటే “దేవుడు”, “కి” అంటే “‘నకు” మరియు “పౌరీ” అంటే “మెట్లు”  హర్ కీ పౌరి అనగా దైవమును చేరుటకు మెట్టు అని అర్ధం 

విష్ణువు వేదకాలంలో హర్ కీ పౌరిలోని బ్రహ్మకుండ్‌ని సందర్శించాడని నమ్ముతారు. గంగానది హిమాలయ పర్వతాలను వదిలి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం హరిద్వార్. ఘాట్ గంగానది పశ్చిమ తీరంలోఉంది. ఇచ్చటినుండి గంగానది ఉత్తరంవైపుకు తిరిగి ప్రవహిస్తుంది. హర్ కీ పౌరి హరిద్వార్ నందు పన్నెండేళ్లకు ఒకసారిజరిగే కుంభమేళా, ఆరు సం.లకు జరిగే అర్ధకుంభమేళా, పంజాబీ పండుగ వైశాఖి మరియు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలోజరిగే పంటపండుగ సమయంలో లక్షలాది మంది యాత్రికులు తరలి వచ్చి ఉత్సవాలు నిర్వహించుప్రాంతం. 

ప్రతిరోజూ సూర్యాస్తమ సమయంలో, హర్ కి పౌరి పూజారులు వారణాశి లేదా కాశీలోవలెనే పురాతన సంప్రదాయం ప్రకారం దిగువకు వెళ్లడానికి నీటిపై లైట్లు అమర్చి గంగాహారతి ఇస్తారు. గంగానదికి రెండువైఫులా వేలాదిమంది భక్తులు మరియు స్థానిక ప్రజలు గుమిగూడి గంగాహారతి సమయంలో గంగను స్తుతించుతారు. ఆసమయంలో పూజారులు తమచేతుల్లో పెద్ద హారతిదివ్వెలు పట్టుకుని, ఘాట్ వద్దఉన్న దేవాలయాలవద్ద గంటలు మోగిస్తూ పూజారులు ఆలపించు కీర్తనలు భక్తులుకూడా ఆలపిస్తారు. భక్తులు మరియు ప్రజలు వారిఆశలు మరియు కోరికలకు గుర్తుగా ఆకులు మరియు పువ్వులతో చేసిన మాలలను గంగానదికి సమర్పిస్తారు. కొన్నిప్రత్యేక సందర్భాలలో, గ్రహణాలు సంభవించినప్పుడు, గంగా హారతి సమయం ఆనుగుణంగా మార్చబడుతుంది.

మానసా దేవి ఆలయం

పవిత్ర నగరమైన హరిద్వార్‌లో హిమాలయ పర్వతశ్రేణి శివాలిక్ కొండలపై బిల్వపర్వతం పైన మానసదేవి ఆలయముంది. బిల్వతీర్థంఅని పిలువబడే ఈఆలయం హరిద్వార్‌లోని పంచతీర్థాలలో ఒకటి. ఈఆలయం శివుని మనస్సునుండి ఉద్భవించిందని చెప్పబడు శక్తిరూపమైన మానసాదేవి పవిత్రనివాసంగా ప్రసిద్ధిచెందింది. మానస నాగదేవత వాసుకి సోదరిగా పరిగణించబడుతున్నది. ఆమె మానవరూపంలో శివుని కుమార్తె అని మానస అనేపదానికి కోరికఅని అర్ధమని దేవి భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తుందని నమ్ముతారు. జానపద కథనం ప్రకారం మానసఅను ఒకబాలిక తనగురించి వివరం సంరక్షకులనుండి పొందలేక శివుడిని కలవాలని తనజన్మ గురించి అడగాలని నిర్ణయించుకుంది. ఆమె సంవత్సరాల తరబడి ఆధ్యాత్మికసాధన చేసి, శివుడిని దర్శించి వారినుండి తనగురించి జీవితసత్యం తెలుసుకొనే అదృష్టంపొందింది. ఆమె తనగురించి సత్యం తెలుసుకున్న పిమ్మట, లోకకల్యాణం చేయు శక్తులను పొందింది.

తమకోరికలు నెరవేరాలని దేవిని ప్రార్థించే భక్తులు ఆలయంలో ఉన్న చెట్టుకొమ్మలకు దారాలు కడతారు. వారికోరికలు నెరవేరిన పిమ్మట, భక్తులు చెట్టునుండి దారాన్ని విప్పడానికి మరల ఆలయానికి వస్తారు. మానసాదేవిని ప్రార్ధించి కొబ్బరికాయలు, పండ్లు, దండలు మరియు అగరబత్తులను సమర్పిస్తారు.

పార్వతీదేవి రెండురూపాలు మానసాదేవి మరియు చండీ ఎల్లప్పుడూ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెబుతారు. మానసదేవి ఆలయం పూజించేవారి కోరికలను తీర్చు ఒకసిద్ధపీఠం అంటారు. హరిద్వార్‌లోఉన్న మూడుపీఠాలలో ఇదిఒకటి, మిగిలిన రెండు చండీ దేవిఆలయం మరియు మాయాదేవి ఆలయం. లోపలిమందిరంలో ఇద్దరుదేవతలు లందు ఒకరు ఎనిమిదిచేతులు మరియు మరొకరు మూడుతలలు మరియు ఐదుచేతులతో దర్శనమిస్తారు. హరిద్వార్ వెళ్ళేయాత్రికులు మానసాదేవి ఆలయం తప్పక సందర్శించ వలసిన ఆలయంగా పరిగణిస్తారు. ఆలయంనుండి గంగానది మరియు హరిద్వార్ నందు అందమైన ప్రదేశాలను చూడవచ్చును. ఆలయం చేరడానికి ట్రెక్కింగ్ లేదా రోప్-వే సేవలో ప్రయాణించాలి. యాత్రికుల ప్రయోజనం కోసం రోప్-వే సర్వీస్ ప్రారంభించబడి మానసాదేవి మరియు చండీదేవి ఆలయాలకు యాత్రికులను చేర్చడానికికూడా ఉపయోగించబడుతున్నది. రోప్-వే యాత్రికులను దిగువ నుండి నేరుగా మానసదేవి మరియు చండీదేవి ఆలయాలకు తీసుకువెళుతుంది.

అన్నిరోజుల్లో ఆలయం ఉ 5 నుండి రాత్రి 9 గంటల వరకు మ 12 నుండి 2 గంటల వరకు భోజనసమయం మినహా తెరిచి ఉంటుంది.

చండీదేవి ఆలయం 

చండీదేవి ఆలయం హిమాలయ పర్వతశ్రేణినందు శివాలిక్ కొండల తూర్పుశిఖరంపై నీల్ పర్వతంపైన ఉంది. ఆలయం సుచత్ సింగ్ అను కాశ్మీర్ రాజుపాలనలో నిర్మించారు. ఆలయంలోని చండీదేవి విగ్రహం పద్నాలుగు వందల సం.లకు పూర్వం జగద్గురు ఆదిశంకరాచార్య భారతదేశ పర్యటనయందు ప్రతిష్టించారని చెబుతారు. నీల్ పర్వతతీర్థం అనిపిలువబడు ఈఆలయం హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటి. సిద్ధపీఠంగా చండీదేవి ఆలయం కోరికలు నెరవేర్చు పవిత్రప్రదేశంగా భక్తులచే భావించ బడుతున్నది. హరిద్వార్‌లోఉన్న మూడు పీఠాలలో ఒకటి, మిగిలినరెండు మానసదేవి మరియు మాయాదేవి ఆలయాలు. చండిక అనిపిలువబడే చండీదేవి ఆలయ ప్రధానదేవత. చండికాదేవి ఆవిర్భావ కథప్రకారం రాక్షసరాజులు శుంభ మరియు నిశుంభలు ఇంద్రునినుండి స్వర్గాన్ని స్వాధీనం చేసుకొని దేవతలను స్వర్గంనుండి వెడలకొట్టారు.

దేవతల ప్రార్థనలపై పార్వతినుండి ఒకఅంశ చండికగా ఉద్భవించింది. అసాధారణమైన ఆమెఅందానికి ముగ్ధుడైన శుంభుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె నిరాకరించడంతో, శుంభుడు ఆమెను చంపడానికి రాక్షస నాయకులు చండ మరియు ముండలను పంపాడు. చండిక కోపంతో ఉద్భవించిన చాముండాదేవి వారిని సంహరించింది. శుంభ మరియు నిశుంభులు సమిష్టిగా చండికను చంపడానికి ప్రయత్నించి ఆమెచేత సంహరించబడ్డారు. పిమ్మట చండిక నీల్ పర్వతం పైభాగంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్లు ఆప్రదేశంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికకధనం. పర్వతశ్రేణిలోఉన్న రెండుశిఖరాలు శుంభ మరియు నిశుంభ అనుపేర్లతో పిలుస్తారు. ఆలయం ఉ 7-00 నుండి సా7-00 వరకు సోమవారం నుండి శుక్రవారం వరకు శని మరియు ఆదివారం ఉ 6-00 నుండి సా 7-00 వరకు తెరచి ఉంటుంది.

మాయాదేవి ఆలయం  

మాయాదేవి పేరుతో హరిద్వార్ ను మాయాపూరి అని కూడా పిలుస్తారు. హరిద్వార్ నకు మాయాదేవి గ్రామదేవత. హరిద్వార్ పట్టణం మధ్య మాయాదేవి ఆలయం ఉన్నప్రాంతంలో దక్షయజ్ఞమునందు ఆత్మాహుతి చేసుకొన్న సతీదేవిశరీరం మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు సతీదేవి గుండె మరియు నాభిపడ్డాయని ఈప్రదేశం శక్తిపీఠములలో ఒకటిగా భావిస్తారు. అష్టాధశ శక్తిపీఠములందు ఈఆలయం శక్తిపీఠంగా పేర్కొనబడలేదు. ఆమె మూడుతలలు మరియు నాలుగుచేతులతో, శక్తియొక్క అవతారంగా భావిస్తారు. సిద్ధపీఠం అయిన ఈఆలయం హరిద్వార్‌లోఉన్న మూడు పీఠములలోఒకటి మిగిలినరెండు చండీదేవి మరియు మానసాదేవి ఆలయాలు. సుమారు వేయి సంవత్సరముల పైబడి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న హరిద్వార్‌లోని మూడు పురాతన దేవాలయాలు నారాయణ-శిల మరియు భైరవ దేవాలయముతో పాటుగా మాయాదేవి ఆలయం ఒకటి. 

గర్భాలయంనందు మధ్యలో మాయాదేవి, ఎడమవైపు కాళీ, కుడివైపున కామాఖ్య దేవతల విగ్రహాలు ఉంటాయి. లోపలిమందిరంలో ఈఇద్దరు శక్తిస్వరూప దేవతలు దర్శనమిస్తారు. హర్ కి పౌరీకి తూర్పువైపున ఉన్న మాయాదేవిఆలయం బస్సులు మరియు ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హరిద్వార్‌లో నవరాత్రులు మరియు కుంభమేళా సమయంలో దేశంలోని వివిధప్రాంతాలనుండి భక్తులు ఈఆలయాన్ని సందర్శిస్తారు.

దక్షేశ్వర్ మహదేవ్ ఆలయం   

దక్షమహదేవ్ ఆలయం అని పిలువబడు దక్షేశ్వర్ మహదేవ్ ఆలయం హరిద్వార్ నకు 4 కి.మీ దూరంలో కరిఖల్ అను చిన్నబస్తీ నందున్నది. ఈఆలయం సతీదేవి తండ్రి దక్షప్రజాపతి పేరుతో పిలువబడుచున్నది. దక్షుడు సృష్టికర్తలు మరియు బ్రహ్మదేవుని కుమారులుగా పరిగణించబడు పద్నాలుగుమంది ప్రజాపతులలో దక్షుడు ఒకడు. ఆలయం సుమారు రెండువందల సం.లకు పూర్వం నిర్మించబడి దర్మిలా అరవై సం.లకు పూర్వం పునర్నిర్మించబడింది. మహాశివరాత్రినాడు శివభక్తులు అధికంగా దర్శించు పుణ్యక్షేత్రం.

వాయుపురాణం, మహాభారతం మరియు ఇతరగ్రంథాలలో పేర్కొన్నట్లు, శివుని ప్రధమభార్య సతీదేవితండ్రి దక్షప్రజాపతి ఆలయంఉన్న ప్రదేశంలో నిరీశ్వరయాగం చేశాడు. దక్షుడు శివుడిని యాగమునకు పిలవకపోవడంతో సతీదేవి అవమానంగా భావించిననూ, ఆమె యజ్ఞానికి హాజరైంది.

తనతండ్రి శివుడిని తృణీకరించాడని ఆమె తనను తాను యజ్ఞకుండంలో అగ్నిప్రవేశం చేసింది. శివుడు కోపించి, వీరభద్రుడు, భద్రకాళిని మరియు ఇతరగణాలను, యజ్ఞశాలకు పంపాడు. శివునిఆజ్ఞతో  వీరభద్రుడు శివగణాలతో దక్షుని యజ్ఞశాలలోతుఫానులా కనిపించి అక్కడఉన్న దేవతలతో భీకరయుద్ధం చేసి దక్షునికి శిరచ్ఛేదం చేశాడు. పిమ్మట బ్రహ్మ మరియు ఇతర దేవతల కోరికమేరకు మేకతల దక్షునికి ఈయబడింది. ఈప్రదేశమునకు అంతటి పవిత్రత ఉన్నది.

నీలేశ్వర ఆలయం

నీలేశ్వర్ ఆలయం హరిద్వార్‌లో హర్ కీ పౌరికి 500 మీటర్ల దూరంలోఉంది. నీలేశ్వర్ ఆలయం హరిద్వార్‌లో చిన్న పురాతనమైన ఆలయం. ఆలయం కుశావర్త ఘాట్ సమీపంలో నెల్ పర్వతంఅను కొండపై ఉన్నది. ఆలయసమీపంలో మూల ప్రవాహం ప్రవహించు నీల్ధారఅను గంగా ప్రవాహంలో స్నానంచేసి భక్తులు ఆలయం సందర్శిస్తారు. నీల్ అనుగొప్ప శివభక్తుని పేరునకల ఆలయంలో శివలింగం ఆభక్తుడే స్థాపించాడు. ఈఆలయం ప్రకృతిఅందంతో అద్భుతమైన ఆనందాన్ని శాంతిని ఇస్తుంది. నీల్ పర్వతంపై ఆలయం వెనుక సుందరమైన దృశ్యాలను నీల్ పర్వతం పైభాగంలోఉన్న చండీదేవి ఆలయాన్నికూడా చూడవచ్చు. ఆలయంపైన చుట్టూ సర్పాలతో చుట్టుముట్టబడిన ఒకకలశం ఉంది, పరమశివునికి ప్రీతికరమైన శ్రావణమాసంలో శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో శుభ్రమైన గోశాలనందు గోవులన్నింటినీ ఆలయ సిబ్బంది సంరక్షిస్థారు. 

నారాయణిశిల మందిరం 

నారాయణిశిల ఆలయం హరిద్వార్‌ నందు గంగానది ఒడ్డునఉన్న పవిత్ర మైనమందిరం. మాయాపూరి అనబడు హరిద్వార్ నందు అగ్నిమాపక కేంద్రం ఎదురుగాఉన్న భగవాన్ విష్ణుమూర్తి ఆలయంఅనబడు నారాయణిశిలా ఆలయం ఉన్నది. నారాయణిశిలా ఆలయంలో పితృ దోషంతో బాధపడువారు మరియు ఇతరయాత్రికులు తల్లిదండ్రులు మరియు బంధువులకు పిండప్రదానం చేస్తారు. చనిపోయిన తల్లితండ్రులకు మరియు బంధువులకు ఇక్కడ పిండప్రధానంచేసిన వారు మోక్షం పొందుతారని స్థానికకధనం. పితృ మోక్షమునకు అన్నిరకాల జపములు మరియు శ్రాద్ధకర్మలు ఇక్కడ నిర్వహిస్తారు. ఆలయంలో మహావిష్ణువు రూపంతో అర్ధశిలా మూర్తి వెలుపల ఒకమూర్తి ఉన్నాయి. స్కందపురాణంలో విష్ణువు గయాసురుడిని ఓడించినప్పుడు, అతను మూడు భాగాలుగా విడిపోయి మధ్యభాగం హరిద్వార్‌లో పడిందని చెప్పబడింది.

విష్ణువు గయాసురుడిని కరుణించి, అతనిశరీరం పడిన ప్రదేశం పవిత్రంగా మారుతుందని మరియు మానవులు వంశములో మరణించింవవారికి ఆప్రదేశంలో పిండప్రధానం చేసిన, వారికి మోక్షం లభిస్తుందని  వరం ఇచ్చాడు.

ఆనందభైరవుని ఆలయం 

ఆనందభైరవుడు శివునియొక్క ప్రశాంతమైన రూపం. ఈమందిరం హరిద్వార్‌లోని మాయాదేవి ఆలయానికి సమీపంలో ఉంది. మందిరంలోని ఆనందభైరవుడి విగ్రహం ప్రత్యేకమైనది మరియు పవిత్రమై మీసాలు, ముక్కు మరియు కళ్లతో శివలింగం రూపంలో ఉంటుంది. గర్భగుడిలోని ఆనందభైరవ విగ్రహానికి సమీపంలో ఎరుపురంగు కనపడుతుంది. ఈచిన్న పురాతనఆలయం ఇటీవలనే పునరుద్ధరించబడింది. ఆలయంలో ఆరాధించే ఉప దేవతలు దత్తాత్రేయ, శివుడు, పార్వతి, గణేశుడు, మరియు కాళికాదేవిలతో పాటు ప్రత్యేకమైన నవగ్రహ దేవాలయం ఉంది. 

వ్యాస ఆశ్రమం

 హరిద్వార్ నందు అందమైన తోటలు మరియు చెట్లుమధ్య ప్రశాంత వాతావరణంలో వ్యాస ఆశ్రమం ఉన్నది. గంగానది ఒడ్డున సుమారు నలభై సంవత్సరముల క్రిందట కాశీమఠం అధిపతి శ్రీ సుధీంద్రతీర్థ స్వామీజీవారిచే నిర్మించబడి ప్రస్తుతం కోంకణ్ ప్రాంతములోని గౌడ సరస్వత్ బ్రాహ్మణులందు మధ్వశాఖ వారిచే నిర్వహించబడుచున్న వ్యాసఆశ్రమ ప్రాంగణంనందు మహర్షి వేదవ్యాసుడు, శుకడు, సప్తఋషుల పెద్దవిగ్రహాలతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తులు దర్శనం ఇస్తాయి. ప్రాంగణంలో నవగ్రహామందిరం ఉంది. ఆశ్రమంచుట్టూ అనేక ఆలయాలు మరియు ఆశ్రమాలు ఉన్నాయి. వ్యాసదేవాలయం మనోహరమైన ప్రార్థనాస్థలం. ఆలయభవనం అష్టభుజిఆకారంలో ఉండి, ఆలయగోపురం దక్షిణభారత నిర్మాణశైలిలో ఉంటుంది. ఆలయమందు వేదవ్యాసుడు, రాముడు, మరియు శ్రీవ్యాస రఘుపతి నరసింహ అనుపేరుతో విష్ణువు అవతారమైన నరసింహునకు రోజుకు మూడుసార్లు అర్చనలు జరుగుతాయి.

ప్రతిరోజూ సాయంత్రం గంగాహారతి జరుపబడుతుంది. అర్చనలకు కావాల్సిన పూలు, పండ్లు ఆశ్రమంలోనే పండిస్తారు. ఆశ్రమతోటలో రుద్రాక్షచెట్టు ఉంది. ఉ 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయముల దర్శనానికి అనుమతిస్తారు. ఆశ్రమంలో నామమాత్రపు చార్జీతో భోజన సదుపాయం మరియు వసతి సౌకర్యం ఉన్నది. హరిద్వార్ లో పై ఆలయాలే కాకుండా ఇంకా పురాతన ఆలయాలు నూతనంగా నిర్మించబడిన ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి భరతమాత మందిరం, భిల్వకేశ్వర్ ఆలయం, గౌరి శంకర్ ఆలయం, జైన్ ఆలయం, మహామృత్యుంజయ ఆలయం, పవన్ ధామ్, సతీ కుండ్, శ్రీ యంత్రాలయం. ఈ ఆలయాలు దర్శించాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది.

హరిద్వార్ లో పై ఆలయాలే కాకుండా ఇంకా పురాతన ఆలయాలు నూతనంగా నిర్మించబడిన ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి భరతమాత మందిరం, గౌరి శంకర్ ఆలయం, జైన్ ఆలయం, మహామృత్యుంజయ ఆలయం, పవన్ ధామ్, సతీ కుండ్, శ్రీ యంత్రాలయం. ఈ ఆలయాలు దర్శించాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది.