గణపతిపూలే స్వయంభు గణేష్ ఆలయం

(IPLTOURS)

మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో రత్నగిరి జిల్లాలో గణపతిపూలే పట్టణంనుండి ఒక కి.మీ దూరంలో అరేబియా సముద్రతీరంలో ఉన్న స్వయంభూ గణపతిఆలయం మరియు పర్యాటకప్రదేశం. రత్నగిరినుండి ఉత్తరంగా25 కి.మీ దూరంలో సహ్యాద్రికొండల మధ్యలో చుట్టూ మామిడి, జీడిమామిడిచెట్లతో గణపతిపూలే చిన్నపట్టణమైనా మనోహరంగా ఉంటుంది. గణపతిదేవాలయం మహారాష్ట్రనందు ప్రధాన యాత్రాస్థలం మరియు చరిత్రకలిగిన ఆలయం. రైల్వేస్టేషన్ లేనందున గణపతిపూలే చేరడానికి రోడ్డుమార్గం మాత్రమేఉంది. గణపతి పూలేకి సమీప రైల్వేస్టేషన్ రత్నగిరి. గణపతిపూలేలో గణపతి ఆలయం 400 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడి 1600 సంవత్సరములకు పూర్వం స్వయంభూఃగా ప్రకటితమైన గణపతి విగ్రహం ప్రతిష్టించబడినది.

మరాఠీబాషనందు ఫూలే ఆనగా తెల్లని ఇసుకఅని అర్ధం. గణేశుడు ఇసుకనందు గణపతి స్వయంభూఃగా ప్రకటితమగుటవల్ల ఈప్రదేశం గణపతిపూలేఅని పిలువ బడుతున్నది.

Ganpatipule Ganesh Temple View-Ratnagiri

గణపతిపూలే చిన్నపట్టణం అయిననూ సమీపంలో పర్యాటకులను ఆకర్షించు మనోహరమై ఆహ్లాదం కలిగించు సముద్రతీరం ఉన్నది. వేలాదిమంది భక్తులు స్వయంభూః గణేశుని దర్శించడానికి సమీపంలోని సముద్రతీరంలో సంతోషంగా గడపటానికి గణపతిపూలే వస్తారు. ఈప్రదేశం కొబ్బరి, తాడిచెట్లు మరియు మడఅడవులతో పచ్చదనంతో మనోహరంగా ఉంటుంది. గణపతిపూలే నందు గణేశుడు కొంతకాలం నివసించాడని స్థానిక కధనం. 400 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన గణపతిపూలేలో ఆలయంలో 1600 సంవత్సరములకు పూర్వం స్వయంభూఃగా ప్రకటితమైన గణపతి విగ్రహంఉంది. అన్నిచోట్ల విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటాయి కానీ ఇక్కడ గణపతివిగ్రహం పశ్చిమాభి ముఖంగా ఉండడం విశేషం. స్వయంగా ఇసుకనందు ఉద్భవించిన సింహంపై స్వారీచేస్తు రాగితో చేయబబడిన గణపతి విగ్రహం ఇతర విగ్రహాలతోపాటు  ఆలయంలో ప్రతిష్టించారని కధనం. రాగితో చేయబడిం గణపతి వాహనమైన మూషికవిగ్రహం ఆలయం వెలుపల కనపడుతుంది. 

పురాణాల ప్రకారం భస్మాసురుడు శివుని ఆరాధకుడు. అసురుల గురువు శుక్రాచార్యుడు ఆజ్ఞప్రకారం భస్మాసురుడు శివునికై తపస్సు చేసి పక్షులు, జంతువులు, మానవులు, జీవులు, రాక్షసులు, దయ్యాలు మొదలైనవి అతని అధికారానికి లోబడి ఉండాలని, తాను ఎవరితలపై చేయిపెడితే ఆజీవి భస్మం అయిపోయెట్లు వరం పొందాడు. శివుడు ఇచ్చినవరం భస్మాసురుడిని అహంకారిని చేసింది. అతని భయంకరమైన చర్యలకు దేవతలు, మానవులు భయపడి అతని అంతంకోసం శివుని ప్రార్థించారు. భస్మాసురుడు మూడు లోకాలను జయించాలనే కోరికతో కైలాసంవెళ్ళి అక్కడ శివపార్వతులను చూశాడు. శివుడు అందమైన పార్వతికి తగినవాడు కాదని అతని మనస్సులో ఆలోచన వచ్చింది. అతడు ఆమెను మోహించి వశపరచుకొనుటకు ప్రయత్నించాడు. శివునితో పార్వతి ఆయనకు సరిపోదని, ఆమెను తనకు అప్పగించాలని తెలిపాడు. భస్మాసురుడు శివుడు పార్వతిని అప్పగించడానికి సంకోచిస్తే శివునితలపై తనచేతులు వేసి బూడిద చేస్తానని చెప్పాడు.

భస్మాసురుడు పార్వతివైపు అడుగువేసిన వెంటనే ఆమె మాయమైపోయినది. పార్వతి మాయమగుటవలన భస్మాసురుడు శివుని పట్టుకొనుటకు ప్రయత్నించాడు.శివుడు రక్షణకోసం విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠం వెళ్ళాడు. శివుడు విష్ణువుకు జరిగిన విషయాలను తెలియజేసి తనను భస్మాసురునినుండి రక్షింపమని కోరాడు. విష్ణువు శివునితో భస్మాసురునికి ప్రసాదించిన వరంవల్ల అతనితో యుద్ధం చేయలేనని చెప్పాడు. శివకేశవులు బయటపడేమార్గం గురించి ఆలోచించి, గణేశుడితో వారిని సురక్షితంగా నడిపించాలని ప్రార్థించారు. గణేశుడు విష్ణువుహృదయంలో ప్రవేశించి, భస్మాసురునికి స్త్రీలపట్ల వ్యామోహం కలదని, అందువలన ఆతని జీవితాన్ని ఆకారణంతో ముగించవచ్చని సూచించాడు. సూచన అర్థంచేసుకున్న విష్ణువు భస్మాసురుని నాశనం చేస్తానని చెప్పాడు.

భస్మాసురుడు శివునికోసం వెతకసాగాడు. విష్ణు పార్వతికంటే అందమైన మోహినిరూపు ధరించి భస్మాసురుని ముందు కనిపించాడు. భస్మాసురుడు ఆమెఅందానికి ఆశ్చర్యపడ్డాడు. అందంగాఉన్న ఆమెను వివాహం చేసుకోవాలని తలచి ఆమెవైపు సాగాడు. ఆమె తననృత్యాన్ని అనుకరిస్తూ నృత్యంచేసే వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అర్హుడని షరతు విధించింది. భస్మాసురుడు షరతును పాటించగలనని విశ్వాసంతో చెప్పాడు. మోహినిరూపంలోని విష్ణువుతో భస్మాసురుడు నృత్యంలో పాలుపంచుకొని నాట్యం చేస్తున్నప్పుడు విష్ణువు అందమైన స్త్రీవేషంలో తనఅరచేతులను తలపై పెట్టుకున్నాడు, ఆముద్ర భస్మాసురుడు తక్షణమే అనుకరించడంతో శివుడుఇచ్చిన వరం కార్యరూపం దాల్చి భస్మాసురుడు బూడిదగా మారాడు. శివుడు విష్ణువును జగత్తు సంరక్షకుడని పొగిడినప్పుడు విష్ణువు నిజమైన సంరక్షకుడు ఓంకార స్వరూపుడు, అడ్డంకులను నిరోధించ గలవాడు, లంబోదరుడైన గణేశుడని, గణేశుడు తనమనస్సులో ప్రవేశించి ఉపాయము తెలియచేసినందున కార్యం సఫలమైనదని తెలిపాడు.  

ఆలయానికి సంబంధించిన పురాణంప్రకారం 1600 సం.లకు పూర్వం ప్రస్తుతం ఆలయం ఉన్నప్రాంతంలో బాల్భట్జీ భిడే అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. భిడే ఒకసమస్యను ఎదుర్కొన వలసివచ్చిసమస్యనుండి విముక్తి పొందెందుకు ఉపవాసం ఉండటానికి నిశ్చయించు కొన్నాడు. భిడే అడవినందు గణేశునిగురించి తపస్సుచేసాడు. భిడేకి గణేశుడు కలలోకనిపించి తాను తన భక్తుల కోరికలను తీర్చడానికి గులేవచ్చాననీ, కొండ తనప్రతిరూపమని తనను పూజించినట్లయిన కష్టాలన్నీ తొలగిపోతాయి అని తెలిపాడు. భిడేఆవులందు ఒకఆవు పాలుఇవ్వడం మానేసింది. పశువులకాపరి ఆవుపై నిఘాఉంచి, ప్రస్తుతం గణేశుని విగ్రహంఉన్న ప్రదేశంలో పొదుగునుంచి పాలుకారడం చూసి ఆశ్చర్యపోయాడు. పశువులకాపరి భిడకి జరిగిన సంఘటన చెప్పాడు. భిడే ఆప్రదేశం శుభ్రంచేస్తూ గణేశుని విగ్రహంచూసి మందిరాన్నినిర్మించి పూజలు చేయడం ప్రారంభించాడు. గణపతిపూలే నందు ‘పూలే’ అంటే ఇసుకతిన్నెలు. గణేశుడు ఇసుక తిన్నెలనుండి ఉద్భవించినందున ఈ ప్రదేశానికి గణపతిపూలే అనేపేరు వాడుకలోనికి వచ్చింది.

మాఘశుద్ధ చతుర్థి, గణేష్ చతుర్థి, దీపావళి మొదలైనవి ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు. ఈఆలయం కొండదిగువన ఉంది. యాత్రికులు గణేష్ ఆకారంలోఉన్న కొండచుట్టూ భక్తిపూర్వకంగా ప్రదక్షిణచేస్తూ  తిరుగుతారు. ఆలయం ఉదయం 5-00 నుండి రాత్రి 9-00వరకు తెరచిఉంటుంది. భోజనమునకు రిసార్టు ఉన్నది. అక్టోబరునుండి మార్చివరకు క్షేత్రం వెళ్లడానికి అనువుగాఉంటుంది.

ఓం గం గణపతయే నమః