ఆదిశయ వినాయగర్ ఆలయం

(IPLTOURS)

ప్రధమపూజ్యుడైన వినాయకుని ఆలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. విభిన్నరూపాలతో గణేశుని భక్తిప్రపత్తులతో పూజిస్తారు. స్వయంభూః లేదా స్వయంగావెలసిన మరియు అద్భుతమహిమలతో ఆకర్షణీయ లక్షణాలతో విబిన్న గణేష్ ఆలయాలు భారతదేశంలో అన్నీరాష్ట్రాలలో వ్యాపించి ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో ఉన్న ఆదిశయ వినాయగర్ దేవాలయం గణేశుడి అద్భుత లక్షణాలతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. ఈఆలయం చాలా విశిష్టమైనది మరియు కుటుంబం మరియు స్నేహితులతో సందర్శించదగినది. ఆలయసముదాయంలో శివుడు మరియు గణేష్ దేవాలయాలు ఉన్నాయి. శివునికి సంబంధించి ఆలయం అయిననూ గణేష్ దేవాలయంగా చాలా ప్రసిద్ధిచెందింది. ఏదైవమునైనా అర్చించుటకు ముందు పూజించవలసిన ప్రధానదైవం వినాయకుడు. గణేశుని తల్లిదండ్రులు శివుడు మరియు పార్వతీదేవి ప్రసాదించినవరం ప్రకారం ప్రధమపూజ గణేశునికి చేయుట యుగాలనుండి అనుసరిస్తున్న ఆచారం. ఆలయంలో శివుడు మరియు గణేష్ విగ్రహాలు చాలా పురాతనమైనవి, అయితే ఈ ఆలయం తొమ్మిదివందల సంవత్సరాల క్రితం నాటిదిగా కనపడుతుంది. ఆలయంలోని గణేశునివిగ్రహం రెండువేల ఐదువందల సంవత్సరాల నాటిదని నమ్ముతారు.

Keralapuram Adhisaya Vinayakar Temple

ఆదిశయ వినాయగర్ ఆలయాన్ని సాధారణంగా అద్భుత గణేశఆలయం అనిపిలుస్తారు. ఆలయంలోని గణేష్ విగ్రహం ప్రతి ఆరు నెలలకోసారి నలుపునుండి తెలుపు మరియు తెలుపునుండి నలుపు రంగులోకి మారే అద్భుతం కలిగిఉంది. విగ్రహం మార్చి నుండి జూన్ వరకు ‘ఉత్తరాయణం’లో నలుపు రంగులో మరియు జూలై నుండి ఫిబ్రవరి వరకు “దక్షణాయణం”నందు  తెల్లగా కనిపిస్తుంది.

ఇంతటి విశిష్టత కలిగిన దేవాలయం మరొకటి లేదు. ఆంద్రప్రదేశ్‌లోని పాలకొల్లునందు అటువంటి శివాలయం ఉంది. ఇక్కడ శివలింగం అమావాశ్యనుండి పౌర్ణమి వచ్చుసరికి నలుపు తెలుపుగా మరియు పౌర్ణమినుండి అమావాశ్య వచ్చుసరికి తెలుపు నుండి నలుపు రంగులోకి మారుతుంది.

ఈఆలయం మరియు గణేష్ విగ్రహంపై ఒక పురాణకధ ఉన్నది. కేరళపురం రాజు 7వ జ్యోతిర్లింగమైన రామేశ్వరం దర్శనానికి  వెళ్ళాడు. రాజు కాళ్లు చేతులు కడుక్కుంటూఉండగా నదిలో గణేష్ విగ్రహం కనిపించింది. రాజు ఆవిగ్రహాన్ని రామేశ్వరంరాజు సేతు మన్నన్‌కి బహూకరించాడు. ఆఅందమైన బహుమతిని చూసి సేతు మన్నన్‌ సంతోషించాడు. అతను గణేష్ విగ్రహంలో అద్భుతాన్ని కనుగొని విగ్రహం తనకు దొరికినందున ఆవిగ్రహాన్ని తనవద్ద ఉంచుకోమని కేరళపురం రాజును అభ్యర్థించాడు. సేతు మన్నన్‌ మరకతం పొదిగిన పెద్ద గణేష్వి గ్రహాన్నికూడా  కేరళపురం రాజుకు బహుకరించాడు. రాజు విగ్రహాలతో తన స్థలమైన కేరళపురం బయలుదేరాడు. దారిలో రాజుపై దోపిడీ దొంగలు దాడిచేసి మరకతం పొదిగిన విగ్రహాన్ని అపహరించారు. నదిలో రాజుకుదొరికిన గణేష్వి గ్రహాన్ని తరలించడంలో దోపిడీదొంగలు విఫలమయ్యారు. దోపిడీ దొంగలు విగ్రహాన్ని అక్కడేవదిలేసి పారిపోగా భక్తులచే ఆగణేశుడు పూజలందుకుంటుంన్నాడు.

ఆలయంలోఉన్న గణేశుడిని సర్వ దుష్టనాశకునిగా భావిస్తారు. ప్రజలు స్వామికి పూజలుచేసి కొబ్బరికాయలు మరియు బియ్యం కుడుములు సమర్పిస్తారు. ముఖ్యంగా విగ్రహం రంగుమారు సమయంలో గణేశుని ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది. మరియు ఈ సమయంలో భక్తులందరి కోరికలు స్వామి తీరుస్తాడని నమ్ముతారు గణేష్ విగ్రహం చెక్కుచెదరకుండా ఉంది మరియు దాని అసలు స్థానం నుండి తరలించలేరు.

ఆలయ సముదాయంలోపల ఒక కోనేరుఉంది. .బావి (కోనేరు)లోని నీరుకూడా చాలా పవిత్రమైనది మరియు అనేక చర్మవ్యాధులను నయంచేస్తుంది. గణేష్వి గ్రహం రంగును బట్టి ట్యాంక్‌లోని నీళ్లు కూడా దాని రంగును మారుస్తాయి. ట్యాంక్ ‘ఉత్తరాయణ’లో తెల్లగా కనిపిస్తుంది, అంటే మార్చినుండి జూన్ వరకు మరియు నలుపు రంగులో “దక్షణాయణం” అంటే జూలై నుండి ఫిబ్రవరి వరకు కనిపిస్తుంది. దేవాలయం చుట్టూ ప్రకృతిఅందాలతో రమణీయంగా ఉంటుంది. ప్రాంగణంలో ఒక పెద్దచెట్టు మరియు గ్రానైట్ రాయితో చెక్కబడిన పెద్ద పాముఉన్నాయి. శివుడు ఒకపెద్ద మర్రిచెట్టు కింద దర్శనమిస్తాడు.

గణేష్ చతుర్థి చాలా భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. నృత్యంతోనూ మరియు డప్పులు వంటి వాయిద్యాలతో నిర్వహించే కార్యక్రమాలు వేలాదిమంది భక్తులను ఆలయంవైపు ఆకర్షిస్తాయి. ఆలయం నాగర్‌కోయిల్ నుండి 14 కి.మీ మరియు కన్యాకుమారి నుండి 40 కి.మీ దూరంలో ఉంది.