వైష్ణో దేవి ఆలయం
(15వ శక్తి పీఠం)
కామరూపిణీ విఖ్యాతా !
హరిక్షేత్రే సనాతినీ !!
యోనిముద్రా త్రిఖంఢేశీ!
మాసే మాసే నిదర్శితా !!
(15వ శక్తి పీఠం)
కామరూపిణీ విఖ్యాతా !
హరిక్షేత్రే సనాతినీ !!
యోనిముద్రా త్రిఖంఢేశీ!
మాసే మాసే నిదర్శితా !!
బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.
దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.
మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.
సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.
అస్టాదశ శక్తిపీఠములయందు 15వ శక్తి పీఠముపై విభిన్న వాదనలు ఉన్నవి సతీ దేవి పుర్రే భాగము పడియున్న జమ్మూ కాశ్మీర్ లోని కాత్రా వద్ద వైష్ణవ దేవి కొండలపై ఉన్న వైష్ణవీ దేవి శక్తి పీఠమని మరి కొందరు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వద్దనున్న సతీదేవి నాలికపడిన జ్వాలాముఖీ శక్తి పీఠమని అందురు. ఈరెండునూ కూడా సతీదేవి శరీర భాగములు పడిన 51 శక్తి పీఠములలోనివే. రెండు క్షేత్రములలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆజ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు. శంకరాచార్య విరచిత స్తోత్రము నందు జ్వాలాయం వైష్ణవీ దేవీ గయా మాంగల్య గౌరికా అని ఉన్నది. ‘జ్వాలాయాం వైష్ణవీదేవి’ అనగా కాంగ్రాలోని జ్వాలాముఖే దేవిగుడి కాదని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు. వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఆష్టాదశ శక్తిపీఠములు 18 నందు ఒక ముఖ్య శక్తి పీఠం.
ఈ పుణ్యక్షేత్రం హిమాలయములలోని వైష్ణవదేవి కొండలపై నెలకొనిఉంది. హిందువులు వైష్ణోదేవినే మాతారాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. మరియు ఈ మాత జ్వాలా రూపములో ఉంటుంది కాబట్టి జ్వాలాముఖి అనికూడా పిలుస్తారు. ఈ ఆలయం జమ్ము – కాశ్మీర్ రాష్ట్రంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో సముద్ర మట్టమునకు 5200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల నుంచి వున్నదని కనుగొన్నారు. సతీదేవి పుర్రె త్రికూట పర్వతములలోని ఈ ప్రదేశమునందు పడినట్లు ఈ క్షేత్రము వైష్ణోదేవి శక్తి పీఠముగా వెలుగొందుచున్నట్లు పురాణ కధనము. శివుడు శక్తి పీఠములు అన్నిటికీ కాలభైరవుడిని క్షేత్ర పాలకునిగా నియమించాడు. అందువలన శక్తి పీఠములు అన్నిటిలోనూ క్షేత్ర పాలకుడు కాలభైరవుని ఆలయం కలదు. ఈ కాల భైరవుని దర్శనము అనంతరమే యాత్ర పూర్తి అవుతుంది మరియు క్షేత్ర పాలకునిగా భైరవుని ఆలయము ఉన్నది. ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది. దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేడిది. ప్రస్తుతం మార్గం సుగమంచేశారు. ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు. దర్శనానికి సుమారు 14 కి.మీ కొండ ఎక్క వలసి ఉంటుంది మార్గములో పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది. అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు. ఈ కధ పురాణ ప్రవచనము మరియు గ్రంధ ఆధారములున్నవి. మెట్ల మార్గముద్వారా వైష్ణోదేవి ఆలయము చేరుకొను యాత్రికులు “ఆగేవాలే బోలో జైమాతాకీ పీఛేవాలే బోలో జైమాతాకీ పాల్కీవాలే బోలో జైమాతాకీ ఘోడేవాలే బోలో జైమాతాకీ” అంటూ చేసే నినాదాలతో తోటి యాత్రికులు శృతి కలపకుండా వుండలేరు. త్రేతాయుగమునుండి వైష్ణోదేవిపై ప్రచారములో నున్న కధనము కూడా ప్రకారము. వైష్ణోదేవి లక్ష్మీస్వరూపమని, పార్వతీ స్వరూపమని అంటారు. కానీ మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి ముగ్గురి తేజోమయ స్వరూపం వైష్ణోదేవి. పూర్వము అసురుల బాధలు ఎక్కువగా వుండి. వారితో పోరాడి భూలోకంలో ధర్మాన్ని ప్రజలని రక్షించుటకు జగన్మాతలు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయ సంకల్పించి ఒక అందమైన యువతని సృష్టించి ఆ యువతిని భూలోకంలో రత్నాకరసాగర్ అనే ఆయనకి విష్ణు అంశతో పుత్రికగా జన్మించి ధర్మ కార్యాలు చేయమని, ఆధ్యాత్మిక పరిపక్వత చెందిన పిమ్మట శ్రీమహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేయదినది.
వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమై ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో చేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి రాగా వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే కోరిక తీరలేదు.
బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించ మని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, కష్టాలు తీర్చమని ఆదేశించాడు. శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో తన తపస్సు కొనసాగించింది. ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసం రాసాగారు.
కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకు రావటానికి తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.
వైష్ణవి భక్తుడు శ్రీధర్ ఒకసారి ఊరందరినీ భోజనానికి ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని, భైరవనాధ్ తో సహా మిగతా శిష్యులను భోజనానికి ఆహ్వానించాడు. భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినలేదు. భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్ళి తన తపస్సును కొనసాగించింది. భైరవుడు ఆమెని వదలకుండా వెంటాటగా. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీదపడింది. అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధించాడు. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.
తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీ లంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు. ఇక్కడ సతీదేవి యొక్క తల భాగము పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంత మైనదిగా భావిస్తాయి. గృహలో జ్వాల మండుతూ ఉంటుంది. అది ఎన్నివేల ఏళ్లనుండి అలా మండుతూందో ఆ జ్వాల భూమిలోనుండి ఎలా వస్తూందో కూడా తెలియదు.
కాత్రా రైల్వేస్టేషను నుండి చెక్ పోస్ట్ వరకు ఆటోలో చేరుకొని ఆచటి నుండి కొండపై ఉన్న వైష్ణోదేవి గుడికి సుమారు 14 కి.మీ కాలినడకన, గుర్రములపై వెళ్లవచ్చును మరియు హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. హెలీకాప్టర్ పై కొండపై దిగిన పిమ్మట సుమారు రెండు కిలోమీటర్లు దిగువకు నడక గుర్రాలమీద, పల్లకిల్లో కొండ దిగవలసి ఉంటుంది. వాతావరణం బాగా ఉంటేనే హెలీకాప్టర్ సర్వీసు ఉంటుంది. చెక్ పోస్ట్ నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగివున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచుకోవచ్చు. ఇచట మా వైష్ణోదేవి దేవస్తానం అద్దెప్రాతిపదికపై రూములు డార్మెటరీ కేటాయిస్తారు.
IPLTOURS – Indian Pilgrim Tours