పంచారామ క్షేత్రములు
(IPLTOURS)
(IPLTOURS)
మనదేశం హిందూ సాంప్రదాయానికి పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. మహిమాన్విత ఆలయాలు అనేకం ఉన్నాయి. ఆలయాలు మూడు విధములుగా విభజింపబడినవి. దేవతలచేనిర్మించబడిన స్వయంభూః ఆలయములు, ఋషులచే ప్రధాన ఆరాధ్యదైవము ప్రతిష్టించబడి నిర్మించబడిన ఆలయములు, మానవప్రతిష్ట అనగా రాజుల మరియు ఇతరులవలన ఆరాధ్యదైవము ప్రతిష్టించబడి నిర్మించబడిన ఆలయములు. ఇందు ఋషిప్రతిష్ట, మానవప్రతిష్ట ఆలయములకంటే దైవ నిర్మితమైన స్వయంభూః ఆలయములు కేవలము ఒకేరాత్రిలో నిర్మించబడినట్లు ప్రజలనమ్మకము. అట్లుదేవతలచే నిర్మించబడిన ఆలయములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో నెలకొని ఉన్న అమరారామ, సోమారామ, క్షీరారామ, ద్రాక్షారామ, కుమారరామ అనుపేర్లతో పంచారామదివ్య క్షేత్రములుగా ప్రసిద్ధిచెందినవి. గుంటూరుజిల్లా అమరావతినందు అమరేశ్వరుడు, పశ్చిమగోదావరిజిల్లా భీమవరంనందు సోమేశ్వరుడు, పాలకొల్లునందు క్షీరారామేశ్వరుడు, తూర్పుగోదావరిజిల్లా ద్రాక్షారామనందు భీమేశ్వరుడు, సామర్లకోటనందు కుమారరామేశ్వర నామధేయములతో స్వామి భక్తులను అనుగ్రహించు చున్నారు. ఈఅయిదు పుణ్యప్రదేశములు ఆంధ్రప్రదేశ్రా ష్ట్రములో నెలకొని ఉండుట విశేషము.
ఈఅయిదు క్షేత్రములు ఒకెరోజున దర్శించెదమన్న రైలు నందు విజయవాడ కానీ గుంటూరు కానీ చేరుకొని ఆచటినుండి ప్రయివేటు వాహనమునందు అమరావతినందు అమరేశ్వర దర్శనముతో ప్రారంభించి భీమవరమునందు సోమేశ్వరుని, పాలకొల్లునందు క్షీరారామేశ్వరుని, ద్రాక్షారామనందున్న భీమేశ్వరుని చివరిగా సామర్లకోటనందున్న కుమారరామేశ్వరుని దర్శించి సామర్లకోటనందు రైలు ఎక్కవచ్చును లేదా సామర్లకోట రైలునందు చేరి ఆచటినుండి ప్రయివేటు వాహనమునందు సామర్లకోట కుమారరామేశ్వరుని, ద్రాక్షారామ భీమేశ్వరుని, పాలకొల్లు క్షీరారామేశ్వరుని, భీమవరం సోమేశ్వరుని పిమ్మట అమరావతినందు అమరేశ్వరుని దర్శించుకొని విజయవాడ, గుంటూరు వాహనము మాట్లాడుకొని అక్కడే రైలు ఎక్కవచ్చును. భరింపరాని భాధలలో ఉన్నవారు పంచారామదర్శనముతోవారుచేసిన పాపములు నశించి కాశీక్షేత్ర దర్శనఫలము కలుగుననినానుడి.
పంచారామ క్షేత్రములను గురించి పురాణకధనము ప్రకారము మరీచిమహర్షి కశ్యప మహర్షి తండ్రి మరియు దేవతలకు, దానవులకుతాత. మరీచిమహర్షి కుమారుడైన కశ్యపుడు దక్షుని పదమూడుమంది కుమార్తెలను వివాహమాడినాడు. వీరిలో దితి మొదటిభార్య. ఈమెకు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు కుమారులు. వారుపెరిగిన వాతావరణము వలన లోకముపై క్రూరత్వము కలిగి విష్ణుద్వేషులై స్వాభావికముగా రాక్షసులైనారు. మహావిష్ణువు వరాహ మరియు నృసింహ అవతారములలో వారుఇరువురను సంహరించి లోకములను కాపాడినాడు. తనఇరువురు కుమారులను పోగొట్టుకొనిన దితి కశ్యపమహర్షిని సేవించి గర్భము దాల్చినది. ఇంద్రుడు ధితిమరియొక రాక్షసునికి జన్మనిచ్చునని, వానివల్లలోకమునకు కష్టములు కలుగునని తలచి దితిగర్భమునందు ప్రవేశించి తనవజ్రాయుధంతో ఆమె గర్భమునందలి పిండమును ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నము చేసినాడు. మరల ప్రతిభాగమును భాగములుగా విచ్ఛిన్నము చేసినాడు. కానీ దితిచేసిన శివవ్రతము ఫలమువలన పిండము ఆప్రమాదము నుండి బయటపడినది. విచ్ఛిన్నము కాబడిన భాగములు సప్తమాతృకలుగా స్వర్గలోకమునందు ఇంద్రపరివారములో చేరినారు. దృతి కశ్యపమహర్షి వద్దకు వెళ్ళి తనకు సంతానము అనుగ్రహించమని కోరినది. కశ్యపుడు శివుని గురించి తపస్సు చేయమని సలహా ఈయగా ఆమె శివునిగురించి పదివేల సంవత్సరములు తపస్సు చేసినది. ఆయన దీవనలుపొంది భర్తనుసేవించి వజ్రాంగుడుఅను కుమారునికి జన్మనిచ్చినది.
వజ్రాంగుని శరీరము వజ్రమువలె కఠినమైనది. వజ్రాంగుడు గొప్పయోధుడు. దితి తనకుమారుని ఇంద్రుని ఓడించ వలసినదిగా కోరినది. తల్లి కోరిక ప్రకారము వజ్రాంగుడు ఇంద్రుని ఓడించి స్వర్గలోకమునకు అధిపతి అయి తల్లికి కోరిక తీర్చినాడు. వజ్రాంగుడు ఇంద్రాది దేవతలను కారాగారమునందు ఉంచి శిక్షించినాడు. వజ్రాంగుని విషయము బ్రహ్మకు తెలిసి వజ్రాంగుని తండ్రి కశ్యపునితో వజ్రాంగుని వద్దకు వెళ్ళినాడు. బ్రహ్మ వజ్రాంగునితో ఆతను చేసినపని తప్పుయని అందువలన ఇంద్రుడు తదితర దేవతలను విడుదల చేయమని ఆదేశించినాడు. వజ్రాంగుడు ఇద్రుడు చెడ్డవాడని తనతల్లి గర్భమునందలి పిండమును ముక్కలు చేసినాడని అందువలననే ఆతనిని శిక్షించినాను అని తెలిపినాడు. వజ్రాంగుడు తనకు రాజ్యాధికారమునందు ఆశక్తిలేదని, తల్లి కోరిక నెరవేర్చినానని తనకు తత్వజ్ణానమును తెలుపకోరినాడు. బ్రహ్మ సంతోషించి వజ్రాంగునికి తత్వజ్ణానసారాంశమైన సాత్వికస్వభావము తెలియచేసినాడు. బ్రహ్మ వజ్రాంగ అనుకన్యను సృష్టించి వజ్రాంగునికి ఇచ్చి తిరిగి తనలోకమునకు వెడలిపోయినాడు. అప్పటినుండి వజ్రాంగుడు సాత్వికతత్వమునకు ఆలవాటుపడి రాక్షసభావము విడనాడివాడు కానీ ఆతనిభార్య అతని వలెనేకాక కామభావముతో నుండేదిది.
వజ్రాంగుడు భార్యను ఏమికావలెనో కోరుకొమ్మని అడిగినాడు. వజ్రాంగి తనకు విష్ణుమూర్తిని ఓడించి స్వర్గముతో సహా ముల్లోకములకు అధిపతిఅగు కుమారుడు కావలెనని కోరినది. వజ్రాంగుడు తనభార్య దేవతలతో వైరము కోరుచున్నదని అర్ధమై సందిగ్ధములో పడినాడు. కానీ సత్వగుణము వదలక ఏమిచేయవలెనని ఆలోచించసాగినాడు.
బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మ దర్శనము ఇచ్చి వరము కోరుకొమ్మని చెప్పినాడు. వజ్రాంగుడు బ్రహ్మను స్తుతించి తనకు అమిత బలసంపన్నుడు మరియు తపోనిధి అయిన కుమారుడు కావలెను అని కోరినాడు. బ్రహ్మ మనస్సులో శివుని ధ్యానించి వజ్రాంగుని కోరిక తీరునట్లు ఆశీర్వదించినాడు. బ్రహ్మ వరప్రభావమువలన వజ్రాంగికి తాతకశ్యపునిచే పేరు పెట్టబడిన తారకాసురుడు అనుకుమారుడు జన్మించినాడు. తారకాసురుని జననముతో ప్రజలు భవిష్యత్తులో పెద్ద ఉపధ్రవము సంభవించునను భయముకలుగునట్లు అనేక ఆశుభ శకునములు కనపడినవి. ఆబాలుడు ఒకపర్వతమువలే పెరిగి మహాబలవంతుడు అయినాడు.