పశుపతినాధ్

(IPLTOURS)

హిమాలయన్ యాత్ర పురస్కరించుకొని హరిద్వార్ వద్ద ఆగి ఆచటి నుండి మరలా పశుపతినాధ్ ముక్తినాథ్ దర్శించుటకు ప్రయాణము ఆరంభించవలెను.

పశుపతినాధ్ దర్శనమునకు మార్గము

హరిద్వార్ నుండి రక్సెల్   రైలు
రక్సెల్ నుండి భీర్జంగ్  టాంగా
భీర్జంగ్ నుండి ఖాట్మండూ    బస్సు/టాక్సీ
ఖాట్మండూ    పశుపతినాథ్ ఆలయం 

మరలా వెనుకకు హరిద్వార్ పై రీతిలో

హైదారాబాద్/ఢిల్లీ నుండి ఖాట్మండూ విమానం (సుమారు రూ 16,000/- ఒక్కొక్కరికి ఒక వైపు –అనగా సుమారు ఒక్కొక్కరికిరూ 60,000/- అవుతుంది విమానం పై).

పశుపతినాధ్ ఆలయం

భారత దేశ సరిహద్దులో నున్న నేపాల్ ముఖ్య పట్టణం ఖాట్మండూ. ఖాట్మండూ ప్రయాణము మనసుకు ఉల్లాసము మరియు ఆలయము చేరి పశుపతినాధుని దర్శించిన పిమ్మట భక్తి భావం పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖాట్మండూ పట్టణమున కుతూర్పు దిక్కున ఈశాన్యముగా భాగమతినదీ తీరమున ప్రశస్తమైన మరియు పవిత్రమైన ఈ పశుపతినాధ్ ఆలయ సముదాయము ఉన్నది. ఈ దేవాలయ సముదాయము వివిధ ఆలయములతోనూ ఆశ్రమముల తోనూ కూడి నాగరికత వెళ్ళి విరియు ప్రదేశము. ఈ ఆలయ ప్రాంగణములోనే వాసుకినాధ్ ఆలయం, ఉన్మత్త భైరవ ఆలయం, సూర్యనారాయణ ఆలయం, కీర్తి ముక్త భైరవ ఆలయం, బుద్ధనీలకంఠ ఆలయం, హనుమాన్ ఆలయం, 184 శివలింగముల సముదాయము ఉన్నవి. ప్రాంగణమునకు వెలుపల రామ మందిరం, విరాట్ స్వరూప ఆలయం, 12 జ్యోతిర్లింగముల ఆలయం, గుహేశ్వరి ఆలయం ఉన్నవి.

 కేదార్నాథ్ దర్శించిన పిమ్మట పశుపతినాధ్ చూడాలి. కారణం కేదార్నాధ్ నందు శివుని అనగా నందీశ్వరుని మూపురము శివలింగం స్థానములో ఉంటుంది తలభాగము పశుపతినాధ్ నకు 25 కి.మీ. దూరములో నున్న చౌలి మహేశ్వర్  అని చెపుతారు. నందీశ్వరుని మూపురము కేదార్నాధ్, నాభి మరియు ఉదర భాగము మధ్యమహేశ్వర్ లోనూ, చేతులు తుంగనాధ్ లోనూ, ముఖము రుద్రనాధ్ లోనూ, కురులు కల్పెశ్వర్ నందు ఇవి పంచ కేదార్ గాను తల పశుపతినాధ్ వద్ద చౌలి మహేశ్వర్ నందు దివ్య  శైవ క్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి.

2009 సంవత్సరమునందు కేదార్నాధ్ పీఠము ముఖ్య అర్చకులు శ్రీ జగత్ గురు భీమశంకరలింగా శివాచార్య అనువారు ఈచౌలేశ్వర మహదేవ్ కేదార్నాధ్ నకు చెందిన శివుని తలభాగమేనని ధృవ పరచినారు. పశుపతినాధ్ ఆలయ ముఖద్వారము వద్ద కేదార్నాధ్ క్షేత్ర చిత్ర పఠము కలదు. భీర్ జంగ్ నుండి ఖాట్మండూ బస్సులో కంటే అద్దె బోలెరో తదితర వాహనాల్లో వెళితే బస్సు కంటే కొంచెం ఎక్కువ అవుతుంది కానీ సమంజసంగానే ఉంటుంది భీర్ జంగ్ చెక్ పోస్ట్ దగ్గర మన కరెన్సీ ఇచ్చి నేపాల్ కరెన్సీ తీసుకోవచ్చు. మన రూపాయలు కూడా చలామణీ అవుతాయి. ఉదయం వాహనం ఎక్కితే సాయంత్రానికి ఖాట్మండూ వెళతాము. అందువల్ల త్రోవలో తినడానికి తిండి పట్టుకు వెళ్ళాలి. ఖాట్మండూ నందు Maitri Pashupati Dharamshala పేరుతో 82 రూములతో 400 పడకల ధర్మశాల నిర్మించినారు. ఇందు వసతి పొందవచ్చును లేదా ఖాట్మండూ చేరేక అక్కడ హోటల్లో బస చేయవచ్చును. ఖాట్మండు నందు అనేక బడ్జెట్ మరియు స్టార్ హోటేల్స్ ఉన్నవి.

ఖాట్మండూ పట్టణమునుండి పశుపతినాథ్ ఆలయ సముదాయం సుమారు 3 కి.మీ. దూరములో ఉన్నది. పశుపతినాధ్ దేవాలయము సుమారు 2400 సంవత్సరాల ముందు నుండి ఉన్నటువంటి అతి పురాతనమైన హిందూ దేవాలయము. పశుపతిగా ఇచట మూల విరాట్టు ప్రసిద్ధుడు. శివుడు పార్వతి ఖాట్మండు లోయకు భాగమతి నదీ తీరమునందు విశ్రాంతి తీసుకొనుటకు వచ్చి. ఆచటి ఆటవీ ప్రాంతము నందలి ప్రకృతి సౌందర్యమునకు ముగ్ధులై లేళ్ళ రూపము ధరించి విహరించ సాగారు. ఆ అటవీ ప్రాంతమునందు శివుడు పార్వతితో కూడి లేడి రూపములో అచట విహరించిన సమయములో అనేక ప్రకృతి రమణీయ ప్రాంతములు దర్శించినారు. దేవతలు ప్రజలు శివుని వెదకుతూ వచ్చి లేడి రూపములో విహరించుచున్న శివుని ఆ ఆటవీ ప్రాంతము నందు కనుగొనినారు. శివుడు ఆ చోటును వదలి వచ్చుటకు నిరాకరించి తాను లేడి రూపములో భాగమతినదీ తీరమునందు నివశించినందున పశుపతినాథ్ రూపములో ఉండెదనుఆని ప్రకటించినాడు. ఆరూపము వదలి వెళ్ళిన పిమ్మట ఆ లేడి కలేబరము శివుని రూపముగా కొలచెడివారు. పిమ్మట ఆ కలేబరము లింగ రూపములో భూమిలో కలసిపోయినది.

pasupathinath

సమీప గ్రామము నుండి చంద్రవన్ పర్వత  ప్రాంతములో గల ఒక గుహనందు ఆశ్రయము పొంది వేల సంవత్సరాల తరబడి కామధేను అనుగోవు ప్రతిరోజూ భూమిలో లింగము కల ఆ ప్రాంతమునకు వచ్చిభూమి పై భాగమున పాలను కురిపించేది. ప్రజలు కామధేను అచట పాలు కురిపించుట చూచి ఆశ్చర్యము చెంది అక్కడ ఏమి ఉన్నది అని భూమి త్రవ్విచూడగా అచట అతి ప్రకాశవంతమైన లింగమును కనుగొనిరి. అప్పటినుండి ఆ లింగమును పశుపతినాధ్ పేరుతో అర్చించుట ప్రారంభమైనది. 5 వ శతాబ్దములో ప్రచండ దేవ మహా రాజు పశుపతినాధ్ ఆలయ నిర్మాణము చేసినాడు. అటుపిమ్మట 14 వ శతాబ్దములో ఆలయ ప్రాంగణములో రామాలయ నిర్మాణము జరిగినది. ఈ ఆలయమును దర్శించు భక్తులు శివలింగమునకు వెనుక భాగమున నిలచిన అట్టివారు తిరిగి జంతువు రూపములో మరుజన్మ యందు జన్మించరని మరలా మనుష్య జన్మ ఎత్తుతారు ఆని నానుడి. పశుపతినాధ్ ఆలయమునందు ప్రముఖముగా శివరాత్రినాడు అత్యంత వైభవముగా సుమారు ఒక కోటి మంది యాత్రికులు భక్తులతో విశేషమైన ఉత్సవము జరుగుతుంది. 

పశుపతినాధ్ ఆలయములో నిర్వర్తించు కార్యక్రమమములు   

ఉదయం 04-00    పశ్చిమ ద్వారం సందర్శకుల నిమిత్తం తెరుస్తారు
ఉదయం 08-30       పూజారుల ఆగమనం స్వామివారి స్నానం వస్త్రములు ఆభరణములు అలంకారం 
ఉదయం 09-30  స్వామివారికి భాలబోగ్
ఉదయం 10-00 భక్తుల పూజలు
మద్యాహ్నం 01-50 స్వామివారికి మద్యాహ్నం నైవేద్యం
మద్యాహ్నం 02-00     ఉదయం పూజలు సమాప్తం
సాయంత్రం 05-15     సాయం హారతి ప్రారంభం
సాయంత్రం 06-00 సాయం పూజలు మరియు భాగమతి తీరంలో గంగా హారతి
సాయంత్రం 07-00 ఆలయ మూసివేత

చంగు నారాయణ్ ఆలయం, భక్తాపూర్

ఖాట్మందూ పట్టణము నకు ఉత్తర భాగమున సుమారు 12 కి.మీ. దూరములో భక్తాపూర్ జిల్లా చంగు గ్రామమునకు చేరువలో చంపక చెట్ల అడవినందు కొండ పై భాగమున ఈ చంగు నారాయణ్ ఆలయమున్నది. నారాయణుని రూపములో శ్రీ మహా విష్ణువునకు పాగోడ పద్ధతిలో నాలుగు ద్వారములతో రాళ్ళయందు మలచబడిన సింహములతో రక్షింపబడుచున్నట్లు నిర్మించబడిన ఆలయము. ఈ ఆలయమునందు అతి పెద్దదైన గరుడుని విగ్రహము కలదు. ఆలయ ముఖః ద్వారము వద్ద భూపేంద్ర మల్ల మహారాజు మరియు రాణి విగ్రహములు కలవు. ఈ ఆలయమునందు 1500 సంవత్సరముల క్రిందటి నరశింహ విగ్రహము ముఖ్య ఆకర్షణ. ఈ ఆలయం 2015 సంవత్సరమునందు సంభవించిన భూకంపమునందు దెబ్బతిన్నది. ఇచట గల చంగు మ్యూజియం నందు 500 సంవత్సరముల క్రిందటి చేతులు శుభ్రముచేసుకొను బేసిన్ మరియు 225 సం.ల క్రిందటి వరిపంట చూడవచ్చును.  

గుహేశ్వరి ఆలయం

పశుపతినాధ్ ఆలయ ప్రాంగణములో కల గుహేశ్వరి మాత ఆలయం 108 శక్తి పీఠములలో ఒకటి. భాగమతి నది ఒడ్డున 17 వ శతాబ్ధములో నిర్మించబడిన ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి.ఈ ఆలయము వద్ద భైరవ కుండము అను పేరుతో ఒక గుంట ఉన్నది. దశన్ ఉత్సవమునందు ఖాట్మండు మరియు పరిసర ప్రాంతములనుండి భక్తులు ఈ దేవతను పూజించుటకు వచ్చేదరు. ఈ ఆలయ పరిసరములు అతి శక్తి వంతమైనవి. యాత్రికులు ఇచ్చటకు మంచి జీవితము కోరుచూ పూజలు చేసేదరు.   

దక్షణ కాళీ ఆలయం  

ఖాట్మండు పట్టణమునకు 20 కి.మీ. దూరములో పార్థిపింగ్ గ్రామమునకు 1 కి.మీ. దూరములో ఈ దక్షణ కాళీ ఆలయమున్నది. నేపాల్ నందు గల ముఖ్యమైన  కాళీ ఆలయములందు ఒక ఆలయము. ఈ ఆలయము 14 వ శతాబ్దమునందు నిర్మించబడినది. ప్రతి మంగళ వారం మరియు శనివారం ఈ ఆలయము నందు జంతు బలులు ఇచ్చేదరు. హిందూ మతమునందు నమ్మకము లేనివారు ఈ ఆలయము నందు ప్రవేశము మరియు పూజలు చేయుట నిషిద్దము. 

మనకామన ఆలయం  

పార్వతి ప్రతిరూపమైన భగవతి లేదా దుర్గా భవానీ పేరుతో గల ఈ మనకామన ఆలయం గోర్ఖా జిల్లా క్వైంట్ గ్రామము నందు కొండ పై భాగమున అంచునందున్నది. ఈ ఆలయము 17 వ శతాబ్దములో నిర్మించబడినది. ఈ ఆలయమందు దేవిని నిర్మల మనస్సుతో కొలచినట్లయితే కోరికలు సిద్ధించును అందువలననే ఈ దేవిని మనకామనాదేవి అని పిలిచెదరు. పాగోడా తరహా పై కప్పు కల ఈ నాలుగు అంతస్తుల మనకామన ఆలయమునందు ఆరుగురు యాత్రికులు మాత్రమే ఒక మారు ప్రవేశము కలదు. వస్త్రములు, రంగులు, పువ్వులు మరియు సెంట్లతో యాత్రికులు ఈ అమ్మవారిని పూజించెదరు. ఈ దేవిని అర్చించుటకు హిందువులు కానివారికి నిషిద్దము.

బుద్ధినికాంత ఆలయం

బుద్ధినికాంత ఆలయం శివపురి కొండలు శివపురి కొండల పాదముల చెంత ఈ బుద్ధినికాంత ఆలయము నందు దక్షణ ఆసియాలోకుండములో కల నీటిపై తేలియాడు అత్యంత అద్భుతమైన పవళించియున్న విష్ణుమూర్తి ప్రతిమ ఉన్నది.  ఒకే ఒక్క రాతిపై పవళించియున్న 5మీటర్ల విష్ణుమూర్తి విగ్రహము ఆ విత్రహములో విష్ణువు నాభినుండి ఉద్భవించిన కమలముపై బ్రహ్మ విగ్రహము కలదు. అక్టోబరు నవంబరు మాసముల మధ్య హరిభోందిని ఏకాదశినాడు వేలకొలది భక్తులు ఈ ఆలయము సందర్శించెదరు. పవళించియున్న విష్ణువును గాఢ నిద్ర నుండి లేపుటకు ఉత్సవము నిర్వహించెదరు. నేపాలీ బౌద్ధులు తప్ప హిందువులు కాని ఇతరులకు ఈ ఆలయ ప్రవేశము నిషిద్ధము. కెమెరాలు మొబైలు ఫోనులు ఈ కుండము ప్రాంతములో కఠినముగా నిషేదము. ఈ విగ్రహమునకు చేరువలోనే రుద్రాక్ష చెట్టు ఉన్నది. దీని నుండి జారు రుద్రాక్షలు అక్కడి ప్రజలు ఏరుకొని నామ మాత్రపు ధరకు విక్రయింతురు. ఏకముఖి నుండి అన్నీ ముఖముల రుద్రాక్షలు లభ్యమగును.