రుద్ర ప్రయాగ – గౌరీకుండ్
(అగస్త్యముని, ఉఖిమత్, గుప్తకాశీ, గౌరీఖుండ్)
Shrines and temples on both ways 1.Rudraprayag to Kedarnath by Helicopter service 2. Rudraprayag to Kedarnath trek route through Gaurikund.
అగస్త్యముని
అగస్త్యముని సముద్రమట్టమునకు వేయిమీటర్ల ఎత్తులో రుద్రప్రయాగకు ఉత్తరంగా 18 కి.మీ. దూరంలో మందాకిని ఒడ్డున ఉన్న పట్టణం. ఇచ్చట ఆగస్తేశ్వర్ మహదేవ్ ఆలయముతో పాటు అగస్త్యమహర్షి ఆలయం మరియు అనేక దేవాతల రాతిశిల్పములతో ఉంటుంది. ప్రియరంజన్ మహర్షి ఆలయానికి అగస్త్యముని పట్టణం ప్రసిద్ధి. అగస్త్యమునిపేరుపై అగస్త్యమునిగా పట్టణం ప్రసిద్ధిచెందింది. ఆలయాన్ని స్థానికంగా ఆగస్తేశ్వర్ మహదేవ్ ఆలయమని పిలుస్తారు. ఆలయం లోపలగోడలపై రాళ్లపై చెక్కబడిన శిల్పములు కలవు. స్థానికులు వైశాఖిపండుగ సందర్భంగా జరుపు భారీజాతరకు అగస్త్యముని ఆతిధ్య మిచ్చువానిగా వ్యవహరిస్తారు. జాతరసందర్భంగా వెలకొలది భక్తులు, పర్యాటకులు పండుగ జరుపుకొనుటకు వచ్చేదరు. ప్రతి పన్నెండు సంవత్సరములకు ఒకసారి తొమ్మిదిరోజులు లక్ష యాగాన్ని నిర్వహిస్తారు. యాగం ముగిసినపిమ్మట యజ్ఞకుండం మూసివేయబడి మరలా 12 సంవత్సరములకు యాగశాల తిరిగి తెరువబడుతుంది.
ఉఖీమత్
రుద్రప్రయాగజిల్లా నందుకల ముఖ్యమైన హిందూ యాత్రాస్థలములందు ఉఖీమత్ ముఖ్యమైనది. అగస్త్యమునినుండి 25 కి.మీ దూరంలో ఉన్నది. పంచకేదార్ క్షేత్రములందు మధ్యమహేశ్వర్, తుంగనాధ్ క్షేత్రములకు మరియు ప్రకృతిసిద్ధమైన డియోరియోతాల్ అనబడు మంచినీటి సరస్సునకు కేంద్రస్థానం. శీతాకాలమునందు కేదార్నాథ్ మరియు మధ్యమహేశ్వర్ ఆలయములండలి ఉత్సవమూర్తులను ఉఖీమత్ నందున్న ఓంకారేశ్వర్ ఆలయమునకు తీసుకొనివచ్చి ఇచ్చటనే ఆరునెలలపాటు పూజలుచేసి మరలా వేసవికాలములో ఆలయములు తెరుచునప్పుడు కేదార్నాధ్ మరియు మధ్యమహేశ్వర్ఆ లయములకు తీసుకొనివెల్లేదరు. పురాణములందు తెలిపిన ప్రకారం బాణాసురుని కుమార్తె ఉషకు శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్ధునికి ఇచ్చట వివాహమైనట్లు తెలుపబడింది. బాణాసురుని కుమార్తె ఉష పేరున ఈప్రదేశమునకు ఉషామత్ అని దర్మిలా ఉఖీమత్ అని పేరువచ్చినది.
మాంధాత రాజు శివుని గురించి ఇచ్చటనే తపస్సు చేశాడు. ఓంకారేశ్వర ఆలయముతో పాటుగా శివ, పార్వతి, ఉష, అనిరుద్ధ, మాంధాత తదితరుల ఆలయాలు ఉఖీమత్ నందు కలవు. గుప్తకాశీ నుండి గోపికేశ్వర్ రహదారినందున్న ఉఖీమత్ ప్రతిసంవత్సరం శీతా కాలం ఆరునెలలు రావల్స్ అనెడి కేదార్నాధ్ ఆలయ పూజారుల నివాసస్థానం.
గుప్తకాశీ
వాడుకలో గుప్తాక్షి అయిననూ ఈక్షేత్రము గుప్తకాశీ (Guptakashi) ఉఖీమత్ నుండి 17 కి.మీ. దూరంలోనున్నది. మరియు గుప్తకాశీనుండి గౌరీకుండ్ 15 కి.మీ దూరంలో ఉన్నవి. పురాణ గ్రంధముల ప్రకాram వారణాశి (కాశీ) మరియు కాంచీపురము (కంచి) ఈశ్వరుని రెండుకనులుఅని భావించబడుచున్నది. మరియొక ఆరు క్షేత్రములుకూడా కాశీలుగా వారణాశీతో సమానమైనవిగా పరిగణించ బడుచున్నవి. దూరప్రయాణముచేసి వారణాశి సందర్శించ లేనివారు వారికిదగ్గరలో ఉన్నక్షేత్రము దర్శించిన కాశీదర్శనఫలం కలుగునని తెలుపబడినది. ఉత్తరాఖండ్ నందుకల ఉత్తరకాశీ (Uttarkashi), గుప్తకాశీ (Guptakashi), దక్షణ కాశీ (ఆంధ్రప్రదేశ్ నందు పిఠాపురము), తూర్పున భువనేశ్వర్ వద్ద గుప్తకాశీ, పశ్కిమమున నాశిక్ వద్ద కాశీ (పైతాన్) మరియు ఉత్తరమున హిమాచలప్రదేశ్ లో మండినందు కాశీ. పురాణములందు ఈక్షేత్రములన్నియు సమానమేననని తెలుపబడినది.
రుద్రప్రయాగ నుండి పంచకేదార్ మరియు ఛోటాచార్ ధామ్ లలో ఒక క్షేత్రమయిన కేదార్నాధ్ పయనించు మార్గములో గుప్తకాశీ మరియు అగస్త్యముని ఉన్నది. కేదార్నాథ్ హెలీకాప్టర్ పైపయనించువారు రుద్రప్రయాగ నుండి గౌరీకుంద్ చేరి అచట ఆలయములు దర్శించి 15 కి.మీ దూరములో నున్న గుప్తకాశీనందు విశ్రమించి అగస్త్యమునిచేరి హెలీకాప్టర్ పై కేదార్నాధ్ వెళ్ళి తిరిగి అగస్త్యమునిచేరి ఆచటినుండి రుద్రప్రయాగ పయనించవచ్చును. కాలినడక గుర్రం/పల్లకీపై కేదార్నాధ్ దర్శించువారు గౌరీకుంద్ నుండి పయనించువారు గుప్తకాశీ మరియు అగస్త్యమునిలో ఆలయములు సందర్శించి గౌరీకుంద్ చేరి బసచేసి మరునాడు ఉదయము కేదార్నాథ్ వెళ్లవచ్చును.
గుప్తకాశీ అనునది కాశీ (వారణాశి) నందుకల విశ్వనాధ ఆలయమును పోలియున్న అతిపురాతనమైన విశ్వనాధ ఆలయం. మరియు ఇచట శివపార్వతుల అర్ధనారీశ్వర ఆలయం ప్రాచుర్యం పొందిన ఆలయం. కధనం ప్రకారం మొఘల్రా జైన ఔరంగజేబు కాశీవిశ్వనాథ్ ఆలయం ధ్వంశంచేసి మసీదు నిర్మించినప్పుడు, వారణాశికి మహమ్మదాబాద్ గాపేరు మార్చినప్పుడు, కాశీనందలి శివలింగము బధ్రత నిమిత్తం గుప్తకాశీకి తరలించినారు. తరువాతాకాలంలో కాశీవిశ్వనాధ ఆలయం పునరుద్ధరించబడిననూ కాశీవిశ్వనాధుని అసలుశివలింగం గుప్తకాశీ లోనే ఉంచబడినది అనినమ్మకం. కాశీవిశ్వనాధుని ప్రధానఆలయమే కాక గుప్తకాశీచుట్టూ అనేక లింగములు మరియు శివుని విగ్రహాలు దర్శించవచ్చు. మందాకినినదికి అవతలితీరం నందుకల ఉకీమత్ లోని ఆలయమునందు శీతాకాలములో ఆరునెలలు కేదార్నాథ్ దైవం ఉత్సవమూర్తిని గౌరీకుండ్, పాత, గుప్తకాశీ మీదుగా ఉకీమత్ ఊరేగింపుగా ఒకఉత్సవము మాదిరిగా తీసుకువచ్చి పూజలకు ఆటంకం లేకుండా ఉంచెదరు. కేదార్నాధ్ ఆలయ పూజారులు కూడ శీతాకాలము ఆరునెలలు గుప్తకాశీనందు నివసించేదరు. విశ్వనాధ ఆలయమునకు ఎదురుగా మనికర్ణికకుండ్ అను పేరుతో ఒక చిన్న కోనేరు ఉన్నది. ఆలయము ఎదురుగానున్న శివలింగము గోముఖ్ (ఆవుతల) ఆకృతినుండి యమునానదినీరు మరియు ఏనుగుతల ఆకృతినుండి భగీరధనీరు వ్యూహాత్మకముగా శివలింగాన్ని అభిషేకించును. గుప్తకాశీకి 3 కి.మీ దూరంలో అగస్త్యముని అనిపిలువబడు (పాత) హెలీపాడ్ ఉన్నది. కేదార్నాధ్ హెలీకాప్టర్ పై పయనించువారు ఇచ్చటినుండి కేదార్నాధ్ వెళ్లవచ్చును.
సోనప్రయాగ
సొనప్రయాగ గుప్తకాశీనుండి సుమారు 29 కి.మీ దూరంలో మందాకిని నదీతీరంలో ఉన్నగ్రామం. ప్రస్తుతం లేకపోయినా భవిష్యత్తులో కేదార్నాధ్ మరియు బద్రినాథ్ పుణ్యక్షేత్రముల రైల్వేలైనులకు ఛోటా చార్ ధామ్ రైల్వేనందు ప్రతిపాదిత రైల్వే జంక్షను. శివపార్వతుల వివాహం జరిగిన ప్రదేశంగా సొనప్రయాగ గుర్తింపు పొందినది. మందాకిని మరియు బసుకినదులు కలియు సంగమప్రదేశమైనను పంచ ప్రయాగలలో ఒకటిగా గుర్తింపబడలేదు కానీ అద్భుతమైన మంచుతో కప్పబడిన హిమాలయపర్వత శిఖరములతో చుట్టబడి మనోహరమై ప్రకృతి సౌంధర్యంతో అలరారుప్రదేశం. ఇచ్ఛటి సంగమప్రదేశంలో స్నానంచేసినట్లయిన వైకుంఠధామం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
గౌరీకుండ్
శివునిభార్య అయిన పార్వతి/గౌరి పెరున ఈ పుణ్యస్థలము ప్రాశస్తమైనది. గౌరీకుండ్ శివుని సహచరిణి పార్వతి మరొపేరు గౌరి నివాస స్థలమని పురాణకధనం. సముద్రమట్టమునుండి సుమారు 6000 అడుగుల ఎత్తున కల గౌరీకుండ్ కేదారనాధ్ నడక దారికీ ప్రారంభ స్థానం. హిందూపురాణములందు, కధలయందు పార్వతి శివునిప్రేమను పొందుటకు యోగాభ్యాసాలతో తపస్సుచేసిన ప్రదేశం. స్థానిక కధనంప్రకారం హిమవంతుని కుమార్తెఅయిన పార్వతి తపస్సుచేసినప్పుడు నివసించి శివుడు ఆమెపై తనకుగల ప్రేమను తెలిపిన ప్రదేశం. శివపార్వతులకు త్రియుగి నారాయణ్ ఆలయమందు వివాహము జరిగినది. గౌరీకుండ్ నందుకల వేడినీటి బుగ్గలు స్నానఘట్టాలుగా మార్పుచెందినవి. ఈప్రదేశం గణేశుడు తన ఏనుగుతలను ఎలాపొందాడనే పురాణకధనంతో ముడిపడింది. పార్వతి శరీరంపైనున్న నలుగు పిండితో బొమ్మను రూపొందించి ప్రాణంపోసి, ద్వారంవద్ద కాపలాపెట్టి స్నానం చేయడానికి వెళ్లింది.
శివుడు వచ్చినప్పుడు బాలుడు వారి ప్రవేశము అడ్డగించినప్పుడు శివుడు త్రిశూలముతో బాలుని శిరస్సు నరికినాడు. చింతించున్న పార్వతిని ఓదార్చుటకు ఆమె బాలుని తిరిగి జీవింపచేయమని ఒత్తిడిచేయగా శివుడు గజాసురుని తలను బాలుని మొండేముకు అతికి జీవింపచేసినాడు.
గౌరీకుండ్ నందలి వేడినీరు హిందువులకు అతిపవిత్రమైనది. కుండంనందలి నీటియందు స్నానము చేసిన భక్తులు పవిత్రులు ఆవుదురని నమ్మకం. కుండమునందు స్నానముచేసి పవిత్ర హృదయంతో భక్తులు ఆలయమందు గౌరీదేవిని దర్శిస్తారు. ఆలయం ఉదయం 5-00 నుండి మధ్యాహ్నం 12-00వరకు తిరిగి 2-00 నుండి రాత్రి 9-00వరకు తెరచి ఉంటుంది. గౌరీకుండ్ నుండి పర్వతామార్గంలో ప్రయాసతో సుమారు రెండు కిలోమీటర్లు పయనించిన శివుడు మరియు పార్వతీదేవి విగ్రహాలతో గుహదేవాలయం ఉన్నది. గుహలో ఒకరాతిపై సహజంగా ఏర్పడిన గణేశుని ఆకారం కనిపిస్తుంది. పార్వతి ఈగుహనందే తపస్సు చేసినదని కధనం. దేవీ నవరాత్రులు మరియు శివరాత్రి ముఖమైన పండుగలు. గౌరీకుండ్ నందు బసకు ధర్మశాలు, హోటల్స్ ఉన్నవి కావున గౌరీకుండ్ నందు బసచేసి పరిసరములలోని ఆలయములు దర్శించవచ్చును.
గణేశుని ఆలయం
సొనప్రయాగకు సుమారు 3 కి.మీ దూరంలో ఆటవీప్రాంతములో ముండ్ కటియా అనుచోట తలలేని విఘ్నేశ్వరుని ఆలయం కలదు. ప్రపంచములో తలలేని వినాయకుని విగ్రహం ముండ్ కటియా నందుతప్ప మరెక్కడా కనపడదు. ఆలయం కేదారనాథ్ వరదలలో కొట్టుకొని పోయిన పాతనడకదారిలో ఉన్నది. ఇప్పుడు కేదార్నాథ్ నకు నూతన నడకదారి కల్పించినందున ఆలయము దర్శించుటకు సొనప్రయాగ నుండి వెళ్లవలసిఉన్నది. పురాణకధనం ప్రకారం శివుడు తనతపస్సుకు మెచ్చి అనురాగముతో గౌరీదేవి రూపంలోని పార్వతి వద్దకు వచ్చినప్పుడు పార్వతి ఒంటిపైనున్న నలుగుపిండితో బాలునివిగ్రహం చేసి ఆవిగ్రహమునకు ప్రాణప్రతిష్ట చేసి కావలిఉంచి తాను గౌరీకుండ్ నందు స్నానము చేయుటకు వెళ్లినప్పుడు శివుడు పార్వతిని కలియుటకు రాగా కావలిఉన్న బాలుడు అడ్డగించినాడు. శివుడు కోపముతో త్రిశూలముతో బాలుని శిరమును ఖండించినాడు.
ఆతలలేని బాలునిస్వరూపం ముండ్ కటియానందు గల వినాయకుని విగ్రహం. పార్వతి బాలునికేకకు వచ్చి చింతించినప్పుడు శివుడు గజాసురుని తలను బాలుని మొండెమునకుచేర్చి తిరిగి జీవింప చేసినాడు. ఆవిధముగా వినాయకుడు గణేశునిగా ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందినాడు.
త్రియుగినారాయణ్ ఆలయం
సొనప్రయాగనుండి గౌరీకుండ్ మార్గములో సొనప్రయాగనుండి సుమారు 7కి.మీ. దూరంలో గౌరికుండ్ నుండి 5 కి.మీ దూరంలో త్రియుగినారాయణ్ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన పవిత్ర పుణ్య స్థలం. ఈ ఆలయం లో రెండు అడుగుల ఎత్తు గల శ్రీలక్ష్మీ నారాయణుల విగ్రహ మూర్తులు ఉన్నాయి. ఈ ఆలయం ప్రాంగణంలోనే 3 కుండములు వరుసగా ఉన్నాయి. వీటిని బ్రహ్మ కుండం, విష్ణు కుండం, సరస్వతి కుండం అయితే శ్రీమహావిష్ణువు యొక్క నాభినుండి సరస్వతినది జన్మించి, ఈ సరస్వతి కుండంలో కలుస్తుందని స్థలపురాణం చెబుతుంది. ఈజలం మహిళలను సంతానవంతులుగా చేస్తుందని నానుడి. బ్రహ్మకుండంలోని నీరు పసుపుపచ్చ రంగులో ఉంటాయి. కుండంలో బంగారురంగుతో ఉండే రెండు చిన్నపాములు ఉంటాయి. ఇవి ఎవరికి హాని చేయవని చెబుతారు. సత్యయుగంలో ఇచ్చటనే పరమశివుడు పార్వతీదేవిని అందరు దేవతల ఎదుట వివాహమాడినాడు. మాహాశివుడు పార్వతిదేవిని వివాహం చేసుకుని ఆతరువాత అర్ధనారీశ్వర రూపంతో దర్శనమిచ్చారు ఇక్కడఉన్న పీఠంపైన వారివివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
ఆలయమునకు ఎదురుగా బ్రహ్మశిల అనిపిలవబడు రాయిఉన్నది. ఇచ్చటనే పార్వతీ పరమేశ్వరుల వివాహ కాలంనుండి వెలుగుచున్న అఖండజ్యోతి ఉన్నది. ఈజ్యోతి నిరంతరం మండుతూనేఉంటుంది. ఈజ్యోతి సత్య, త్రేతా, ద్వాపర యుగాల నుండి నిరంతరం వెలుగుతొందని, ప్రస్తుత కలియుగంలో ఆరిపోకుండా సాక్షిగా నిలిచిందని చెబుతారు. ఇలా మూడుయుగముల నుండి నిరంతరం జ్వలించు మంటకు నారాయణుడు సాక్షిఅని స్వామికి త్రియుగినారాయణ్ అనే పేరువచ్చిందని స్థలపురాణం చెబుతుంది. ఈజ్యోతినుండి వచ్చు విభూధి దంపతుల వివాహబంధాన్ని ఆశీర్వదిస్తుందని చెబుతారు
పై ఆలయములే కాక పంచకేదార్ క్షేత్రములందు ఒకటి అయిన తుంగనాధ్ మరియు శివుని కుమారుడు కార్తికేయుని పేరుపై కార్తీక్ స్వామి ఆల్యం రుద్రప్రయాగ పోఖ్రా మార్గంలో 38 కి.మీ దూరంలో ఉన్నవి. ఈ రెండు ఆలయములు పర్వత ప్రాంతమందు నడక లేదా డోలీ నందు వెళ్లవలసి ఉన్నందున విపులీకరించుట లేదు.