అష్టాదశ శక్తిపేఠములకు ద్వాదశ జ్యోతిర్లింగములతో పాటు సమాన ప్రాముఖ్యత ఉన్నది.
లంకాయాం శాంకరీదేవి కామాక్షీ కాంచీపురే
ప్రధ్యుమ్నే శ్రుంఖలాదేవీ చాముండి క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా శ్రీశైలే బ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరా
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా
ఓడ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయం వైష్ణవీదేవీ గయాయాం మాంగల్య గౌరికా
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ సుపీఠానీ యోగినామపి దుర్లభం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం సర్వ రోగహరాం దివ్యం సర్వ సంపత్కరం శుభం.
బ్రహ్మదేముడు శక్తి మరియు శివుడిని సంతృప్తివిశ్వ సృష్టిలో శక్తి సహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడి నుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వ సృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ మరలా సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మ కుమారుడు దక్షుడు సతిని తన కుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దానికి దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికి ఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించి నాడు. బ్రహ్మ పృధ్వీని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తన కుమార్తె సతిని శివునికి ఇచ్చి వివాహము చేయుట విరమించు కొనినాడు. కానీ సతి శివుని యందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈ వివాహము దక్షునికి శివుని యందు ద్వేషము పెంచినది.
దక్షుడు నిరీశ్వర యాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానము పంపి కైలాస మందున్న శివ సతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నంది మరియు ఇతర ప్రమధగణాలను వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్ష ప్రజాపతిచేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షుని కుమార్తె మరియు శివుని భార్య సతీదేవి యోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. పంచ ప్రాణాలనూ వాటి మూల స్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగసి పడ్డాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది.
సతీదేవి ఆత్మాహుతి గురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలిపోయాడు. ప్రళయ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జట ఒకటి తెంచి, భూమి మీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆ మంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి సాష్టాంగప్రణామంచేయగా ప్రమథగణాలతో బయల్దేరివెళ్లి, దక్షునియజ్ఞం ధ్వంసంచెయ్యమని చెప్పాడు శివుడు.
మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ. ఆ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆ పోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ఆగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.
సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూ దేశమునందు పడి ఆ దివ్యస్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షుని భార్య కోరికపై శివుడు మేషము ( మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు.
సతీదేవి గజ్జ భాగము మాత్రము శ్రీలంక లోని ట్రింకోమలి నందు పడినది. అట్లు భాగములు పడిన ప్రదేశములపై 108,51 మరియు 52 అనియు వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ముఖ్యమైనవిగా ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందు చున్నవి.
IPLTOURS – Indian Pilgrim Tours